'కాలా' రన్ టైం... తేడా వస్తే ఫట్టేనా..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం కాలా. రజనీకాంత్ గత చిత్రం కబాలి ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాలతో వచ్చిన కబాలి ఘోరమైన డిజాస్టర్ అయి బయ్యర్లను నిండా ముంచేసింది. అయితే అదే దర్శకుడికి రజనీ అనూహ్యంగా వెంటనే మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో కాలా వస్తోంది. ముంబైలోని పెద్ద మురికివాడ అయిన ధారవి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
పూర్తయిన సెన్సార్....
ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఎట్టకేలకు జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న కాలా రన్ టైం కాస్త టెన్షన్ పెడుతోంది. కాలా రన్ టైమ్ 2 గంటల 45 నిముషాలుగా ఉంటుందని తెలుస్తోంది. అంటే ఓవరాల్‌గా 165 నిమిషాల నిడివి.
భారీ ధరలు పలికిన హక్కులు....
ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా జూన్ 7వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమా వరల్డ్ వైడ్ ఓవరాల్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్ సంస్థ రూ.125 కోట్లకు సొంతం చేసుకుంది. రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో నానా పటేకర్, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు కీలక పాత్రల్లో నటించారు.
అంచనాలు ఏవి..?
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచలేదు. ఇంకా చెప్పాలంటే రజనీ సినిమా వస్తుందంటే ఉండే అంచనాల్లో పదో వంతు అంచనాలు, హడావిడి కూడా కాలాకు లేదు. ఇక సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. కబాలి మాఫియా నేపథ్యం, ఇప్పుడు కాలా కూడా అదే లైన్‌తో రావడం, అంచనాలు లేకపోవడంతో మరి ఏం జరుగుతుందో ? చూడాలి.