తెలుగు చిత్రాల కంటే అదే బెటర్..!
గత వారంలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో స్ట్రెయిట్ తెలుగు మూవీ ఒక్కటే. మిగిలిన మూడు చిత్రాలు పరభాషా చిత్రాలే కావడం విశేషం. నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సుమనిపించాయి. ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య మలయాళం డబ్బింగ్ మూవీ మోహన్ లాల్ నటించిన ‘ఒడియన్’ తీవ్ర నిరాశకు గురి చేసింది. మోహన్ లాల్ అంతకు ముందు నటించిన ‘మన్యంపులి’ చిత్రం కంటే ఈ చిత్రం ఒక రేంజ్ సక్సెస్ అవుతుంది అని అంతా ఆశపడ్డారు. కానీ రిజల్ట్ చాలా దారుణంగా వచ్చింది. రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లే పరిస్థితి లేదు. కానీ ‘భైరవగీత’ కన్నడ చిత్రం కాబట్టి బాగానే ఉంటుందని థియేటర్స్ కు వెళ్లారు. కొంతమేరకు పర్లేదు అనిపించుకున్నా ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాని తిరస్కరించారు.
‘సముద్రపుత్రడు’ బెటర్...
ఈ రెండు చిత్రాలతో పాటు తెలుగులో చిన్న మూవీ ఒకటి రిలీజ్ అయింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘హుషారు’ మాత్రం యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. అడల్ట్ కామెడీని ఇష్టపడే యూత్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతోంది. మిగిలిన వాళ్లకి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ మూడు చిత్రాలతో పాటు రిలీజ్ అయిన ఇంగ్లీష్ డబ్ మూవీ ‘సముద్ర పుత్రుడు’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుండటం విశేషం. తెలుగులో విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. 3D ఎఫెక్ట్స్ ప్రత్యేకంగా ఆకర్షించడంతో జనాలు గత వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో ఈ సినిమాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.