ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాపై ఆసక్తికర అప్ డేట్స్..!
ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాతో పాటు జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన కెరీర్ లో మైలురాయి అయిన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. సాహో చిత్రం షూటింగ్ స్లోగా సాగడంతో.. ఈలోపు రాధాకృష్ణ మూవీని ప్రభాస్ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే రాధాకృష్ణ - ప్రభాస్ ల సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటలీ వెళ్లింది కూడా. గత శనివారమే ఇటలీలో మొదలైన షూటింగ్ లో పూజ హెగ్డే చేతిలో హిందీ స్క్రిప్ట్ పెట్టారట.
ఒకేసారి మూడు భాషల్లో...
మరి బాహుబలితో ఇండియా వైడ్ గా పలు భాషల్లో సినిమాలు చెయ్యడానికే ప్రభాస్ మొగ్గు చూపడం... అందులో భాగంగానే సాహో సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తియ్యడం.. తాజాగా రాధాకృష్ణ మూవీని కూడా ప్రభాస్ మూడు భాషల్లో ఎనౌన్స్ చేసాడు. మరి ఒకటీరెండు చిత్రాల అనుభవం ఉన్న దర్శకులను తనకున్న క్రేజ్ తో ఇలా మూడు నాలుగు భాషల్లో సినిమాలు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభాస్ కే తెలియాలి. ఇక ఆ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నవే కావడం గమనార్హం. ఇకపోతే హీరోయిన్ పూజ హెగ్డేకి తెలుగు అంతంత మాత్రంగా రావడంతోనే ఇలా హిందీ స్క్రిప్ట్ ని పూజ చేతిలో పెట్టిందట చిత్ర బృందం. ఇక పూజ హెగ్డే ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుని.. అరవింద సమేత కి ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
90లలోని సినిమాలకు రీమేక్
ఇకపోతే రాధాకృష్ణ - ప్రభాస్ సినిమా ఒక మలయాళ మూవీకి ఫ్రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా 1990లో వచ్చిన అయ్యర్ ది గ్రేట్ కి ఫ్రీమేక్ అంటున్నారు. ఆ సినిమాలో జరగబోయే ప్రమాదాలు, సంఘటనలు ముందే ఊహించే శక్తి ఉన్న మమ్ముట్టి ఓ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడతాడు. పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్న విలన్ ల భరతం కూడా ఇదే తరహాలో పడతాడు. ఇక రాధాకృష్ణ డైరెక్షన్ లో రాబోయే సినిమాలోనూ ప్రభాస్ ఇదే తరహాలో పోరాడతాడు అని చూచాయగా తెలుస్తున్న విషయం. అయితే ఇది నిజమా.. కాదా... అనేది మాత్రం తెలియాల్సి ఉంది.