Mon Dec 23 2024 17:43:30 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంలో సింగర్ మంగ్లీ శివరాత్రి పాట
ఈ పాటను మంగ్లీ పాడగా.. ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఇప్పుడీ పాట వివాదంలో చిక్కుకుంది.
టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. ఫోక్ సింగర్ గా ఫేమస్ అయిన మంగ్లీ.. టెలివిజన్ రంగంతో కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలంగాణ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. సినిమాల్లోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక ప్రతి పండుగకి మంగ్లీ నుంచి ఒక స్పెషల్ సాంగ్ వస్తుండటం తెలిసిందే. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, ఉగాది, సమ్మక్క సారక్క జాతర, మహా శివరాత్రి తదితర పండుగలకు మంగ్లీ పాటలు వస్తుంటాయి.
అదే మాదిరిగా ఈ ఏడాది మహా శివరాత్రికి ‘భం భం భోలే’ అనే సాంగ్ ని రిలీజ్ చేసింది. ఈ పాటను మంగ్లీ పాడగా.. ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఇప్పుడీ పాట వివాదంలో చిక్కుకుంది. శ్రీకాళహస్తి టెంపుల్ లో వీడియో తీయడానికి అనుమతి లేదు. అలాంటిది కాలభైరవ స్వామి ఆలయం, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ అండ్ టీం 10 రోజుల క్రితమే ఈ పాటని చిత్రీకరించారు. ఆలయంలోని రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాల్లో ఈ సాంగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇప్పుడిదే వివాదానికి దారి చేసింది.
ఆలయంలో చాలా ఏళ్ల నుండి చిత్రీకరణపై నిషేధం ఉంది. అలాంటి మంగ్లీ మహాశివరాత్రి పాటలో దాదాపు గర్భ గుడి వరకు మంగ్లీ అండ్ టీం చిత్రీకరణ చేయడాన్ని శ్రీకాళహస్తి వాసులతో పాటు కొందరు పండితులు కూడా ఖండిస్తున్నారు. వాళ్లకెవరు వీడియో తీసేందుకు పర్మిషన్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా, పర్మిషన్ తోనే చిత్రీకరణ జరిగింది అని తెలియజేస్తున్నప్పటికీ, అనుమతి ఎవరు ఇచ్చారు అనేది మాత్రం తెలియజేయడం లేదు. వీడియోలో ఆలయ పండితులు కూడా కనిపించారు.
Next Story