Sat Nov 23 2024 02:05:32 GMT+0000 (Coordinated Universal Time)
పీఎస్-1 ప్రభంజనం.. రెండ్రోజుల్లో రూ.150 కోట్ల వసూళ్లు
వీకెండ్ లో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా, అందరూ స్టార్ నటీనటులే కావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ (పీఎస్1) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి షో తర్వాత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వసూళ్లలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. మొదటిరోజు కంటే.. రెండో రోజు వసూళ్లు ఎక్కువగా రావడం గమనార్హం. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రెండ్రోజుల్లోనే పీఎస్ 1 ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు వసూళ్లు చేసింది. అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం 'విక్రమ్ వేద' నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ.. పీఎస్ 1 కు భారీ ఓపెన్సింగ్స్ వచ్చాయి.
అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వీకెండ్ లో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా, అందరూ స్టార్ నటీనటులే కావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. మూడోరోజు ఆదివారం, పైగా పండుగ సెలవులు కావడంతో పీఎస్ 1 కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలివీకెండ్ పూర్తయ్యే సరికి పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా రూ.200-రూ.250 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు నటించిన ఈ చిత్రంపై ఆది నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పటికి నెరవేరింది. రెండు, మూడు భాగాల్లో రానున్న ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
Next Story