Mon Dec 23 2024 09:06:50 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామ కల్యాణం సినిమాలు విజయాలను తెచ్చిపెట్టగా.. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వెంకటేశ్-
టాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం మురారి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కాట్రగడ్డ మురారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1944లో కాట్రగడ్డ గంగయ్య - అక్కమ్మ దంపతులకు మురారి జన్మించారు. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువును మధ్యలోనే ఆపేశారు.
సినిమాలపై ఆయనకు ఉన్న ఆసక్తితో మద్రాసుకు వెళ్లారు. అక్కడ దర్శకుడు మధుసూదన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా యువచిత్ర ఆర్ట్స్ సంస్థను ప్రారంభించి.. చంద్రమోహన్- రామేశ్వరి జంటగా మొదటిచిత్రం "సీతామహాలక్ష్మి"ని నిర్మించారు. ఆ తర్వాత శోభన్ బాబు-సుజాత కాంబినేషన్ లో వచ్చిన గోరింటాకు.. మురారికి పేరును తెచ్చిపెట్టింది.
జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామ కల్యాణం సినిమాలు విజయాలను తెచ్చిపెట్టగా.. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వెంకటేశ్- భానుప్రియ జంటగా నటించిన శ్రీనివాస కల్యాణం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగార్జునతో తీసిన జానకిరాముడు, బాలకృష్ణతో తీసిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా హిట్టయ్యాయి. మరో విశేషం ఏంటంటే.. మురారి నిర్మించిన ఈ 9 సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అలాగే చిత్రసీమలో తనకున్న అనుభవంతో "నవ్విపోదురుగాక" అనే పేరుతో ఆత్మకథను రాశారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మండలి కార్యదర్శిగా, తెలుగు చలనచిత్ర నిర్మాల మండలిలో గౌరవ కార్యదర్శిగానూ వ్యవహరించారు మురారి.
Next Story