సత్యమేవ జయతే కి స్టార్ట్ అయ్యిందిగా..!
బాలీవుడ్ లో మిలాప్ మిలన్ జవేరి దర్శకత్వంలో జాన్ అబ్రహం - అమృత ఖన్విల్కర్ జంటగా నటించిన సత్యమేవ జయతే సినిమా ఇప్పుడు కష్టాల్లో పడింది. తాజాగా విడుదలైన ట్రైలర్ వల్ల ఈ సినిమా విడుదల కష్టాలను ఎదుర్కునేలా కనబడుతుంది. కొన్ని సినిమాలకు వివాదాలే కేరాఫ్ అడ్రెస్ గా మారినట్టుగా ఇప్పుడు సత్యమేవ జయతే సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుంది. సత్యమేవ జయతే లో కొన్ని సన్నివేశాలు ముస్లింలలోని ఒక వర్గాన్ని కించ పరిచేలా ఉన్నాయని కొందరు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.
డబీర్ పురాలో ఫిర్యాదు...
ముస్లింలలోని షియా వర్గ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాని తెరకెక్కించారంటూ.. బీజేపీ మైనార్టీ మోర్చా సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ జఫ్రీ డబీర్పురా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా విడుదలైన సత్యమేవ జయతే ట్రైలర్ లోనే ఇలా ఉంటే... సినిమాలో మరిన్ని వివాస్పద సన్నివేశాలు ఉన్నాయేమో అంటూ.. వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని... అందుకే మేకర్స్ మీద తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పద్మావత్ లానే మారనుందా...
ఒకవేళ చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళను చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ అభ్యంతరాలను తాము సెన్సార్ బోర్డుకి కూడా తెలిపామని వాళ్లు చెబుతున్నారు. మరి గతంలోనూ దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ నటించిన పద్మవత్ చిత్రంపై రాజ్ పుత్ వంశానికి చెందిన వారు ఆందోళన చేయ్యగా..ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ జనవరి నెలాఖరున విడుదలై సంచలన విజయాన్ని నమోదు చెయ్యడమే కాదు... రాజపుత్ వంశాన్ని కించపరిచే విధంగా అందులో ఎలాంటి సీన్స్ లేకపోవడం వారు చివరికి పద్మవత్ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి సారి కూడా చెప్పిన సంగతి తెలిసందే. మరి ఈ సత్యమేవ జయతే వివాదం ఎక్కడ ఆగుతుందో.