టాలీవుడ్లో విషాదం.. నటుడు శరత్ బాబు కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.
టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. శరత్‌బాబుకు వయస్సు మీద పడటంతో అనారోగ్య సమస్యలతో పాటు మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. దీంతో ఆయనను కొన్ని నెలల కిందట చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కూడా నిరంతరం శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. మొదట్లో ఆయన కొలుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. నెల రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన శరత్‌బాబు.. సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు.. అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో 'రామరాజ్యం' మూవీలో వెండి తెరకు పరిచమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు పలు భాషల్లో సుమారు 250కిపైగా సినిమాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వం వహించిన 'గుప్పెడు మనసు' మూవీతో శరత్ బాబుకు మంచి హిట్ పడింది. అప్పటి నుంచి శరత్ బాబు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు. చివరిసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో కనిపించారు శరత్ బాబు. పలు సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. 1974లో లేడీ కమెడియన్ రమా ప్రభను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి సంసారం ఎక్కువ కాలం నిలవలేదు. 1988లో రమాప్రభతో విడిపోయారు. 1990లో స్నేహ నంబియార్ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2011లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శరత్ బాబు ఒంటరిగానే ఉన్నారు.