బాబోయ్... వర్మ బాంబు పేల్చేశాడు!!
గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా ఒక వారం నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. క్రిష్ - బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెగ హడావిడి మొదలుపెట్టాడు. మధ్యలో అజ్ఞాతంలోకి వెళ్లిన వర్మ మళ్ళీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెరమీదకి వచ్చాడు. క్రిష్, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్ తో ప్రకంపనలు సృష్టిస్తున్న టైం లో ఇప్పుడు వర్మ ఇలా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ హడావిడి మొదలు పెట్టి నాస్తికుడిగా చెప్పుకునే... వర్మ తిరుపతి వెళ్లి తన జీవితంలోనే మొదటిసారిగా దేవుణ్ణి... అదేనండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మరీ... తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ముచ్చట మీడియా ముందు ఉంచాడు. ఎన్టీఆర్ అంటే తనకెంత ఇష్టమో... అందుకే తిరుపతి వేదికగా లక్షీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నానన్నాడు.
నిజాలే చూపుతానంటూ....
వర్మ కీలక ప్రకటన తన వాయిస్ ఓవర్ తో విడుదల చేసాడు. ఎన్టీఆర్ అభిమానులకు నా బహిరంగ ప్రకటన. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత సంభవించిన అత్యంత విపత్కరమైన పరిణామాలు. అందుకే ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ సినిమాలో నిజాలే చూపుతానని చెప్పారు. లక్ష్మీపార్వతి గురించి తనకు ఎంతో మంది వేర్వేరు అభిప్రాయాలు, ఉదంతాలు చెప్పారని, వాళ్లు తెలిసి చెప్పారో, తెలియక చెప్పారో లేక ఏదైనా అజెండాతో చెప్పారో... రకరకాల కారణాలు ఉండవచ్చని, ఇక ఎన్టీఆర్ చనిపోయే కొన్ని రోజుల ముందు ఓ ఇంటర్వ్యూలోలక్ష్మి పార్వతి గురించి ఎనలేని గౌరవంతో మాట్లాడారన్నారు. అందువల్ల ఆమెను అనుమానించినా, అవమానించినా... సాక్షాత్తూ ఎన్టీఆర్ గారిని అనుమానించి, అవమానించినట్టే... అంటూ చెప్పడం చూస్తుంటే చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమే.
లక్ష్మీపార్వతిని అవమానిస్తే.....
ఇక లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసిన పనివాళ్లని, ఆఫీస్ స్టాఫ్, ఎన్టీఆర్ శత్రువులను కూడా ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూలో కళ్లు బైర్లు కమ్మే నిజాలను తెలుసుకున్నా. నేను ఈ సినిమాను లక్ష్మీ పార్వతి గురించి తీయడం లేదు. ఎన్టీఆర్ గారి గురించి తీస్తున్నా. ఆయన మీద గౌరవాన్ని ఆమె మీద చూపించడం అభిమానుల కనీస బాధ్యత. ఆమెను ఈ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా పిలవడానికి ఒకే ఒక కారణం ఆమె ఎన్టీఆర్ భార్య అనే గౌరవం. సినిమా టైటిల్ ను బట్టి అందరికీ అర్థమయ్యే విషయం... సినిమాలో లక్ష్మి పార్వతిది చాలా ముఖ్యమైన పాత్ర.. అంటూ చెప్పిన వర్మ ఎన్టీఆర్ ఆశీస్సులు ఎమన్నా ఎవరికన్నా దక్కుతాయంటే అది కేవలం తమ లక్ష్మీస్ ఎన్టీఆర్ కే దక్కుతాయంటూ రామ్ గోపాల్ వర్మ తన స్పీచ్ ని ముగించాడు.