Thu Dec 26 2024 02:07:31 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణంరాజు సినీ ప్రస్థానం.. అరంగేట్రం, అవార్డులు, పాపులర్ డైలాగ్స్
కెరీర్ ఆరంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలేసిన కృష్ణంరాజు తెలుగునాట భక్త కన్నప్పగా ప్రేక్షకుల..
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ తెల్లవారుజామున గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది. ఏ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. ఎన్ని అవార్డులు పొందారన్న విషయాలు తెలుసుకుందాం. అలనాటి దర్శకుడు 'కోటయ్య ప్రత్యగాత్మ' తెరకెక్కించిన చిలకా గోరింక సినిమాతో 1966లో కృష్ణంరాజు సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును దక్కించుకుంది. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు సినీ రంగంలో అగ్రహీరోలుగా ఉండగా.. వాళ్లకి ధీటుగా నటించి కృష్ణంరాజు రెబల్ స్టార్ గా ఎదిగారు.
మేనమామగా పల్నాటి పౌరుషం చూపాలన్నా బొబ్బిలి బ్రహ్మన్నగా రౌద్ర రసం ప్రదర్శించాలన్నా మొగల్తూరు రాజుగారికే చెల్లు. కెరీర్ ఆరంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలేసిన కృష్ణంరాజు తెలుగునాట భక్త కన్నప్పగా ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు. ఇప్పటికీ శివరాత్రి పండుగ వచ్చిందంటే.. భక్తకన్నప్ప పాటలు వింటుంటారు భక్తులు. తన రెండవ సినిమా పౌరాణిక చిత్రం. సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'శ్రీ కృష్ణావతారం'లో నటించారు. ఆ తర్వాత.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి డజన్ల సినిమాల్లో నటించారు.
1968లో కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన "నేనంటే నేనే" సినిమాలో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత హీరోగా కృష్ణంరాజు జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమర దీపం, సతీ సావిత్రి, మనఊరి పాండవులు వంటి కుటుంబ, భక్తిరస చిత్రాలలో నటిస్తూనే.. కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపరాయుడు, మరణ శాసనం, పల్నాటి పౌరుషం సినిమాల్లో రెబల్లియన్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకుల చేత రెబల్ స్టార్ అని పిలిపించుకున్నారు. కొండవీటి నాగులు సినిమాలో నాయాల్ది, జానకి కత్తందుకో డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.
187 కు పైగా సినిమాలో నటించిన కృష్ణంరాజు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు. తమ్ముడి కొడుకైన ప్రభాస్ ను కృష్ణంరాజు సొంత కొడుకులా పెంచి.. సినీ అరంగేట్రం చేయించారు. ప్రభాస్ తో కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటించారు. సినీ ప్రస్థానంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా చేసిన కృష్ణంరాజు సినీ పయనం నేటితో ముగిసిపోయింది. ఆయన మరణం వెండితెరకు తీరనిలోటు. కృష్ణంరాజు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story