ఒక్కడు మిగిలాడు మూవీ రివ్యూ
నటీనటులు: మంచు మనోజ్, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి
మ్యూజిక్ డైరెక్టర్: శివ నందిగామ
నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్
దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్
ఎప్పుడూ డిఫ్రెంట్ డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకునే మనోజ్ కి ఈ మధ్య కాలంలో హిట్ అనేదే లేకుండా పోయింది. అతనినుండి వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడుతుంది. ఆమధ్యన వచ్చిన గుంటూరోడు తీవ్ర నిరాశ పరిచింది. అందుకే ఈసారి దేశ భక్తిని నమ్ముకున్నాడు. కొన్నాళ్ల క్రితం భారతదేశం నుండి విడిపోయింది శ్రీలంక. ఆ సమయంలో కొందరు శరణార్ధులుగా ఇండియాకు రాగా.... మరికొందరు శరణార్థులు శ్రీలంకలోనే ఉండిపోయారు. శ్రీలంకలో శరణార్ధులుగా ఉండిపోయిన తమిళులకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలంటూ పోరాటానికి దిగే యువకుని పాత్రలో మంచు మనోజ్ ఈ ఒక్కడు మిగిలాడు సినిమాలో కనబడ్డాడు. రెండు పాత్రల్లో అలరించిన మనోజ్ రెండు పాత్రలు కూడా పోరాటానికి సై అనే పాత్రలే కావడం గమనార్హం. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని ఆటుపోట్లు తట్టుకుని ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పరాజయాలతో సతమతమవుతున్న మంచు మనోజ్ పోరాట యోధుడిగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుని విజయ బావుటా ఎగురవేసాడో? లేదా మరల పాత లెక్కల ప్రకారం అపజయం మూట గట్టుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఒక్కడు మిగిలాడు సినిమా కథ మొత్తం తమిళనాడు, శ్రీలంక శరణార్ధుల చుట్టూ తిరిగే దీన గాధ. ఇకకథలోకి వెళితే.... శ్రీలంకలో శరణార్ధులుగా ఉండిపోయిన తమిళులకు ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఇవ్వమని పోరాటానికి దిగుతాడు పీటర్(మంచు మనోజ్). ఆ పోరాటంలో పీటర్ తన ప్రాణాన్ని కోల్పోతాడు. పీటర్ చనిపోతూకొందరు శరణార్ధుల్ని ఒక పడవ లోకి ఎక్కించేసి పంపించేస్తాడు. అలా పది రోజుల పాటు తిండి, నీరు, నిద్ర లేకుండా పడవలో ప్రయాణం చేసిన వారిలో చాలామంది ఆ పదవిలోనే చనిపోతారు. మరోపక్క సూర్య(మంచు మనోజ్) యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్. శరణార్థుడిగా ఉన్న సూర్యని ఒక కాలనీ వారు చేరదీసి పెంచుతారు. అయితే అదే కాలనీకి చెందిన ముగ్గురు అమ్మాయిలను మంత్రి కొడుకులు అత్యాచారం చేయాలనుకుంటారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ముగ్గురు అమ్మాయిలు పురుగులమందు తాగి చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వారికి న్యాయం జరగాలని పోరాటానికి దిగుతాడు. సూర్య కి స్వర్ణ(అనీషా ఆంబ్రోస్) అనే జర్నలిస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో సూర్య పోలీస్ లకు చిక్కి చిత్ర హింసలు అనుభవిస్తాడు. అయితే ఆ మంత్రి సూర్యని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. మరి పీటర్ కి సూర్య కి సంబంధం ఏమిటి? అసలు ఆ పడవలో ప్రాణాలు కోల్పోగా... ఇంకెందరు బతికి బట్టకడతారు? అసలు మంత్రితో పోరాటానికి దిగిన సూర్య చివరికి ఏమయ్యాడు? ఆ చనిపోయిన ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరిగిందా? ఇవన్నీ తెలియాలి అంటే ఒక్కడు మిగిలాడు సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల నటన:
ఈ సినిమా కోసం మనోజ్ శరీర బరువు తగ్గడం, పెరగడం ఇలా చాలా కష్టపడ్డాడు. పీటర్ పాత్ర కోసం మనోజ్ బరువు పెరిగాడు. అలాగే సూర్య పాత్ర కోసం మళ్లీ బరువు తగ్గాడు. ఆహార్యం, హావభావాల్లో కూడా చక్కటి వేరియేషన్ను చూపాడు మనోజ్. రెండు విభిన్నమైన పాత్రలో ఆకట్టుకునే ప్రదర్శన చేసాడు. అయితే రెండు పాత్రల్లో కూడా తన నటన అక్కడక్కడా శ్రుతిమించిందనిపిస్తుంది. తెరపై మనోజ్ ను చూడడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. మనోజ్ బరువు ఈ సినిమాకి మెయిన్ మైనస్. కొన్ని సీన్స్ లో చాలా లావుగా కనబడుతూ ప్రేక్షకులని ఇబ్బంది పెట్టేసాడు. ఇక ఈ సినిమాలో దర్శకుడు అజయ్ ఆండ్రూస్ కూడా విక్టర్ అనే పాత్రలో నటించాడు. అసలు ఈ సినిమాలో హీరో పాత్ర కంటే అజయ్ ఆండ్రూస్ పాత్రకే కాస్త వెయిట్ ఎక్కువ ఉందనిపించింది. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ రిపోర్టర్ పాత్రలో బాగానే నటించింది. పోసాని కృష్ణమురళి, మిళింద్ గునాజీ, సుహాసిని తమ పాత్రల పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
నిజ జీవితంలో జరిగిన ఒక ఘటనను కళ్ళకు కట్టినట్టుగా చూపించాలని అనుకున్న దర్శకుడు ప్రయత్నానికి నిజంగా హేట్సాఫ్ చెప్పాల్సిందే. దర్శకుడు అజయ్ ఆండ్రూస్ శ్రీలంకలో శరణార్ధుల కోసం జరిగిన పోరాటాన్ని కథగా ఎన్నుకున్నాడు. అతడు తీసుకున్న పాయింట్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ.... దానిని తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక చతికిల పడ్డాడు. కేవలం ప్రయత్నలోపంగా సినిమా మిగిలిపోయింది. ఇక కథనం విషయానికొస్తే కథనాన్ని కూడా ఏమంత ఆసక్తికరంగా నడిపించ లేకపోయాడు దర్శకుడు. సినిమా ఆధ్యంతం చంపుకోవడం, రక్తం, హింస ఇవే తప్ప మరొకటి కనిపించదు. కాని అజయ్ సమస్యను ఎంత తీవ్రంగా చూపిస్తే అంతగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అనే అంచనాతో కన్విన్సింగ్ గా చెప్పాలి అనే పాయింట్ ను మర్చిపోయాడు. కామెడీకి అస్సలు స్కోప్ లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా సినిమా చూడాలనుకునే వారిని ఈ సినిమా అసలు ఎంటర్టైన్ చేయదు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మరీ రొటీన్ గా అనిపిస్తాయి.
టెక్నికల్ గా... అసలు కథలో సత్తా లేనప్పుడు సాంకేతిక విభాగం ఎంత పని చేసినా తక్కువగానే కనిపిస్తుంది. శివ నందిగామ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. పాటల విషయానికొస్తే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేవు. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకోదు. ఇక సినిమాలో ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.రామరాజా కెమెరా మాత్రం చాలా హై స్టాండర్డ్స్ లో ఉంది. సముద్రం ఎపిసోడ్ అద్భుతంగా వచ్చింది. కానీ కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ అంత ఎఫక్టీవ్ గా అనిపించదు. సినిమా మొదటి భాగం కాస్త రేసీ స్క్రీన్ ప్లే తో నడిచింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. ఇక నిర్మాణ విలువలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా కనబడవు.
ప్లస్ పాయింట్స్: మంచు మనోజ్ నటన, కొన్ని డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్: తమిళ నేటివిటీ, పాటలు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్, మనోజ్ భారీ తనం.
రేటింగ్: 2.0 /5