ఎన్టీఆర్ పై మళ్లీ రంగంలోకి వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాన్ని నెత్తికెత్తుకున్నారు. ఈసారి నందమూరి, నారా కుటుంబంతో పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రొడ్యూసర్ గా, హీరోగా క్రిష్ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సినీ జీవితంపై కథానాయకుడుగా, రాజకీయ జీవితంపై మహానాయకుడుగా రెండు భాగాలుగా చిత్రాన్ని నిర్మించి జనవరిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంపై సినిమా ప్రారంభించేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధమయ్యారు. బాలయ్య ఎన్టీఆర్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీస్తానని ఆయన ఇంతకుముందే ప్రకటించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసి తర్వాత వెనక్కు తగ్గారు. అయితే, దసరా సందర్భంగా ఈ నెల 19న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించి జనవరిలో విడుదల చేస్తానని వర్మ ఇవాళ ప్రకటించారు. ఎన్టీఆర్ జీవితంలో మరో కోణాన్ని చూపిస్తానని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆర్జీవీతో పాటు ఎన్టీఆర్ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.