Tue Dec 24 2024 03:03:59 GMT+0000 (Coordinated Universal Time)
చిన్న కూతురితో మూవీ ప్రమోషన్స్‌లో విజయ్ ఆంటోనీ..
పెద్ద కూతురు మరణ తరువాత మొదటసారి మీడియా ముందుకు విజయ్ ఆంటోనీ. చిన్న కూతురితో కలిసి సినిమా ప్రమోషన్స్‌లో..
తమిళ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయన పెద్ద కూతురు 'మీరా' ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆమె మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లారు. తన మరణాన్ని తట్టుకోలేక విజయ్ ఆంటోనీ ఒక ఎమోషనల్ లెటర్ కూడా రిలీజ్ చేశాడు. 'నా కూతురుతో పాటే నేను చనిపోయాను' అంటూ విజయ్ ఆ లెటర్ పేర్కొనడం.. ప్రతి ఒక్కర్ని ఎమోషనల్ చేసింది.
దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్ కి ధైర్యం చెబుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉంటే, విజయ్ ఆంటోనీ నటించిన 'రత్తం' అనే మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. అక్టోబర్ 6న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ఎప్పుడో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పరిస్థితి ఇలా ఉండడంతో.. నిర్మాతలకు మూవీ రిలీజ్ ని ఏం చేయాలో అర్థంకాలేదు.
ఇక చేసేది లేక విడుదలను వాయిదా వేయాలని భావించారు. అయితే 'రత్తం' మూవీ ఇప్పటికే పోస్టుపోన్ అయ్యి ఆ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు కూడా వాయిదా అంటే నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన విజయ్ ఆంటోనీ.. అక్టోబర్ 6నే మూవీని రిలీజ్ చేయండి అంటూ సూచించాడట. అంతేకాదు నిర్మాతలకు నష్టం కలగకూడదని ప్రమోషన్స్ కి కూడా వస్తాను అని చెప్పాడట.
ఈ నేపథ్యంలోనే చెన్నైలో జరిగిన 'రత్తం' మూవీ ప్రెస్ మీట్ కి విజయ్ ఆంటోనీ.. తన చిన్న కూతురు 'లారా'తో కలిసి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, నెట్టింట వైరల్ గా మారాయి. కూతురు మరణాన్ని దిగమింగుకోని.. ఇలా నిర్మాత కోసం, సినిమా కోసం విజయ్ రావడాన్ని నెటిజెన్స్ అభినందిస్తున్నారు. ఇక నిర్మాత కూడా విజయ్ డెడికేషన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశాడు.
Next Story