Mon Dec 23 2024 02:38:34 GMT+0000 (Coordinated Universal Time)
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్యే.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన పోస్టుమార్టమ్ డాక్టర్
అప్పట్లో జస్టిస్ ఫస్ ఎస్ఎస్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేసి తమ వాదనను గట్టిగా వినిపించారు. ధోనీ లైఫ్ స్టోరీతో ..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. అతను మరణించి రెండేళ్లైనా.. ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లలో సజీవంగానే ఉన్న వ్యక్తి. 2020లో జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉరివేసుకుని కనిపించారు. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య అని కొందరు.. కాదు ఆత్మహత్య అని మరికొందరి వాదన ఇప్పటికీ కొనసాగుతోంది. అంతెందుకు.. సుశాంత్ మృతి కేసు దర్యాప్తు దశలోనే ఉంది. తొలుత మాజీ ప్రేయసి, స్నేహితుల విచారణ అంటూ హడావిడి చేశారు కానీ.. ఆ తర్వాత కేసు నీరుగారిపోయింది.
అప్పట్లో జస్టిస్ ఫస్ ఎస్ఎస్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేసి తమ వాదనను గట్టిగా వినిపించారు. ధోనీ లైఫ్ స్టోరీతో తీసిన ఎంఎస్ ధోనీ సినిమాతో అందరి మనసుల్లో చోటు సంపాదించిన బాలీవుడ్ హీరో ఆకస్మిక మరణం.. అతని అభిమానులకు ఎప్పటికీ చేదు జ్ఞాపకమే. తాజాగా.. సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని .. సుశాంత్ బాడీకి పోస్టుమార్టమ్ చేసిన వైద్యుడు రూప్ కుమార్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అటు బాలీవుడ్ తో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతున్నాయి.
"సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు.. అదే సమయంలో పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కూపర్ హాస్పిటల్ లోకి ఐదు మృతదేహాలు వచ్చాయి. ఆ ఐదు మృతదేహాల్లో ఒకటి వీఐపీదే అని చెప్పారు.. మేము పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు, అతను సుశాంత్ అని గుర్తుపట్టాం. అతని శరీరంపై అనేక గుర్తులు ఉన్నాయి. అలాగే.. మెడపై రెండు నుంచి మూడు గుర్తులు ఉన్నాయి. నిజానికి పోస్ట్‌మార్టం రికార్డ్ చేయాల్సి ఉంది. కానీ మృతదేహానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే తీయాలని, పోస్టుమార్టమ్ ను రికార్డ్ చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి ఆదేశానుసారం అలాగే చేశాం."
"పోస్టుమార్టమ్ పూర్తయ్యాక సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్య అని అధికారులకు చెప్పాం. కానీ.. ఆ విషయాన్ని బయటపెట్టకుండా తాము చెప్పినట్లు చేయాలని అడిగారు. వెంటనే వెంటనే సుశాంత్ హత్య గురించి మా సీనియర్స్ కు తెలియజేశాం. వారు కూడా నిబంధనల ప్రకారం చేయాలని చెప్పారు. అంతేకాకుండా తొందరగా బాడీ ఫోటోస్ తీసి మృతదేహాన్ని తమకు అప్పగించాలని పోలీసులు చెప్పారు. అందుకే రాత్రిపూట పోస్టుమార్టమ్ చేసి, బాడీని అప్పగించేశాం" అని డాక్టర్ రూప్ కుమార్ తెలిపారు.
ఇప్పటికైనా సీబీఐ కళ్లు తెరిచి సుశాంత్ మృతిపై దర్యాప్తును ముమ్మరం చేసి.. అసలు కారణాలేంటో తెలుసుకుంటుందా ? లేక ఇలాగే కేసు విచారణ అంటూ మళ్లీ రెండ్రోజులు సైలెంట్ అయిపోతుందా ? అని సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Next Story