ఓం నమో వెంకటేశాయ మూవీ రివ్యూ
నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రగ్య జైస్వాల్, సౌరభ్ రాజ్ జైన్, జగపతి బాబు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
ప్రొడ్యూసర్: ఏ. మహేష్ రెడ్డి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నాగార్జున ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో రకాల చిత్రాలలో నటించాడు. కొంతమంది హీరోలు కేవలం ఒకే జోనర్ లో సినిమాలు చేస్తూ పోతుంటారు. కానీ నాగార్జున మాత్రం విభిన్న పాత్రల్లో ప్రేక్షకులని, అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటాడు. మాస్ చిత్రాలతో మాస్ హీరో అనిపించుకున్నా.... మన్మధుడిగా అమ్మాయిల కు కంటి మీద కునుకు లేకుండా చేసినా... కుటుంభం కథా చిత్రాలతో ఫ్యామిలీ హీరో గా ఇలా ఎన్నో రకాల విభిన్న పాత్రలకు నాగార్జున పెట్టింది పేరు. ఇక భక్తి చిత్రాలలో తనకు తానే సాటి అనే రీతిలో నాగార్జున ప్రతిభ కనబడుతుంది.
డైరెక్టర్ రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిన భక్తిరస చిత్రాలైన 'అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి' చిత్రాలు అత్యంత అద్భుతమైన చిత్రాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆ చిత్రాలు కె రాఘవేంద్ర రావు కేవలం భక్తి నే కాకుండా ప్రేమ రసం కూడా జోడించి ఇలా కూడా చిత్రాలు హిట్ చెయ్యొచ్చని చూపించాడు. ఇక నాగార్జునని వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా 'అన్నమయ్య' చిత్రంలో చూపించిన రాఘవేంద్ర రావు మరి 'ఓం నమో వెంకటేశాయ'లో ఇంకెలా చూపిస్తాడు అనే డౌట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో మెదిలింది. అసలు హీరోగా చేసిన నాగార్జునకే మొదట ఆ డౌట్ వచ్చిందంటే ఇక ప్రేక్షకులకు రావడంలో తప్పులేదు. 'రామదాసు'లో నాగార్జున ని రాముడి భక్తుడిగా చూపించిన డైరెక్టర్ 'షిరిడి సాయి' చిత్రంలో సాయి బాబాగా చూపించాడు. అసలు ఆ కేరెక్టర్స్ కి నాగార్జున అయితేనే బావుంటుందని దర్శకుడు భావించి ఆ సినిమాలు చెయ్యడాని కి అంత ధైర్యం చేసాడు. కేవలం నాలుగు ఫైట్ట్స్, నాలుగు పాటలు, నాలుగు రొమాంటిక్ సన్నివేశాలకు అలావాటుపడిన టైములో ఇలా ఇప్పుడు భక్తి చిత్రాలను చెయ్యడానికి.... చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. మరి అలంటి సమయంలో ఇలా భక్తి చిత్రాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న దర్శకుడు రాఘవేంద్ర రావు ధైర్యానికి హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక హీరోయిన్ అనుష్క మొదటిసారి ఒక భక్తురాలిగా 'ఓం నమో వెంకటేశాయ'లో కనబడుతుంది. ఇప్పటికే కృష్ణమ్మగా ఫస్ట్ లుక్ తో ఆమె అందం, అభినయంతో ఆకట్టుకున్న అనుష్క ఇక చిత్రంలో ఎలా కనబడనుందో కొన్ని పాటలు, ట్రైలర్స్ లో చూపించారు. మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కొంచెం గ్లామర్ గా, చాలా అందం గా కనబడనుందని మొదటి నుండి చెబుతున్నారు. నాలుగొందల ఏళ్ళనాడు వెంకటేశ్వర స్వామి తో ఆటలాడిన ఒక భక్తుడి కథ అంటూ పబ్లిసిటీ చేస్తూ... హాథిరామ్ బాబాగా నాగార్జున ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే. ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రాఘవేంద్ర రావు - నాగార్జున లు ఇద్దరూ తమ భక్తితో ప్రేక్షకులని ఆకట్టుకున్నారా.. లేదా.. అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ: పద్మానంద స్వామి (సాయి కుమార్) అనే గురువు దగ్గరకి రామ్( నాగార్జున) అనే కుర్రాడు చిన్నప్పటినుండి విద్య నేర్చుకోవడానికి తిరుమల వస్తాడు. ఇక రామ్ కి చిన్న తనం నుండి దేవుడిని చూడాలి అనే కోరికతో తీవ్రమైన ధ్యాన తపస్సులో మునిగితేలుతాడు. రామ్ తపస్సుక్కి కరిగిన వెంకటేశ్వర స్వామి ఒక సామాన్యుడిగా ప్రత్యక్షమవుతాడు. వేంకటేశ్వర స్వామితో ( సౌరభ్ రాజ్ జైన్) రామ్ ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటాడు. ఇక పాచికల ఆటలో వెంకటేశ్వర్ స్వామితో రామ్ ఎప్పటికప్పుడు గెలుస్తూ ఉంటాడు. అయితే తాను దేవునితో గడుపుతున్నాననే విషయాని గుర్తించడు. మరోపక్క తిరుమలలో జరిగే అన్యాయాలను కృష్ణమ్మ (అనుష్క) తో కలిసి ఎదురిస్తుంటాడు. అయితే తాను దేవుడితో నే కలిసి వున్నానని విషయాన్నీ రామ్ చాలా ఆలస్యంగా తెలుసుకుని మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తహ తహ లాడుతుంటాడు. కానీ కొంతమంది దుర్మార్గులు రామ్ ని దేవుడి దారికి చేరకుండా అడ్డుకుంటారు. అసలు తిరుమలలో జరిగే అన్యాయాలేమిటి? వాటిని రామ్ ఏవిధము గా ఎదుర్కున్నాడు? కృష్ణమ్మ కి రామ్ కి ఉన్న అనుబంధం ఏమిటి? అసలు రామ్ హాథిరాంబాబాగా ఎందుకు మారాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే ఓం నమో వెంకటేశాయని తెర మీద చూడాల్సిందే.
నటీనటులు: మరోసారి నాగార్జున హాథిరామ్ బాబా పాత్రలో ఓం నమో వెంకటేశాయ లో జీవించి తనకు ఎవరు సాటి రారు అని నిరూపించాడు. వెంకటేశ్వర స్వామిని నిత్యం ఆరాధించే భక్తుడిగా నాగార్జున నటన ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది. అసలు భక్తుడు అంటే నాగార్జున అనిపించేలా హాథిరామ్ బాబా పాత్రకు జీవం పోసాడు. ఇక అనుష్క కృష్ణమ్మగా... భక్తురాలిగా అలరించింది. ఆమె అందం అభినయంతో మరోసారి ప్రేక్షకులని మైమరపింప జేసింది. ఇక ప్రగ్య జైస్వాల్ గ్లామర్ తో, తన నటనతో ప్రేక్షకులని మెప్పించింది. వెంకటేశ్వర స్వామిగా సౌరభ్ రాజ్ జైన్ ఆ పాత్రకి చక్కగా ఇమిడిపోయాడు.ఆ హావభావాలు, ముఖంలో ఆ తేజస్సుతో వెంకటేశ్వరునిగా చాలాబాగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకునే రీతిలో మెప్పించాడు. ఇక రావు రమేష్, జగపతిబాబు ఇతర నటీనటులు తమ పాత్రలలో ఒదిగిపోయినటించారు.
సాంకేతిక వర్గం: దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రేమ కథ చిత్రాలకి, భక్తి రస చిత్రాలు తియ్యడంలో ఎక్స్పర్ట్. అన్నమయ్య చిత్రంలో నాగార్జునని ఒక భక్తుడిగా చూపిస్తూనే ఇద్దరు భార్యలతో రొమాన్స్ చేయించాడు. ఇక రామదాసులో కూడా రాముడు భక్తుడిగా మారకముందు హీరోయిన్ స్నేహతో రొమాన్స్ చేయించి భక్తికి, రక్తి కొత్త అర్ధం చెప్పాడు. మరి ఇప్పుడు కూడా ఓం నమో వెంకటేశాయలో వెంకటేశ్వర స్వామితో హాథిరామ్ బాబా ఎలా ఆటలాడాడు... దేవుడికి భక్తుడికి మధ్యన మధ్యన బలమైన సంభాషణలతో ఈ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించాడు. ఇక కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్. కొంచెం పాటలు అన్నమయ్య పాటలతో లతో పోలిక ఉన్నప్పటికీ ఓం నమో వెంకటేశాయ సంగీతం కూడా ఆధ్యంతం ఆకట్టుకుంది. ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బావుంది.
ప్లస్ పాయింట్స్: నాగార్జున నటన, దర్శకుడు, కథ, సౌరభ్ రాజ్ జైన్ నటన, సంగీతం, పాచికల ఆట
మైనస్ పాయింట్స్: కథనం, అనుష్క సన్నివేశాలు, కామెడీ, ప్రగ్యా జైస్వాల్
రేటింగ్: 3 .0 /5
- Tags
- ఓం నమో వెంకటేశాయ