Mon Dec 23 2024 08:06:45 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పాత్రలో జీవా ఫిక్స్.. 'యాత్ర 2' టెస్ట్ ఫోటోషూట్ వీడియో వైరల్..
'యాత్ర 2' సినిమాలో వైఎస్ జగన్ పాత్రని తమిళ్ హీరో జీవా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన వీడియో..
టాలీవుడ్ డైరెక్టర్ మహీ వి రాఘవ్.. వైఎస్ జగన్ లైఫ్ స్టోరీతో 'యాత్ర 2' తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను కథగా తీసుకోని తెరకెక్కించిన సినిమా 'యాత్ర'. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ హీరో 'మమ్ముట్టి' నటించగా.. 2019లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ ఎన్నికల సమయంలో సీక్వెల్ తీసుకు రావడానికి దర్శకుడు సిద్దమయ్యాడు.
ఈ సీక్వెల్ ని వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కించబోతున్నాడు. వైఎస్సార్ చనిపోయిన సంఘటనతో సినిమా మొదలయ్యి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ముగియనుంది. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రని ఎవరు పోషించబోతున్నారు అంటూ అందరిలో క్యూరియాసిటీ నెలకుంది. ఆల్రెడీ జగన్ పాత్రతో రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెరకెక్కించగా.. వాటిలో జగన్ పాత్రలో 'అజ్మల్ అమీర్' నటించాడు.
కాగా ఈ యాత్ర 2లో జగన్ పాత్రని తమిళ్ హీరో జీవా (Jiiva) నటించబోతున్నాడు అంటూ ముందు నుంచి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ విషయం గురించి దర్శకుడిని గతంలో ప్రశ్నించినప్పటికీ బదులివ్వలేదు. అయితే తాజాగా నెట్టింట ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో జగన్గా జీవా కనిపిస్తున్నాడు. జగన్ పాత్రలో జీవాని టెస్ట్ లుక్ ఫోటోషూట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన ఆడియన్స్.. జగన్ పాత్రలో జీవా బాగా సెట్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి జీవాని వైఎస్ జగన్ గా మూవీ టీం ఎప్పుడు అఫీషియల్ గా పరిచయం చేస్తుందో చూడాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలుస్తుంది. V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థలు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. ప్రభాస్ 'కల్కి'కి మ్యూజిక్ అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Next Story