Fri Nov 22 2024 20:05:59 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ కి మరో షాక్.. "బ్రహ్మాస్త్ర"కు కష్టాలు తప్పవన్న ఉమైర్ సంధు
హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పై ఓవర్సీస్ సెన్సార్ బోర్డు..
బాలీవుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న సమయంలో.. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన 'బ్రహ్మాస్త్ర' చిత్రంపై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాపై షాకింగ్ విషయం చెప్పారు ఉమైర్ సంధు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాణానికి అక్షరాలా రూ.410 కోట్లు ఖర్చైంది. కరణ్ జొహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పై ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ అయిన ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. బ్రహ్మాస్త్ర సినిమాలో ఆత్మ లోపించిందన్నారు ఆయన. సినిమా కోసం చేసిన భారీ పబ్లిసిటీ వల్ల రిలీజ్ రోజున, వీకెండ్స్ లోనూ వసూళ్లు వస్తాయి.. కానీ వీక్ డేస్ లో బ్రహ్మాస్త్ర కు ఆదరణ ఉండదన్నారు. ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువగా వస్తుంటాయన్న ఉమైర్.. ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనన్నాడు. ఈ చిత్రంలో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా యావరేజ్ గా ఉన్నాయని, సినిమా కొన్ని చోట్ల గజిబిజీగా అనిపిస్తుందని చెప్పాడు. ఈ చిత్రంలో రణబీర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడని తెలిపాడు. ఏం జరుగుతోందో కూడా తెలియని విధంగా రణబీర్ ఉన్నాడని.. అలియా భట్ మాత్రం స్టన్నింగ్ గా ఉందని ప్రశంసించాడు. సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని.. రెండు, మూడు సీక్వెన్సులు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నాడు. మొత్తం మీద సినిమాకు 5 పాయింట్లకు గాను ఉమైర్ 2.5 వేశాడు.
Next Story