Tue Nov 05 2024 10:50:17 GMT+0000 (Coordinated Universal Time)
రాజశేఖర్.. 'శేఖర్' సినిమా ప్రదర్శనల ఆపివేత
రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జీవితతో
రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జీవితతో ఆర్థిక అంశాలపై వివాదం నేపథ్యంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తీసుకున్న అప్పును జీవిత చెల్లించలేదని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... నిర్దేశిత సమయంలోపు జీవిత డబ్బు చెల్లించాలని పేర్కొంది. కోర్టు పేర్కొన్న సమయానికి జీవిత డబ్బు చెల్లించడంలో విఫలమయ్యారు. దాంతో, చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాను నటించిన శేఖర్ చిత్రం ఆగిపోవడానికి కొందరు కుట్రలకు పాల్పడడమే కారణమని హీరో రాజశేఖర్ ఇప్పటికే ఆరోపించారు. పలువురు నిర్మాతలు కూడా జీవిత రాజశేఖర్ కు వ్యతిరేకంగా మీడియాను ఆశ్రయించారు.
జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించారు. తన శేఖర్ చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, చిత్ర ప్రదర్శనలు నిలిపివేయించారని రాజశేఖర్ ఆరోపించారు. సినిమాయే తమకు లోకమని, ముఖ్యంగా ఈ శేఖర్ చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. "శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను" అంటూ రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
మలయాళంలో విజయవంతమైన జోసెఫ్ చిత్రాన్ని తెలుగులోకి 'శేఖర్' పేరుతో రీమేక్ చేశారు. రాజశేఖర్ టైటిల్ పాత్రలో నటించారు. ఆయన లుక్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఇప్పుడు 'శేఖర్' సినిమా ప్రదర్శనల ఆపివేత మరో షాకింగ్ విషయంగా భావిస్తున్నారు.
Next Story