Tue Nov 05 2024 23:37:21 GMT+0000 (Coordinated Universal Time)
"గ్యాంగ్ లీడర్" నటుడు వల్లభనేని జనార్థన్ కన్నుమూత
ఈ రోజు ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడుకి..
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా.. చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో సుమలతకు తండ్రిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన నటుడు వల్లభలేని జనార్థన్ (63) ఇకలేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడుకి జనార్థన్ మూడో అల్లుడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉండగా.. మొదటి కూతురు శ్వేత చిన్నప్పుడు మరణించింది. ఇక రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుండగా కొడుకు అవినాశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. వల్లభనేని జనార్థన్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జనార్థన్ ఏలూరుకు సమీపంలోని పోతునూరులో సెప్టెంబర్ 25, 1959న జన్మించారు. ఆది నుండి సినిమాలంటే ఆయనకెంతో ఆసక్తి. విజయవాడ లయోలా కాలేజీలో చదివి.. డిగ్రీ పట్టా అందుకోగానే.. సినిమా వైపు అడుగువేశారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి మామ్మగారి మనవలు పేరుతో తొలి సినిమా మొదలుపెట్టారు కానీ.. ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కన్నడ మానసరసరోవర్ రీమేక్ గా.. తెలుగులో చంద్రమోహన్ హీరోగా అమాయకచక్రవర్తి సినిమాకి దర్శకత్వం వహించారు. అనంతరం శోభన్ బాబుతో తోడు నీడ రూపొందించారు. కూతురు శ్వేత పేరుమీద ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి.. శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు సినిమాలను తీశారు. శ్రీమతి కావాలి సినిమాతోనే ఆయన నటుడిగా మారారు.
తన మామగారైన విజయబాపినీడు తీసిన.. అనేక చిత్రాలలో వల్లభనేని జనార్థన్ నటుడిగా రాణించారు. చిరంజీవితో బాపినీడు తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో సుమలత తండ్రి క్యారెక్టర్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. 100కు పైగా సినిమా నటించిన జనార్థనా, బాలకృష్ణ, నాగార్జు, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో కలిసి పనిచేశారు.
Next Story