ఇంతకీ ఎవరు గెలిచినట్టు..!
ఈ శుక్రవారం 2.ఓ ని దాటుకుని నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద హడావిడి చేశాయి. బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ - మెహ్రీన్ లు కలిసి నటించిన కవచం సినిమాకి ప్రేక్షకులు, రివ్యూ రైటర్స్ నుండి కూడా నెగెటివ్ మార్కులు పడ్డాయి. కవచం సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాస్ ని హైలెట్ చేస్తూనే హీరోయిజాన్ని చూపిస్తూ పోయాడు దర్శకుడు. ఇక టాప్ హీరోయిన్ కాజల్ అలాగే మీడియం రేంజ్ హీరోయిన్ మెహ్రీన్ లు కేవలం అందాల ఆరబోత, గ్లామర్ డాల్స్ గానే మిగిలారు తప్ప... వారి క్యారెక్టర్స్ కి అసలు ప్రాధాన్యత లేదు. ఇక ఈ సినిమా కథ మరీ రొటీన్ గా ఉండడం, డైరెక్షన్ లోపాలు, మ్యూజిక్ లో పస లేకపోవడం అన్నీ కవచం సినిమాకి కనీసం యావరేజ్ ఇవ్వలేకపోయాయి. బెల్లంకొండ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా డిజాస్టర్ అవడం మాత్రం ఖాయంగా కనబడుతుంది.
నెక్స్ట్ నువ్వే మరీ దారుణం...
ఇక తమన్నా గ్లామర్ తోనే సినిమా ఆడేస్తుందని భ్రమపడిన నెక్స్ట్ నువ్వే దర్శకుడు కూడా ఈ వారం ఫెయిల్ అయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన నెక్స్ట్ నువ్వే సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక సినిమాని చెడగొట్టడం అంటే ఎలా ఉంటుందో ఉదాహరణకు నెక్స్ట్ నువ్వే. ఈ సినిమాని దర్శకుడు అంత బోరింగ్ గా తెరకెక్కించాడు. అసలు నెక్స్ట్ నువ్వే కథని చూస్తే బాబోయ్ అనాలనిపిస్తుంది. సందీప్ కిషన్ నటన, తమన్నా నటన, గ్లామర్ ఎక్కడా ఆకట్టుకున్న సందర్భమే లేదు. ఆ సినిమాలో కాస్తో కూస్తో ఫర్వాలేదనిపించిన క్యారెక్టర్ కేవలం నవదీప్ ది మాత్రమే. బోరింగ్ కథ, చిరాకు పుట్టించే స్క్రీన్ ప్లే... అసలేమీ ఆకట్టుకోలేని సాంకేతికవర్గం అన్నీ నెక్స్ట్ నువ్వే కి కలిశాయి. అసలు ఈ కథతో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు..? అనేది ఎంత ఆలోచించినా బుర్రకెక్కదు. అందుకే క్రిటిక్స్ ఈ సినిమాని చీల్చి చెండాడారు. మినిమమ్ మార్కులు కూడా వెయ్యకుండా డిజాస్టర్ మార్కులేశారు.
సుబ్రమణ్యపురం కథ బాగున్నా...
ఇక ఈ వారం మరో చెప్పుకోదగిన చిత్రం సుమంత్ - ఈషా రెబ్బల సుబ్రమణ్యపురం. ఈ సినిమా కథలో కొత్తదనం ఉన్నా... దర్శకుడు కథనంలో తప్పటడుగు వెయ్యడం... ఈ కథని గతంలో వచ్చిన కార్తికేయ సినిమాతో ముడిపెట్టడంతో.. ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గింది. లేదంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా క్లిక్ అయ్యేది. సుమంత్ నటన బాగున్నప్పటికీ.. హీరోయిన్ ఈషాతో కలిసి రొమాంటిక్ సీన్స్ లో తేలిపోయాడు. ఇక నేపధ్య సంగీతం బాగున్నప్పటికీ.. మ్యూజిక్ ఆకట్టుకోలేపాయింది. అలాగే ఈ సినిమాకి ప్రధానంగా నిర్మాణ విలువలు లోపం. నిర్మాతలు చూసి చూసి ఖర్చు పెట్టినట్టుగా ప్రతి ఫ్రేమ్ లోనూ తెలిసిపోతుంది. ఇక మరో సినిమా శుభలేఖలు ఏ థియేటర్ లలోకి వచ్చిందని కూడా ప్రేక్షకుడి కనీస ఇంఫర్మేషన్ కూడా లేదు. మరి పైన చెప్పిన మ్యాటర్ తో ఈ వారం గెలుపెవరిదో మీరే డిసైడ్ చెయ్యండి.