Fri Nov 22 2024 21:17:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించింది : హీరో నాని
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే..
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం తగ్గించడంపై పెద్ద చర్చే జరుగుతోంది. అటు టాలీవుడ్ పెద్దలు కూడా ఏపీ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్న పరిస్థితులు నెలకొన్నాయనడంలో ఆశ్చర్యం లేదు. పలువురు టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు జీవో 35ను రద్దు చేయాలని కోరగా.. ప్రభుత్వం మాత్రం తగ్గేదే లే అని తెగేసి చెప్పింది. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది. జీవో 35 ను కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం.
ఇప్పటి వరకూ టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఈ విషయంపై స్పందించగా.. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలుపెంచినా .. ఇష్టమైన హీరో సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. అలాంటి ప్రేక్షకులను ప్రభుత్వం కావాలని అవమానిస్తోందని వాపోయారు. ఈ సమయంలో ఏం మాట్లాడినా.. అది వివాదానికి దారి తీస్తుందన్న నాని.. స్కూల్ పిల్లలను టూర్క కి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే.. ఒకరిని మాత్రం నువ్వు ఇవ్వలేవంటే.. అవమానించడమే కదా అని ఉదహరించారు.
కాగా.. రేపే (డిసెంబర్ 24) నాని- సాయిపల్లవి - కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నాని మీడియాతో చేసిన చిట్ చాట్ లో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఒక వర్గానికి చెందిన మహిళల కోసం శ్యామ్ సింగరాయ్ చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
Next Story