Sun Dec 22 2024 11:23:06 GMT+0000 (Coordinated Universal Time)
Tolly Wood : రామ్ చరణ్ కు పుష్ప ఎఫెక్ట్... టాలీవుడ్ గతి ఇక అంతేనా?
పుష్ప సినిమా ఎఫెక్ట్ రాంచరణ్ మూవీ గేమ్ ఛేంజర్ పై పడే అవకాశాలున్నాయి
పుష్ప సినిమా ఎఫెక్ట్ రాంచరణ్ మూవీ గేమ్ ఛేంజర్ పై పడే అవకాశాలున్నాయి. పుష్ప సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షో సందర్భంగా సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఇక పై బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే సమయంలో ధరలను పెంచేందుకు కూడా అనుమతి ఇవ్వబోమని తెలిపింది. దీంతో టాలీవుడ్ లో ఇక కలెక్షన్ల విషయంలో రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ధరలను పెంచడం, ప్రీమియర్ షోలకు అనుమతివ్వకపోవడంతో సినిమా విడుదలయిన తొలి వారంలో వసూళ్లు తగ్గుతాయి.
సంక్రాంతి పండగకు...
ఇక సంక్రాంతి పండగకు అనేక సినిమాలు వస్తున్నాయి. అందులో గ్లోబర్ స్టార్ రామచరణ్, శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ వచ్చే నెల పదోతేదీన విడుదల కానుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. తొలి వారం రోజుల్లోనే కోట్లాది రూపాయల వసూలు చేయాలని భావించినా పుష్ప ఈ సినిమా ఆదాయానికి గండి కొట్టిందనే చెప్పాలి. సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా తొలి వారం మాత్రం కలెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయని థియేటర్ యజమానులు చెబుతున్నారు. హిట్ టాక్ వస్తే నిదానంగా కలెక్షన్లు పెరుగుతుంటాయి. అదే ధరలను పెంచి, ప్రీమియర్ షోల ద్వారా అయితే అదనపు ఆదాయం మరింత ఎక్కువగా లభిస్తుంది. కానీ ప్రభుత్వ నిర్ణయంతో గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ ఆశలు అడియాసలయినట్లే.
వసూళ్లు తగ్గుతాయా?
పుష్ప 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలీవుడ్, టాలీవుడ్ లో బాక్సాఫీసు బద్దలు కొట్టింది. ఒకరకంగా బాహుబలి రికార్డులను కూడా అధిగమించింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు ఇప్పటికే రాబట్టినట్లు చెబుతున్నారు. ఇంకా వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే పుష్ప సినిమా వసూళ్లను బీట్ చేసే విషయంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వెనక్కు వెళ్లే అవకాశాలున్నాయన్న అంచనాల వినపడుతున్నాయి. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంథ్యా థియేటర్ లో జరిగిన ఘటన టాలీవుడ్ వసూళ్లపై తీవ్రమైన ప్రభావం చూపిందంటున్నారు. ఇక రికార్డులను అధిగమించడం కష్టమేనంటున్నారు. ఏదైనా ఇక తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రేట్లు పెంచుకుని, ప్రీమియర్ షోలు పెంచుకునే వీలుంది. తెలంగాణలో పుష్ప ఆ అవకాశం లేకుండా చేసినట్లయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story