సాక్ష్యం విడుదలకు ఆటంకాలు..?
బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సాక్ష్యం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని సో సో పబ్లిసిటీతో ఈ నెల 27 అంటే వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకని ఘనంగా చేసిన మేకర్స్ తర్వాత పబ్లిసిటీని పెద్దగా పట్టించుకున్నట్లుగా కనబడడం లేదు. ప్రస్తుతం సినిమా తియ్యడానికి ఎంత ఖర్చు అవుతుందో... అంతే ఖర్చు పబ్లిసిటీకి పెట్టేస్తున్నారు నిర్మాతలు. అప్పుడే ప్రేక్షకులకు సినిమా బాగా రీచ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ పడుతున్నాయి. అయితే తాజాగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదలయ్యేలా కనిపించడం లేదు.
మూగ జీవాలతో సీన్లు చేసినందుకే...
ఏ పోస్ట్ ప్రొడక్షన్ వర్కో పెండింగ్ ఉండడం వల్లో లేదా ప్రీ రిలీజ్ బిజినెస్ సరిగ్గా జరగకనో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం లేదు గానీ సెన్సార్ సభ్యుల వలన సాక్ష్యం విడుదలలో కన్ఫ్యూషన్ ఏర్పడింది. వచ్చే శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కి వెళ్లింది. అయితే సాక్ష్యం సినిమాని ఆసాంతం వీక్షించిన సెన్సార్ వారు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా విశ్వసనీయ సమాచారం. మరి ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం కూడా పంచ భూతాల సాక్షిగా అంటూ బెల్లంకొండ చెప్పే డైలాగ్ చుట్టూనే ఈ సాక్ష్యం కథ అల్లుకోవడంతో.. ఈ సినిమాలో దాని కోసం కొన్ని జంతువులను పక్షులను వాడుకున్నారట మేకర్స్.
అనుమతులు కష్టమైనా..?
అయితే జంతువులను, పక్షులను వాడుకున్నందుకు గానూ... అందుకు సంబంధించిన అనుమతులను చిత్ర బృందం పొందకుండానే సినిమా షూట్ చేశారట. అందుకే ఇప్పుడు ఆ అనుమతులు లేకుండా సినిమా చేసినందుకే సెన్సార్ సభ్యులు సాక్ష్యం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలుస్తుంది. మరి మూగ జీవాలను హింసించరాదని.. కఠిన చట్టాలను అమలు చేస్తున్న నేపథ్యంలో... వాటిని హింసించకపోయినప్పటికీ.. వాటిని వాడుకోవాలంటే జంతు సంరక్షణ నుండి అనుమతులు తప్పనిసరి. మరి సినిమా విడుదల దగ్గరపడుతున్న టైం లో ఇప్పుడు అనుమతులు తెచ్చుకోవడం సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు. అందుకే సాక్ష్యం సినిమా ఈ శుక్రవారం విడుదలవుతుందా లేదా అనేది ప్రస్తుతానికైతే ఫుల్ సస్పెన్స్.