'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ
నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియదర్శి
మ్యూజిక్ డైరెక్టర్: ఫిష్ గో డీప్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కిషోర్ తిరుమల
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో చాల గ్యాప్ తర్వాత 'నేను శైలజ' తో సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. 'నేను శైలజ' సినిమాతో అటు రామ్ ఇటు దర్శకుడు కిషోర్ తిరుమల ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 'నేను శైలజ' సినిమాలో రామ్ ప్రేమికుడిగా... తన ప్రేమను సాధించుకోవడం కోసం ఎలాంటి ఎత్తులు వేస్తూ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఇంప్రెస్స్ చేసాడో చూపించాడు దర్శకుడు కిషోర్. ఇక 'నేను శైలజ'తో రామ్ కాస్త కుదుట పడ్డాడు అనుకునేలోపు 'హైపర్' వంటి రొటీన్ ఫార్ములా సినిమాతో మళ్ళీ నిరాశ పరిచాడు. అయితే 'నేను శైలజ'తో తన కెరీర్ ని గాడిలో పడేసిన కిషోర్ తో మరోమారు 'ఉన్నది ఒకటే జిందగీ'తో జట్టుకట్టాడు రామ్. స్నేహితులు, ప్రేమ, జీవితం అంటూ ఈ మూడు దశల నేపథ్యంలో సాగే కథగా 'ఉన్నది ఒకటే జిందగీ' తెరకెక్కింది. ప్రస్తుత జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచేస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమలలు. ఈ చిత్రంలో రామ్ సరసన మొదటిసారి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ 'ఉన్నది ఒకటే జిందగీ' లో రామ్ కి స్నేహితుడిగా హీరో శ్రీ విష్ణు నటించాడు. ఇక రామ్ ఈ సినిమాలో గెడ్డంతో కాస్త వెరైటీగానే ట్రై చేసాడు. మరి మళ్ళీ 'నేను శైలజ' వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని తహతహలాడుతున్న రామ్ కి, కిషోర్ కి ఈ 'ఉన్నది ఒకటే జిందగీ' ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలో తెలుసుకుందాం. తెలుసుకుందాం.
కథ:
అభి (రామ్) మరియు వాసు( శ్రీ విష్ణు) లు చిన్నప్పటినుండి మంచి స్నేహితులు. చిన్నప్పటినుండి ఏ విషయాన్ని అయినా ఒకరితో ఒకరు పంచుకుంటూ హ్యాపీ గా గడిపేస్తుంటారు. అయితే ఒక ప్రాజెక్ట్ పనిమీద వాసు ఢిల్లీ వెళ్ళినప్పుడు అభికి మహా(అనుపమ పరమేశ్వరన్) తో స్నేహం ఏర్పడుతుంది. మహా డాక్టర్ చదుతున్నప్పటికీ ఆమెకి మ్యూజిక్ అంటే ప్రాణం. సింగర్ గా స్టేజ్ మీద పాటలు పాడాలని కలలుకంటుంటుంది. అయితే ఆమె కళను తెలుసుకున్న అభి తన రాక్ బ్యాండ్ లో పాట పాడే అవకాశం ఇస్తాడు. ఎంతో స్నేహంగా వుండే వారిమధ్య అనుకోకుండా ప్రేమ చిగురిస్తుంది. ఆ విషయాన్నీ ఒకరితో ఒకరు పంచుకోకుండా మనసులోనే దాచేసుకుంటారు. అయితే అభికి మహా గురించిన ఒక విషయం తెలుస్తుంది. ఆ క్రమంలోనే అభికి మహా దూరమవడమే కాకూండా అభికి ప్రాణ స్నేహితుడైన వాసు కి మధ్యన గొడవ జరిగి విడిపోతారు. ఈ గొడవలతో విసిగిపోయిన అభి ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోతాడు... అసలు అభికి మహా గురించి ఏం తెలిసింది? మహా... అభిని ఎందుకు కాదంటుంది? అసలు వాసుకి అభికి గొడవేమిటి? ఎంతో స్నేహం ఉన్న వారి మధ్యన అసలు గొడవలు కారణమేమిటి అనే విషయాలు స్రీన్ మీద చూసి తెలుసుకుంటేనే బావుంటుంది. .
నటీనటుల నటన:
అభి గా రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఎంతో చక్కటి నటనను ప్రదర్శించాడు. ఎంతో ఎనర్జీతో ఈ సినిమాలో రామ్ నటన అద్భుతంగా వుంది. ఎమోషన్, ఎక్సప్రెషన్, ప్రేమ, స్నేహం ఇలా అన్ని సన్నివేశాల్లోను రామ్ నటన సూపర్. రామ్ లుక్స్ ఇదివరకటి సినిమాలతో పోలిస్తే చాలా డిఫ్రెంట్ గా ఉంది. కుర్రకారుని ఆకట్టుకునే లుక్ తో రామ్ చాలా బాగా కనిపించాడు. రామ్ లుక్స్, రామ్ నటన కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ అనిపించేలా ఉన్నాయి. ఇక రామ్ స్నేహితుడిగా శ్రీ విష్ణు కి మంచి పాత్ర లభించింది. పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ శ్రీ విష్ణు ఉన్నంతలో మెప్పించాడు. హీరోయిన్స్ విషయానికొస్తే అనుపమ పరమేశ్వరన్ కి మహా లాంటి అద్భుతమైన పాత్ర దక్కింది. ఆమె కెరీర్ లో పది కాలాలు గుర్తుండిపోయే పాత్రలో మెప్పించింది. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడమే కాదు మహా పాత్రకు ప్రాణం పోసింది. ఇక రెండో హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్రలో నటించింది. ఉన్నంతలో ఓకే అనుకున్న కూడా.. ఆమెకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత కనబడదు. ఇక హాస్య నటుడు ప్రియదర్శి కూడా తనదైన స్టయిల్లో బాగానే ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు:
నేను శైలజతో మంచి హిట్ కొట్టిన కిషోర్ తిరుమల - రామ్ కలయికలో ఉన్నది ఒకటే జిందగీ తెరకెక్కుతుంది... అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడిపోయాయి. ఆ అంచనాలు అందుకోవడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు అనే విషయం ఉన్నది ఒకటే జిందగీ ప్రతి సన్నివేశంలోనూ కనబడుతుంది. ఒక మంచి యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమాని దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. హీరో రామ్ ని కొత్తగా చూపించడంతోపాటే... స్నేహం, ప్రేమ కు సంబందించిన ప్రతి విషయాన్నీ ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. రామ్ - శ్రీ విష్ణు ల మధ్య స్నేహాన్ని ప్రెసెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది. ప్రేమ, స్నేహం లో ఏది గొప్ప అనే విషయాన్ని స్క్రీన్ మీద చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. దర్శకుడు చెప్పినట్టుగానే రామ్, శ్రీ విష్ణు, అనుపమలు కూడా తమ తమ పాత్రలకు ప్రాణం పోసి నటించారు. ఒక చక్కని కథతో కిషోర్ తిరుమల మరోమారు సక్సెస్ సాధించాడు. అలాగే నేను శైలజ హిట్ ని రామ్ - కిషోర్ లు రిపీట్ చేశారనే చెప్పాలి. ఉన్నది ఒకటే జిందగీలో ప్రతి ఫ్రెమ్ లోను దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనబడుతుంది. యూత్ కి బాగా కనెక్ట్ అవడమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.
ఇక టెక్నీకల్ గా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతంలో రెండు పాటలు సూపర్ గా ఉంటే మిగతా పాటలు సో సో గా ఉన్నాయి. అయితే రామ్ - దేవిశ్రీ కలయికలో వచ్చిన ఈ సినిమా మాత్రం విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా వుంది. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ మనసుని తాకేలా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ ని అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ లో చిన్న లోపాలు మినహాయిస్తే ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో నిర్మాణ విలువలకు ఎక్కడా వంకపెట్టాలా లేదు. నిర్మాణ విలువలు బాహున్నాయి.
చివరిగా దర్శకుడు కిషోర్ తిరుమల కథనంలో మరిన్ని ఆసక్తికర ట్విస్టులు, కామెడీ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చినట్టయితే ఈ సినిమా హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉండేది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు, యూత్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి... రామ్ - కిషోర్ మరోసారి ఉన్నది ఒకటే జిందగీ తో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
రామ్ నటన, శ్రీ విష్ణు నటన, అనుపమ పరమేశ్వరన్, మనసును తాకే కొన్ని డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్, స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
రేటింగ్: 3.0/5