Tue Nov 05 2024 05:45:26 GMT+0000 (Coordinated Universal Time)
Rachana Banerjee: ఎన్నికల బరిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్
యాక్ట్రెస్ రచనా.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు
యాక్ట్రెస్ రచనా.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కన్యాదానం, బావ గారూ బాగున్నారా!, మావిడాకులు, పిల్ల నచ్చింది లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించి బాగా దగ్గరైంది. దిగ్గజ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ రచనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. ఇక ఒరియాలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. బెంగాలీ టీవీ షోలలో కూడా నటించి బెంగాల్ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రచనా ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
నటి రచనా బెనర్జీ రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. నటి హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారు. మార్చి 10న, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ బ్రిగేడ్ గ్రౌండ్ మార్చ్ నుండి లోక్‌సభ 2024 ఎన్నికల కోసం పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నటి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారని తెలిపారు. అక్కడ ఆమె బెంగాలీ పరిశ్రమకు చెందిన మరో నటిపై పోటీ చేయనున్నారు. లాకెట్ ఛటర్జీ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున పోటీ చేస్తున్నారు.
ఒక వారం క్రితం, CM మమతా బెనర్జీ.. రచన ప్రముఖ రియాలిటీ షో దీదీ నంబర్ 1 లో కనిపించారు. ప్రత్యేక ఎపిసోడ్ మార్చి 3 న ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్లో మమత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తన కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించేందుకు రచన స్వయంగా మమత వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి రచన రాజకీయాల్లోకి వస్తున్నారనే వదంతులు వ్యాపించడం మొదలయ్యాయి. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని స్వయంగా సీఎం ప్రకటిస్తారని ఆమె మీడియాకు తెలిపారు. నబన్నాలో దీదీని కలిసిన కొన్ని రోజుల తర్వాత, హౌరాలోని తిలజలా స్టేడియంలో సీఎంతో కలిసి దీదీ నంబర్ 1 స్పెషల్ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు.
Next Story