విరుష్కల జంటను ఫాలో అవుతున్న దీపికా - రణవీర్ లు
బాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ లు ఇప్పుడు పెళ్లి పీటలేక్కబోతున్నారట. ఈ జంట పెళ్లి చేసుకుంటుందని వార్తలు ఈ ఏడాది మొదటి నుండే వినబడినా.. అటు దీపికా కానీ.. ఇటు రణవీర్ సింగ్ కానీ స్పందించలేదు. కానీ వీరు మాత్రం తమ పెళ్లి కోసం ఇప్పటికే సైలెంట్ గా ఏర్పాట్లు మొదలు పెట్టేశారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే దీపిక పేరెంట్స్ దీపికా పెళ్లి కోసం బట్టలు నగల షాపింగ్ చేశారంటున్నారు. ఇక తాజాగా రణవీర్ సింగ్ కుటుంబీకులు దీపికా పదుకొనె పుట్టిన రోజు కానుకగా చీర, బంగారు నగలు బహుమతులుగా పంపడంతో వీరి పెళ్లి పై అందరూ ఒక క్లారిటీకి వచ్చేసారు.
అయితే నవంబర్ 10 న దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ ల పెళ్లి ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని చేసుకోబోతున్నారట. ఇటలీ లోని లేక్ కోమ్ టౌన్లో నవంబర్ 10న దీపికా అండ్ రణ్వీర్ లు హంగామా లేకుండా కుటుంబ సభ్యుల మధ్య దండలు మార్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక చాలా కొద్దిరోజుల కిందటే నవంబర్ 10 న వీరి పెళ్లి డేట్ కూడా ఫైనల్ చేసినట్టుగా ఇరు కుటుంబీకుల చెబుతున్నాయి. అయితే ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నప్పటికీ.... ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరగాలని దీపికా.. రణవీర్ ని కోరగా.. దీపికా పదుకొనె చెప్పింది విన్న రణవీర్ కూడా ఈ పెళ్లిని సింపుల్ గా చేసుకునేందుకే మొగ్గు చూపాడట.
ఇక నవంబర్ 10 న ఇటలీలో పెళ్లితో ఒక్కటైనా ఈ జంట తిరిగి ముంబై కి వచ్చేసి ఇక్కడ గ్రాండ్ గా సన్నిహితులు, బంధువులకు రిసెప్షన్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. మరి ఇంతకుముందే అనుష్క - విరాట్ ల జంట కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లో పెళ్లి చేసుకుని ముంబై వచ్చి అందరికి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. ఇక తాజాగా దీపికా - రణ్వీర్ ల జంట కూడా విరుష్కల జంటని ఫాలో అవుతున్నారన్నమాట. ఇకపోతే బాలీవుడ్లో మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి ముచ్చట్లు కూడా షురూ అయ్యాయి. తన బాయ్ ఫ్రెండ్ నికోస్ తో ప్రియాంక అతిత్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుందంటున్నారు.