ఈ ఏడాది సర్కార్ దే హవా..!
విజయ్ - మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ భారీగా అంచనాలతో దీపావళి కానుకగా విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి షోకే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సర్కార్ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే సినిమా విడుదలైన రెండో రోజే సర్కార్ సినిమా సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒక విధంగా ఆ సమస్యలు కూడా విజయ్ సినిమా సర్కార్ కి కలిసొచ్చి సినిమా వసూళ్లు పెరగడానికి కారణమయ్యాయి. సర్కార్ సినిమా ఓపెనింగ్ రోజే తెలుగు, తమిళంలో రికార్డుల మోత మోగించింది. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా సర్కార్ నిలిచింది.
రంగస్థలం రికార్డు బ్రేక్...
ఇక విడుదలైన నాలుగు రోజులకే సర్కార్ 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం... తర్వాత విజయ్ మెర్సెల్ సినిమా కలెక్షన్స్ ని ఈ సర్కార్ క్రాస్ చెయ్యడం తెలిసిందే. సౌత్ లోనే బాహుబలి తర్వాత రోబో, కబాలి, మెర్సిల్, రంగస్థలం సినిమాలు 200 కోట్ల క్లబ్ లోకి చేరిన వాటిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విజయ్ సర్కార్ కూడా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడమే కాదు.. రంగస్థలంకి వచ్చిన రికార్డులను చెరిపేస్తుంది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం 215 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... సర్కార్ ఇంతవరకూ 217 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
వివాదాలతోనే కలెక్షన్లు...
ఈ ఎడాది దక్షిణాదిన అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా విజయ్ సర్కార్ నిలిచింది. అసలు మొదట్లో డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సర్కార్ సినిమా ఇలా అనూహ్యంగా కలెక్షన్స్ మోత మోగించడం మాత్రం స్పెషల్ గా చెప్పొచ్చు. ఇక ఈ వసూళ్లు రావడానికి సర్కార్ మీద వివాదాలు ఒక కారణమైతే మరో కారణం విజయ్ క్రేజ్.