Mon Dec 23 2024 05:16:09 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన ఆస్కార్ అవార్డుల వేడుక.. 2023 ఆస్కార్ విజేతలు వీరే : ఆ సినిమాకు 7 ఆస్కార్ లు
వరుసగా మూడోసారి ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కు జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆస్కార్ గురించి మాట్లాడిన..
భారతీయ కాలమానం ప్రకారం.. మార్చి 13 ఉదయం 5.30 గంటలకు (అమెరికా టైమ్ ప్రకారం మార్చి 12 సాయంత్రం) లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అకాడమీ పురస్కారాల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. వరుసగా మూడోసారి ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కు జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆస్కార్ గురించి మాట్లాడిన అనంతరం.. కొందరితో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ.. అవార్డుల వేడుకను ప్రారంభించారు. అంటే.. ఈ అవార్డుల వేడుక నాటు నాటు పాటతో ప్రారంభమైంది. మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ వేడుకకు.. ప్రపంచ నలుమూలల నుంచీ తారలు హాజరయ్యారు. మన RRR టీమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక అవార్డుల విషయానికొస్తే..
- ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గులెర్మో డెల్ టోరో తెరకెక్కించిన "పినాషియో" ఎంపికైంది. 95వ ఆస్కార్ పురస్కారాల్లో తొలి అవార్డు ఈ సినిమానే అందుకుంది.
- ఆ తర్వాత ఉత్తమ సహాయనటిగా "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్" సినిమాలో నటించిన జేమిలీ కర్టీస్ ఆస్కార్ ను అందుకున్నారు.
- 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డును "నవానీ" దక్కించుకుంది.
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ గా "ఏన్ ఐరిష్ గుడ్ బై" ఆస్కార్ కు ఎంపికైంది. టామ్ బెరిక్లీ, రోజ్ వైట్ లు ఈ అవార్డును అందుకున్నారు.
- ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్" సినిమాలో నటనకు గానూ ఆయనను ఆస్కార్ వరించింది.
- ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును జేమ్స్ ఫ్రెండ్ కైవసం చేసుకున్నారు. "ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్" సినిమాకి గాను ఆయన ఆస్కార్ అందుకున్నారు.
- ఉత్తమ హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ అవార్డును ది వేల్ సొంతమైంది. అడ్రిన్ మోరట్, జుడీ చిన్, బ్రాడ్లీ ఈ అవార్డులు అందుకున్నారు.
- 2023 ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా రూత్ కార్టర్ ఆస్కార్ ను అందుకున్నారు. "బ్లాక్ పాంథర్ వకండా ఫరెవర్ చిత్రానికి గానూ ఈ అవార్డు వచ్చింది.
- ఆస్కార్ వేదికపై మన తెలుగు పాటైన "నాటు నాటు" పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించగా.. అందుకు అనుగుణంగా కొందరు డ్యాన్స్ చేశారు. విశ్వవేదికపై నాటు నాటు పాట ఆలపిస్తుండగా.. అతిథులంతా తమ చప్పట్లతో థియేటర్ దద్దరిల్లేలా చేశారు.
- బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఏడాది తొలి ఆస్కార్ అందుకుంది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో "ది ఎలిఫెంట్ విస్పరర్స్" ఆస్కార్ ను అందుకుంది. కార్తికి గొన్సాల్వేస్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీని డగ్లస్ బ్లష్, గునీత్ మోంగా, ఆచిన్ జైన్ నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా "ది బాయ్, దిమోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్" ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది.
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో "ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్" సినిమా ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది. ఈ సినిమాకి క్రిస్టియన్ ఎం గోల్డెబెక్ ప్రొడక్షన్ డిజైనర్ గా, ఎర్నిస్టైన్ హిప్పర్ సెట్ డిజైనర్ గా వ్యవహరించారు.
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలోను "ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్" ఆస్కార్ ను సొంతం చేసుకుంది. వాకర్ బెర్టెల్ మాన్ సంగీతానికి సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది రెండు ఆస్కార్ లు అందుకున్న రెండో సినిమాగా "ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్" నిలిచింది.
- ఈసారి అవతార్ 2 కూడా ఆస్కార్ అందుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీగా అవతార్ 2 ఆస్కార్ ను అందుకుంది.
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" మరోసారి ఆస్కార్ అందుకుంది.
- ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే చిత్రంగా "ఉమెన్ టాకింగ్" సినిమా నిలిచింది. షెరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు.
- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటను ఆస్కార్ వరించింది. సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్లను అందుకున్నారు. ఆ క్షణంలో రాజమౌళి, ఆయన సతీమణి, కొడుకు ఆనందంతో గెంతులేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో..యావత్ భారత సినీ ప్రపంచం గర్వించింది.
- టామ్ క్రూజ్ నటించిన "టాప్ గన్ మావెరిక్" చిత్రం బెస్ట్ సౌండ్ కేటగిరీలో ఆస్కార్ ను అందుకుంది. మార్క్ వెనిగర్టెన్, జేమ్స్ హెచ్ మాథర్, ఆల్ నీల్సన్, క్రిస్ బర్డన్, మార్క్ టేలర్ లు ఈ అవార్డును అందుకున్నారు.
- ఈ ఏడాది "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్"కు ఆస్కార్ల వర్షం కురిసింది. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలోనూ ఈ సినిమాకే ఆస్కార్ దక్కింది. అలాగే ఉత్తమ చిత్రంగా కూడా "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" ఆస్కార్ ను అందుకుంది. దర్శకులు డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్ లు ఈ అవార్డును అందుకున్నారు. 2023 ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఈ సినిమా 7 ఆస్కార్లను అందుకున్న చిత్రంగా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్లను అందుకుంది.
- ఉత్తమ నటుడిగా "ది వేల్" చిత్రంలో నటనకు గాను బ్రెండాన్ ఫాసర్ ఆస్కార్ ను అందుకున్నారు.
95వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు ఘనంగా ముగిశాయి. చివరగా యాంకర్ జిమ్మీ కిమ్మెల్ తన వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఆస్కార్ వేడుకలను ముగించాడు.
Next Story