పూరి నిర్ణయం అతనికి కలిసొచ్చేలా ఉంది..!
సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడడు పూరి జగన్నాథ్. తీసిన సినిమా విడుదల కాకముందే మరో సినిమా కోసం రంగంలోకి దిగడం ఆయన శైలి. ఈ జర్నీలో హిట్టు ఫ్లాప్‌ల గురించి అస్సలు ఆలోచించడు. తన గురువు రామ్‌గోపాల్ వర్మలా ఆలోచించే పూరి జగన్నాథ్ తాను నమ్మింది తీయడమే అలవాటని చెబుతుంటారు. కానీ పూరికి ఈమధ్య షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. టెంపర్ తర్వాత ఆయనకి హిట్టే లేదు. టెంపర్ కూడా ఆయన కథతో తెరకెక్కిన సినిమా కాదు. అంటే అంతకుముందు కూడా బోలెడన్ని ఫ్లాపులు. తన కథతో ఈ మధ్య కాలంలో హిట్టందుకొన్నదే లేదన్నమాట. 'మెహబూబా'పై చాలా ఆశలే పెట్టుకొని తీశాడు. తన కొడుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమా కూడా పరాజయాన్నే ఇచ్చింది.
చాలా కసరత్తు చేశాక...
అప్పట్నుంచి ఆయన మరో సినిమా చేయలేదు. మొత్తానికి ఇన్ని పరాజయాల తర్వాత ఎక్కడ తప్పు జరుగుతోందా అని కాస్త వెనుదిరిగి చూసుకోవడం మొదలుపెట్టాడని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ గ్యాప్‌లో ఆయన కథల గురించి పెద్దయెత్తున కసరత్తులు చేశాడని తెలుస్తోంది. అది యువ కథానాయకుడు రామ్‌కి కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ఇన్సైడ్ టాక్. రామ్ కథానాయకుడిగా పూరి తదుపరి సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈసారి గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి కథపై బాగా వర్క్ చేసుంటాడని, ఈ దెబ్బతో రామ్‌కి కూడా కొత్త ఇమేజ్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కాంబో సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.