Mon Dec 23 2024 15:24:53 GMT+0000 (Coordinated Universal Time)
Devara : దేవర షూటింగ్లో ఎన్టీఆర్ వల్ల శ్రీకాంత్‌కు గాయం..!
దేవర మూవీ షూటింగ్లో శ్రీకాంత్‌కు కాలుకి గాయం. ఎన్టీఆర్ వలనే జరిగిందా..?
Devara : ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'దేవర'. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుంటే.. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలోని పలు కీలక సన్నివేశాలను ఇటీవల గోవా, గోకర్ణ ప్రాంతాల్లో షూట్ చేశారు. ఆ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
అయితే అక్కడ చిత్రీకరణ చేస్తున్న సమయంలో శ్రీకాంత్ కాలుకి గాయం అయ్యిందట. ఈ విషయాన్ని శ్రీకాంత్ స్వయంగా తెలియజేశారు. శ్రీకాంత్ ఈ చిత్రంతో పాటు 'కోటబొమ్మాళీ పీఎస్' అనే మరో మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుండడంతో ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షోకి శ్రీకాంత్ గెస్ట్ గా వచ్చారు. ఇక అక్కడ శ్రీకాంత్ కాలుకి పట్టి చూసిన నాగార్జున ఏమైందని ప్రశ్నించారు.
దేవర షూటింగ్ లో గాయమైనట్లు శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. దీనికి నాగార్జున రియాక్ట్ అవుతూ.. "ఈ గాయానికి తారక్ కారణం కాదు కదా" అంటూ ప్రశ్నించారు. దానికి శ్రీకాంత్ బదులిస్తూ.. "అయ్యొయ్యో తారక్ ఏమి కారణం కాదు. బీచ్ లో షూటింగ్ స్పాట్ కి వెళ్తున్న సమయంలో ఇసుకలో కాలు కొంచెం బెణికింది. దానిని అప్పుడు పట్టించుకోకుండా ఆ నొప్పితోనే షూటింగ్ చేశాను. కానీ తరువాత రోజు నిద్ర లేచిన తరువాత చూస్తే కాలు బాగా వాచిపోయి కనిపించింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని అన్నారు. కానీ అలాగే దేవర షూటింగ్ పూర్తి చేసి వచ్చాను" అంటూ వెల్లడించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రాన్ని నందమూరి ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మొదటి పార్టుని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు.
Next Story