Mon Dec 23 2024 11:37:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీ వ్యూహం టీజర్.. వైఎస్సార్ మరణం తర్వాత ఏమైంది?
తాజాగా "వ్యూహం" నుంచి టీజర్ ను వదిలారు. వైఎస్సార్ హెలికాఫ్టర్ లో ప్రయాణించడంతో టీజర్ మొదలవుతుంది. వైఎస్సార్ మరణం..
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిజ జీవితాల ఆధారంగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, మర్డర్.. ఈ సినిమాలన్నీ నిజ జీవితాల్లో జరిగిన ఘటనల ఆధారంగా ఆర్జీవీ కోణంలో తీసిన సినిమాలే. ఉన్నది ఉన్నట్టుగా తెరపై చూపిస్తారు కాబట్టే.. ఆర్జీవీ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. ఆర్జీవీ ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా "వ్యూహం" అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సినిమాలో కీలక పాత్రల్ని కూడా పరిచయం చేశారు.
తాజాగా "వ్యూహం" నుంచి టీజర్ ను వదిలారు. వైఎస్సార్ హెలికాఫ్టర్ లో ప్రయాణించడంతో టీజర్ మొదలవుతుంది. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన పరిణామాలు, ఓదార్పు యాత్ర, సీబీఐ అరెస్ట్, - విడుదల.. తదితర అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. జగన్, భారతి, విజయమ్మ, రోశయ్య, చంద్రబాబు తదితర క్యారెక్టర్లను టీజర్లో చూపించారు. "వ్యూహం"లో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. త్వరలోనే సినిమా విడుదల కానుండగా.. సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు జగన్ అభిమానులు. అయితే ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజర్ ను కట్ చేశారు. కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ను విడుదల చేసి.. వ్యూహంపై అంచనాలు పెంచేశారు ఆర్జీవీ. జగన్ ఏపీ సీఎం అయిన తర్వాతి పరిస్థితులపై "శపథం" అనే టైటిల్ తో సెకండ్ పార్ట్ తీయనున్నారు.
Next Story