ఆ పరిచయంతో.. డీల్ సెట్ చేసారుగా..!
ఈ మధ్యన యూవీ క్రియేషన్స్ జోరు మాములుగా లేదు. నిర్మాణ రంగంలోనే కాదు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ యూవీ వారు మాములు జోరు చూపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో సాహో చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఏపీ పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ గా ఎపుడో పాతుకుపోయారు. తాజాగా రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో నైజాం లోనూ జెండాని గట్టిగా పాతేశారు. నైజాంలో దిల్ రాజుని పక్కకి తప్పించి రంగస్థలం నైజాం రైట్స్ ని భారీ మొత్తానికి కొన్నప్పటికీ... ఆ సినిమా యూవీ క్రియేషన్స్ వారికి భారీ లాభాలు తెచ్చింది. ఆ దెబ్బకి యూవీ క్రియేషన్స్ వారు ఇప్పుడు రామ్ చరణ్ - బోయపాటి సినిమాని హోల్ సేల్ గా రెండు రాష్ట్రాల హక్కులను భారీ ధరకు కొనేసినట్టుగా ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే మొదలైన చర్చలు...
యూవీ క్రియేషన్స్ కి, ప్రభాస్ కి ఎలాంటి సంబంధాలున్నాయి తెలిసినవే. ఇక చరణ్ రంగస్థలం సినిమాకి అదరగొట్టే లాభాలందుకున్న యూవీ వారికి ఇప్పటికే సీడెడ్ తో పాటు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ పై బాగా పట్టుంది. మరి ఇప్పటికే చరణ్ - బోయపాటి కాంబోని సెట్ చేసిన డి.వి.వి దానయ్య తో యూవీ వారు చర్చలు జరిపినట్లుగా కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.
భారీ ధరకు...
మరి ఈ డీలింగ్ తో యూవీ వారు మాములు డిస్ట్రిబ్యూటర్లు గా కాదు స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు గా టాలీవుడ్ లో జెండా పాతడం అనేది మాత్రం పక్కా అంటున్నారు. ఇక రంగస్థలం సినిమాకి నైజాం లో భారీ రేట్ కోడ్ చేసిన యూవీ వారికే చరణ్- బోయపాటి మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయట. మరి రేటు విషయంలోనే ఒక ఐదు కోట్ల దగ్గర అటూ ఇటూ గా ఊగిసలాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చరణ్ - బోయపాటి శ్రీనుల కంబోకి సుమారుగా 75 కోట్లకు బేరం ఫైనల్ కావచ్చని ఫిలింనగర్ టాక్.