చెర్రీ వర్సెస్ బన్నీ.... అసలు ఆట ఇప్పుడు రక్తి కడుతోంది...
తెలుగు సినిమా చరిత్రలో మెగా ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్యామిలీలో మెగాస్టార్, పవర్‌స్టార్ తర్వాత ప్రస్తుత జనరేషన్లో టాప్ హీరో ప్లేస్ కోసం ప్రధానంగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ (చెర్రీ), చిరు బావమరిది అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ (బన్నీ) మధ్యే ప్రధాన పోటీ ఉందన్నది వాస్తవం. లెక్కపరంగా చూస్తే మెగా ఫ్యామిలీ హీరోలు ఇప్పటి వరకు 11 మంది ఉండగా ఇప్పుడు కొత్తగా సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా వెండితెరంగ్రేటం చేస్తున్నాడు.
హీరోలకు కొదవ లేకపోయినా స్టార్డమ్ మాత్రం బన్నీ వర్సెస్ చెర్రీ మధ్యే నడుస్తోంది. వీరు ఇప్పటికే స్టార్ హీరోలుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు. 2003లో బన్నీ గంగోత్రి సినిమాతో, 2006లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. చెర్రీ రెండో సినిమా మగధీరతో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత చెర్రీ రిస్క్ చేసేందుకు ఇష్టపడలేదు. రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ లాంటి పరమ రొటీన్ కథలే ఎంచుకుంటూ సేఫ్ గేమ్ ఆడాలని ట్రై చేశాడు.
చెర్రీ ప్రయోగం స్టార్టింగ్‌లో బాగానే ఉన్నా తర్వాత వికటించింది. గోవిందుడు, బ్రూస్ లీ దెబ్బతో రొటీన్లో వెళితే తాను రొటీన్ అయిపోతానన్న సంగతి గ్రహించాడు. ఆ తర్వాతే ధృవతో కాస్త మారాడు. ఇప్పుడు రంగస్థలంతో చెర్రీ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు చెర్రీ క్రేజ్ మామూలుగా లేదు. రంగస్థలం ఏకంగా రూ.120 కోట్ల షేర్‌తో 81 సెంటర్లలో 50 రోజులకు చేరువై చెర్రీ కెరీర్‌నే కాకుండా, స్టార్‌డమ్‌ను కూడా మార్చేసింది.
ఇటు బన్నీ రేసుగుర్రం నుంచి రేసులో దూసుకుపోతున్నాడు. రేసుగుర్రం రూ.60 కోట్ల షేర్‌తో స్టార్ హీరోలకు మైండ్ బ్లాక్ చేసేసింది. తర్వాత వరుసగా సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, డీజే ఇలా క్లాస్, మాస్, రుద్రమదేవి లాంటి చారిత్రక సినిమాలతో చెర్రీని పూర్తిగా సైడ్ చేసేశాడు. క్లాస్ సినిమాలతో ముందుగా క్లాస్‌కు దగ్గర అయిన బన్నీ సరైనోడుతో ఊరమాస్‌గా ఇటు మాస్‌ను కూడా దగ్గర చేసుకున్నాడు. రుద్రమదేవితో అన్ని వర్గాల ప్రశంసలు అందుకున్నాడు.
టాలీవుడ్లో ఏ హీరోకు లేనట్టుగా ఆరు వరుస రూ.50 కోట్ల షేర్ ఉన్న రికార్డు బన్నీకి మాత్రమే ఉంది. డిజాస్టర్ అయిన డీజే లాంటి సినిమాతో కూడా రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాడు. ఇక తాజాగా వచ్చిన నా పేరు సూర్య ఒక్కటే బన్నీకి చాలా రోజుల తర్వాత డిజాస్టర్ ఇచ్చింది. ఈ సినిమా కూడా రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈ ఇద్దరి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే విమర్శకులు, ప్రేక్షకుల లెక్కల్లో నటనలో, డ్యాన్సుల్లో చెర్రీ బన్నీ ముందు ఎందుకు సరిపోడని చెప్పేవారు.
చెర్రీకి వారసత్వం ఉంది... తండ్రి నుంచి అసంఖ్యాకంగా వచ్చిన లక్షలాది మంది అభిమానులు మనోడి సొంతం. అయితే ఈ వారసత్వ అభిమానులు ఎంత బలంగా ఉన్నా అతడు వేసిన రాంగ్‌స్టెప్పులు, పూర్తిగా వారసత్వంతో పాటు రొటీన్ కథలను ఎంచుకోవడంతో బన్నీ ముందు తేలిపోయి రేసులో వెనకపడిపోయాడు. అయితే సరైన సినిమా పడితే చెర్రీ స్టామినా ముందు బన్నీ స్టామినా ఏ మాత్రం సరిపోదని రంగస్థలం ఫ్రూవ్ చేసింది.
చిరు నిన్నమొన్నటి వరకు రాజకీయాలు, ఇతరత్రా హడావిడిలో పడి చెర్రీ కెరీర్‌ను పూర్తిగా అల్లు అరవింద్ చేతుల్లో పెట్టేశాడు. అరవింద్ చేతుల్లోనే తెలుగు సినిమా రంగంలో థియేటర్లు, టాప్ దర్శకుల వ్యవహారాలు ఇలా చాలా డీల్ అవుతుంటాయి. ఎంతైనా చెర్రీ మేనళ్లుడు, బన్నీ కొడుకు. ఓ మంచి కథ ఓ డైరెక్టర్ తెస్తే దానిని సహజంగానే బన్నీతో చేసేలా ప్లాన్ చేస్తాడనడంలో డౌట్ లేదు. గతంలో కొన్ని మంచి కథలు ముందుగా దర్శకులు చిరుకు చెప్పడం బిజీగా ఉన్న చిరు అరవింద్ వద్దకు వాళ్లను పంపండం...ఆ కథలతోనే బన్నీ హిట్లు కొట్టడం జరిగిపోయాయి. తర్వాత చిరు అరవింద్‌ను వివరణ అడిగితే దానికి తగిన సాకులు ఆయన దగ్గర లేకుండా ఎలా ఉంటాయ్ ? అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి.
ఇక ఇప్పుడు చిరు కూడా ఫ్రీ అయిపోయి సినిమాలు చేసుకుంటున్నాడు. ఇటు రంగస్థలం తర్వాత కొడుకు కెరీర్‌ను తాను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అటు ఉపాసన కూడా రంగంలోకి దిగింది. నిన్నటి వరకు బన్నీ కెరీర్ ప్లానింగ్‌లో భార్య స్నేహారెడ్డి ప్లానింగ్ కూడా ఉండేది. ఫిట్నెస్, స్టైల్ వ్యవహారాలు ఆమె జాగ్రత్తగా చూసుకునేది. కొన్ని సార్లు పాత్ర స్వభావం దృష్ట్యా కొంతమంది ట్యూటర్లను కూడా పెట్టించి బన్నీకి పాఠాలు చెప్పించేది. ఇలా బన్నీ తక్కువ టైంలోనే అసంఖ్యాకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. అటు కేరళలోనూ తనకంటూ సపరేట్ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.
ఇక బన్నీ దూకుడు, అరవింద్ వ్యవహారాలు చిరుకు తెలియనవి కావుగా...అందుకే ఇప్పుడు చెర్రీని టాప్ చేసేందుకు వారికి రంగస్థలం రూపంలో మంచి అవకాశం వచ్చింది. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ తన వారసుడి పైచేయి నిలిపేందుకు చిరుతో పాటు ఉపాసన అండ్ మెగా ఫ్యామిలీలో సపరేట్గా ఉండే చిరు గ్యాంగ్ గేమ్ స్టార్ట్ చేసిందని వినికిడి. ఇక ఇప్పుడు బన్నీ వర్సెస్ చెర్రీ వార్ మరింత రక్తికడుతుంది ? అనడంలో సందేహం లేదు.