క్రేజుంది కదా.... ప్రమోషన్ అక్కర్లేదనుకున్నారా?
మురుగదాస్ డైరెక్షన్ లో ఇళయదళపతి విజయ్ నటించిన సర్కార్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తమిళనాట భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. తమిళంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కలెక్టర్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. తెలుగులో నవాబ్ సినిమాని భారీ ఎత్తున విడుదల చేసిన నిర్మాతే సర్కార్ ని ఏకంగా 6 కోట్లకి కొని విడుదల చేస్తున్నాడు. మరి తమిళ సినిమా ఆరు కోట్లకి కొనడం అంటే సినిమాకి ఏ రేంజ్ ప్రమోషన్ చెయ్యాలి. కానీ మురుగదాస్ కానీ విజయ్ కానీ తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. ఆరు కోట్లకి తెలుగు నిర్మాతకు అమ్మేసిన తమిళ నిర్మాతలు.. కనీసం తెలుగు నిర్మాతకి సినిమాకి సంబందించిన ఫొటోస్ కూడా ఏం ఇవ్వడం లేదు.
ప్రమోషన్స్ కి కూడా దూరంగా
తమిళంలో మాత్రం మురుగదాస్, విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇక్కడ తెలుగు నిర్మాతలు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రెస్ మీట్ గానీ... ప్రమోషన్స్ ఈవెంట్ గానీ పెట్టలేదు. కనీసం తమ సినిమా ఇవ్వాళ విడుదలవుతుందనే విషయాన్ని కూడా ప్రమోట్ చెయ్యడం లేదు. మరి ఏ శుక్రవారమో అయితే ప్రమోషన్ చెయ్యకపోయినా... ప్రేక్షకుడు కొత్త సినిమా వస్తుందననుకుని బుక్ మై షోలో సెర్చ్ చేస్తాడు. కానీ ఈ సర్కార్ వారం మధ్యలో అంటే ఎటు కాకుండా దీపావళి కానుకగా మంగళవారం విడుదలవుతుంది. మంగళవారం సినిమాలేమి పెద్దగా విడుదల కావు. మరి అలాటిది సర్కార్ విడుదలవుతుంది అంటే దానికి ఏ రేంజ్ ప్రమోషన్ ఉండాలి. అయితే విజయ్, మురుగదాస్ లు తెలుగు నిర్మాతలకు ఎలాంటి హెల్ప్ చెయ్యకుండా చుక్కలు చూపిస్తున్నారు. అసలే విజయ్ కి మిగతా తమిళ హీరోలకున్న మార్కెట్ తెలుగులో లేదు. అలాంటప్పుడు తన సినిమాకి ఎలాంటి ప్రమోషన్ చెయ్యాలి. మరి విజయ్ ఏదో ఒక ప్రెస్ మీట్ కి హాజరై తన సినిమాని ప్రమోట్ చేసుకుంటే బావుండేది. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తన సినిమాకున్న క్రేజ్ సినిమాకి కలెక్షన్స్ తెచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లుగా కనబడుతుంది వ్యవహారం. అందుకే క్రేజుంది కదా అని ప్రమోషన్స్ ని గాలికొదిలేశారు. చూద్దాం టాక్ ఓకె అయితే సినిమా ఆడుతుంది. లేదంటే తెలుగు నిర్మాత నెత్తిమీద గుడ్డే.