Sat Nov 23 2024 00:26:15 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాజెక్ట్ కే గ్లింప్స్.. తొలి ఇండియన్ మూవీగా రికార్డు
అర్థరాత్రి చెప్పిన సమయానికంటే ముందే గ్లింప్స్ ను విడుదల చేసి.. ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. అమెరికాలో జరుగుతున్న..
గ్లోబల్ స్టార్, డార్లింగ్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్-కే గ్లింప్స్ వచ్చేసింది. మొన్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పై సర్వత్రా నిరాశ వ్యక్తమైన క్రమంలో.. ప్రాజెక్ట్ కే కూడా మరో ఆదిపురుష్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. మహానటి వంటి సినిమాను తెరపై అద్భుతంగా చూపించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా భారీ తారాగణం కావడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. కానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక ప్రభాస్ అభిమానులు డీలా పడిపోయారు. ఇక గ్లింప్స్ ఇంకెంత దారుణంగా చూపిస్తారోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెగిటివ్ కామెంట్స్ అన్నింటికీ తెరదించుతూ.. మేకర్స్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ను విడుదల చేశారు.
అర్థరాత్రి చెప్పిన సమయానికంటే ముందే గ్లింప్స్ ను విడుదల చేసి.. ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లోనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో ప్రభాస్ యాక్షన్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. సినిమాకు "కల్కి 2898 ఏడీ" అనే టైటిల్ ను ఖరారు చేశారు. "ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం ఆరంభమవుతుంది" అనే డైలాగ్ తో మొదలయ్యే గ్లింప్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ విజువల్స్ అయితే అదుర్స్. సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీ నెక్ట్స్ లెవల్ లో చూపించాయి. గ్లింప్స్ లో కూడా #WhatisProjectK అనే డైలాగ్ తో మరింత ఆసక్తిని పెంచారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె క్యారెక్టర్ కూడా ఆసక్తికరంగా ఉండబోతుందని గ్లింప్స్ ని బట్టి తెలుస్తోంది.
ఫస్ట్ గ్లింప్స్ తోనే ప్రాజెక్ట్ కే రికార్డు సెట్ చేసింది. శాన్ డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో గ్లింప్స్ విడుదల చేసిన తొలి ఇండియన్ మూవీగా "కల్కి 2898 ఏడీ" రికార్డులకెక్కింది. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ రూ.600 కోట్లతో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దుల్కర్ సల్మాన్, దిశాపఠాని తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది "కల్కి 2898 ఏడీ" సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Next Story