Mon Dec 23 2024 08:53:40 GMT+0000 (Coordinated Universal Time)
నెట్ ఫ్లిక్స్ నుంచి రానా నాయుడు అవుట్.. కారణం అదేనా ?
రానా నాయుడులో వెంకటేష్ పాత్ర. తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ను అలా చూసేందుకు ఇష్టపడలేదు. ఎక్కువగా అశ్లీల సీన్లు..
దగ్గుబాటి హీరోలైన వెంకటేష్, రానా కలిసి తండ్రికొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ ప్రముఖుల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకు కారణం.. ఈ వెబ్ సిరీస్ లో శృతికి మించిన శృంగారాన్ని చూపించడమే. కొందరైతే ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లకు కూడా సెన్సార్ ఉండాలని డిమాండ్ చేశారు.
హిందీ వెర్షన్ లో అంటే ఓకే. అక్కడ దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. వెంకటేష్ కు తెలుగు ఆడియన్స్ లో ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉంది. అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది రానా నాయుడులో వెంకటేష్ పాత్ర. తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ను అలా చూసేందుకు ఇష్టపడలేదు. ఎక్కువగా అశ్లీల సీన్లు, అభ్యంతరకర భాష ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. రానా నాయుడు అనే పేరు కంటే ఏకంగా బ్లూ ఫిల్మ్ అని పెడితే బాగుండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే.. ఉన్నట్టుండి నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు తెలుగు వెర్షన్ ను డిలీట్ చేశారు. అందుకు కారణం మరో వెబ్ సిరీస్ అని తెలుస్తోంది.
అమెరికన్ సిరీస్ ‘ది బిగ్ బాంగ్ థియరీ’లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ను అవమానపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఇటీవల వివాదం రేగింది. దీంతో ఈ షో ప్రసారం చేస్తున్న నెట్ఫ్లిక్స్ సంస్థకి లీగల్ నోటీసులు అందాయి. ఈ క్రమంలోనే రానా నాయుడు విషయంలో సంస్థ జాగ్రత్తపడినట్లు సమాచారం. తెలుగు ఆడియన్స్ నుంచి వ్యతిరేకత, ఈ వెబ్ సిరీస్ ను తొలగించాలన్న డిమాండ్ లు పెరగడంతో.. ఇది పెద్ద సమస్య కాకముందే నెట్ ఫ్లిక్స్ ముందు జాగ్రత్తగా తెలుగు వెర్షన్ ను తొలగించిందని తెలుస్తోంది.
Next Story