Mon Dec 23 2024 13:38:55 GMT+0000 (Coordinated Universal Time)
కరణ్ జోహార్ షో బండారాన్ని బయటపెట్టిన తాప్సీ
తాప్సీ నుండి ఊహించని సమాధానం వచ్చింది
కాఫీ విత్ కరణ్.. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే షో ఇది. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా ఉంది ఈ షో..! ముఖ్యంగా పలువురు సెలెబ్రిటీల సెక్స్ లైఫ్ గురించి కరణ్ జోహార్ అడుగుతూ ఉంటాడు. మరీ గుచ్చి గుచ్చి అదే టాపిక్ గురించి అడుగుతూ ఉంటే కొందరు సెలెబ్రిటీలకు కోపం కూడా వస్తూ ఉంటుంది. కొందరు బోల్డ్ గా సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక కొందరిని మాత్రమే ఈ షోకు కరణ్ జోహార్ పిలుస్తూ ఉంటాడనే విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా నటి తాప్సీకి ఈ షో గురించి జర్నలిస్టులు ప్రశ్నలు అడగగా.. తాప్సీ నుండి ఊహించని సమాధానం వచ్చింది.
తాప్సీ కొత్త చిత్రం 'దోబారా' ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ''చాలా మంది యాక్టర్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కరణ్ షోలో పాల్గొంటున్నారు. మరి మీకు ఆ షోల్ పాల్గొనడానికి ఆహ్వానం అందలేదా?'' అని ఓ జర్నలిస్ట్ తాప్సీని ప్రశ్నించాడు. దీనికి తాప్సీ స్పందిస్తూ.. కాఫీ విత్ కరణ్ షోకి ఆహ్వానించేలా తన శృంగార జీవితం అంత ఆసక్తికరంగా ఏమీ ఉండదని సెటైరికల్ కామెంట్స్ చేసింది. నటీనటుల శృంగార జీవితాలపైనే ఆ షోలో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారనే విషయాన్ని తాప్సీ ఇలా చెప్పుకొచ్చింది.
తాప్సీ పన్ను విషయానికి వస్తే.. ఆమె కొత్త చిత్రం దోబారాను అనురాగ్ కశ్యప్ తెరకెక్కించారు. ఏక్తా కపూర్ నిర్మించారు. ఈ చిత్రం ప్రతిష్టాత్మక లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభమైంది. మిస్టరీ డ్రామాలో పావైల్ గులాటి, నాసర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పానిష్ సినిమా మిరాజ్‌కి రీమేక్. ఆగస్ట్ 19న థియేటర్లలోకి రానుంది.
Next Story