Fri Nov 22 2024 22:24:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రేట్లు తగ్గించకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రారు : సీనియర్ నటుడు నరేష్
టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావట్లేదు అనేది నిజమే కావొచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు..
ఇటీవల కాలంలో జనాలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ తగ్గింది. బాక్సాఫీస్ వద్ద హిట్టైన సినిమాలకు కలెక్షన్లు లేకపోవడం.. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ మధ్యే నిర్మాతలు, ఫిలింఛాంబర్ పెద్దలు మీటింగులు పెట్టి జనాల్ని థియేటర్లకు ఎలా తీసుకురావాలని చర్చలు జరిపారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇచ్చారు. జనాలు థియేటర్ కు రాకపోవడంపై వినిపించిన ప్రధాన కారణం ఓటీటీ. సినిమాలు విడుదలైన 15-20 రోజులకే ఓటీటీలోకి రావడంతో థియేటర్లో చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందన్నారు.
అందుకు నిరసనగా షూటింగులు ఆపేసి సమ్మె కు పిలుపునిచ్చారు. ఓటీటీ సంస్థలతో చర్చలు అనంతరం సినిమాలు విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు ఒప్పుకున్నారు. కాగా.. తాజాగా ఇండస్ట్రీ సీనియర్ నటుడు నరేష్ జనాలు థియేటర్లకు రాకపోవడానికి అసలు కారణం ఇది అంటూ వరుస ట్వీట్లు చేశారు.
"టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావట్లేదు అనేది నిజమే కావొచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్ రూ.20, రూ.30కే థియేటర్స్ క్యాంటిన్ లలో దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300 అయింది. ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలంటే దాదాపు రూ.2500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా రేట్లు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారు. వాళ్లకి కావాల్సింది మంచి సినిమా మాత్రమే కాదు, మంచి అనుభవం కూడా" అని ఓ ట్వీట్లో రాశారు.
మరో ట్వీట్ లో "ఒకప్పుడు సినిమాలు వారం రోజులపైనే ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే ప్రేక్షకులు ఎక్కువసార్లు సినిమా చూడటానికి వస్తారు" అని తన అభిప్రాయాన్ని తెలిపారు నరేష్. నటుడు నరేష్ చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పింది నిజమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోసారి దర్శక, నిర్మాతలు, ఫిలించాంబర్ పెద్దలు కలిసి చర్చించి.. థియేటర్లలో తినుబండారాలు రేట్లను తగ్గించే దిశగా ఏవైనా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.
Next Story