Mon Dec 23 2024 05:14:26 GMT+0000 (Coordinated Universal Time)
కోటి రూపాయలను పంచనున్న విజయ్ దేవరకొండ
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. వంద కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని వెల్లడించారు
విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. వంద కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని వెల్లడించారు. బాగా డబ్బు సంపాదించి తల్లిదండ్రులను సంతోషపెట్టాలని అనుకునేవాడ్నని, సమాజంలో గౌరవం లభించాలని కోరుకునేవాడినని విజయ్ దేవరకొండ అన్నారు. ఇప్పటివరకు తనకు స్ఫూర్తినిచ్చే అంశాలు ఇవేనని, కానీ ఇప్పటి నుంచి అభిమానుల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఖుషి సినిమా ఫేక్ రివ్యూలను, తప్పుడు ప్రచారాన్ని అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులేనని విజయ్ దేవరకొండ అన్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని కానీ అభిమానుల ప్రేమ ముందు అవేవీ పనిచేయలేదని అన్నారు. అభిమానుల ముఖాల్లో ఆనందం చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందని అన్నారు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష ఇస్తానని విజయ్ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని వారికి మరో వారం, పది రోజుల్లో అందిస్తానని అన్నారు. నా ఆనందమే కాదు, నా సంపాదనను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు విజయ్ దేవరకొండ. ఈ ప్రకటనతో అభిమానులంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ ప్రదర్శనను కనబరుస్తోంది. APలో,ఈ చిత్రం మంచి మొదటి మూడు రోజులలో 9.5 కోట్ల రూపాయలను సాధించింది. నైజాం రీజియన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఖుషీకి 15 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా 11 కోట్ల రూపాయలను ఇప్పటికే కలెక్ట్ చేసింది.
Next Story