జై లవ కుశ మూవీ రివ్యూ
ప్రొడక్షన్ కంపెనీ: ఎన్టీఆర్ ఆర్ట్స్
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, నందిత, తమన్నా, ప్రియదర్శి, బ్రహ్మజీ, హంస నందిని, పోసాని
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: చోట. కె. నాయుడు
నిర్మాత: కళ్యాణ్ రామ్
దర్శకత్వం: కె. ఎస్. రవీందర్(బాబీ)
ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ నోటా విన్నా అదే పేరు వినబడుతుంది. ఎన్టీఆర్ వెండితెర మీద, బుల్లితెర మీద కూడా తనదైన ఎనర్జీ పెరఫార్మెన్సు తో ఇరగదీస్తున్నాడు. అసలు ఎన్టీఆర్ ఆ మధ్యన చెప్పినట్టు టెంపర్ ముందు ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ అన్నట్టు.... టెంపర్ ని పూరి దర్శకత్వంలో చేసినప్పటినుండి ఇప్పటివరకు వరుస విజయాలతో హ్యాట్రిక్ కొడుతున్న ఎన్టీఆర్, ఇప్పుడు కె ఎస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో అన్నదమ్ముల అనుబంధం అనే కాన్సెప్ట్ తో జై లవ కుశ చిత్రాన్ని చేసాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి విభిన్న కథలతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు కూడా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తెరకెక్కించిన ఈచిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసాడు. జై, లవ, కుశ అను మూడు వేరియేషన్స్ వున్న పాత్రలలో ఎన్టీఆర్ నటించాడు. ఈ మూడు పాత్రలకు సంబందించిన టీజర్స్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. మూడు పాత్రలను కలిపి జై లవ కుశ ట్రైలర్ లో చూపించిన ఎన్టీఆర్, ఎనర్జీ పెరఫార్మెన్సు చూసినప్పటినుండి జై లవ కుశ పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జై గా నెగెటివ్ రోల్ చేసిన ఎన్టీఆర్ నటనలో అన్ని యాంగిల్స్ ని ఈ సినిమాలో చూడొచ్చు అనే ఆసక్తిని ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగించారు. ఇక లవ, కుశ పాత్రలు చేసిన ఎన్టీఆర్ మాత్రం కామెడీ ట్రాక్ లో ఇరగదీస్తాడనే విషయాన్నీ ట్రైలర్ లో చూపించేసారు. ఎన్టీఆర్ డాన్స్ పెరఫార్మెన్సు కూడా ఒక రేంజ్ లో జై లవ కుశ లో ఉండబోతుందని... పాటల ప్రోమోస్ లోనే అర్ధమయ్యింది. తమన్నాతో కలిసి స్వింగ్ జరా ఐటెం సాంగ్ లో జై వేసిన స్టెప్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేత థామస్ లు మొదటిసారి ఎన్టీఆర్ తో జోడి కట్టారు. రాశి ఖన్నా హాట్ గ్లామర్ షో, నివేత థామస్ నటనతో ఎన్టీఆర్ తో పోటీ ఎంతవరకు పోటీ పడ్డారు... అనేది సినిమాలోనే తెలుస్తుంది. నిర్మాతగా ఎన్నో సినిమాలతో నష్టపోయి... ఇప్పుడు తమ్ముడు తారక్ ని పెట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బడ్జెట్ పరంగా ఎటువంటి ఆలోచనలేకుండా ఈ సినిమాని నిర్మించాడు. వరుస ప్లాప్స్ తో ఉన్న అన్న కళ్యాణ్ రామ్ ని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ఈ సినిమాని ఎన్టీఆర్ బ్యానర్ లో చేసాడు. ఇక దర్శకుడు రవీందర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన సర్దార్ వంటి భారీ ప్లాప్ తర్వాత తెరకెక్కించిన జై లవ కుశ కుశ హిట్ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. సర్దార్ ప్లాప్ కి బాబీ కారణం కాకపోయినా.. అందరూ బాబీ నే బ్లేమ్ చేశారు. మరి అంతటి ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ జై లవ కుశ దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు అంటే బాబీ మీద, అతను తెచ్చిన కథ మీద ఎన్టీఆర్ కి ఎంతో నమ్మకం ఉండి ఉండాలి. బాబీ కూడా ఎన్టీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండడానికి చాలానే కష్టపడ్డాడు. మరి ఈ జై లవ కుశ తో మరోసారి ఎన్టీఆర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడా? ప్లాపుల్లో ఉన్న నిర్మాతగా కల్యాణ్ రామ్ కి జై లవ కుశ ఎలాంటి విజయాన్ని అందించింది? ప్లాప్ డైరెక్టర్ బాబీ ని ఈ జై లవ కుశ సేవ్ చేస్తుందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
జై, లవ, కుశ (ఎన్టీర్) లు చిన్నతనం నుండే తన మేనమామ దిబ్బల్ రావు(పోసాని) తో కలిసి ప్రతి ఊరు తిరుగుతూ నాటకాలు వేసుకుంటూ ఉంటారు. అయితే నాటకాల్లో లవ, కుశలు ఇద్దరికీ మంచి వేషాలు దక్కుతుండేవి..... కానీ జై కి నత్తి ఉండడంతో వేషాలు ఇవ్వకుండా హేళన చేస్తుంటారు. దాంతో జై లో అంత చిన్న వయసులోనే ప్రతీకార జ్వాల మేల్కొని అక్కడ అంతా తగలబెట్టేసి తమ్ముళ్ళకి దూరంగా వెళ్ళిపోతాడు. అయితే అగ్ని ప్రమాదంలో జై, లవ, కుశ లు చనిపోయారనుకుంటారు. కానీ వారు చనిపోరు... బ్రతికే ఉంటారు. ఆ విషయం ఎవరికీ, వారికి తెలియదు. అన్నదమ్ములైన వారు... ఒకరికి ఒకరు చనిపోయారనుకుని వేరువేరుగా బ్రతుకుతూ ఉంటారు. లవ, కుశ లకు దూరమైన జై... భైరంపూర్ అనే ఒక ఊరిలో రావణ్ పేరుతో మాఫియా డాన్ గా ఎదుగుతాడు. అయితే జై, కాక(సాయి కుమార్)సహాయంతో రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. మరోపక్క కుశ కూడా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుదామని డబ్బు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. కానీ డబ్బు దొరికాక మోదీగారి నోట్ల రద్దు తో అమెరికా ప్రయాణం విఫలమవడంతో ఆ కోపంలో కుశుడు ఒక యాక్సిడెంట్ చెయ్యడం... యాక్సిడెంట్ లో లవ ను కలుసుకోవడం జరుగుతుంది. అలా కుశుడు లవ ని కలిసే సమయానికి కుశ కు ఉన్న ప్రాబ్లెమ్ ని లవ ద్వారా తీర్చుకోవాలని చూస్తాడు. అందులో భాగంగానే కుశ, లవ ప్లేస్ లో బ్యాంకు కి మేనేజర్ గా వెళతాడు. అయితే లవ, కుశ లను జై కిడ్నాప్ చేస్తాడు. లవ, కుశలను జై తన రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటాడు. అలాగే జై ప్రేమించిన అమ్మాయి సిమ్రాన్ (నివేత థామస్) ని జై ని ప్రేమించే టట్లు చెయ్యమని... కుశకి ఆర్డర్ చేస్తాడు జై. కానీ భైరంపూర్ ఊరిలో ఉన్న జై నలుగురు శత్రువుల వల్ల లవ, కుశ లు ఇద్దరు చావు అంచుల వరకు వెళతారు. మరి జై వారిని తన స్వార్ధం కోసం వాడుకోవాలనుకున్నాడు గనక వారిని తన శత్రువుల నుండి రక్షిస్తాడా? అసలు జై అంత కర్కశంగా ఎందుకు మారాడు? లవ, కుశ వల్ల జై లాభం పొందాడా? కుశ కు ఉన్న సమస్య ఏమిటి? జై కిడ్నాప్ చేసిన లవ, కుశలు జై కి హెల్ప్ చేశారా? అసలు జై ప్రేమికురాలు సిమ్రాన్, జై ని ఎందుకు ద్వేషిస్తుంది? జై కి ఉన్న ఆశత్రువులు ఎవరు? జై వల్ల ప్రమాదంలో పడ్డ లవ, కుశ ను జై కాపాడగలడా? ఇన్నివిషయాలు తెలియాలంటే జై లవ కుశ ను వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పాత్ర:
జై, లవ, కుశ… మూడు పాత్రలలో కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ మూడు పాత్రల్లోనూ ఇరగదీసాడు. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించే జూనియర్ ఎన్టీఆర్ కు... ఈ మూడు పాత్రల ద్వారా విలక్షణతను చూపించడం పెద్ద కష్టమైన విషయం కాదు అని ఈ జై లవ కుశ సినిమా నిరూపించింది. ఎందుకంటే… ఈ మూడు పాత్రలలో ఉన్న డిఫరెన్స్ ను జై లవకుశ సినిమాలోని ఫస్టాఫ్ లో అద్భుతంగా పండించాడు ఎన్టీఆర్. జై పాత్ర ద్వారా పవర్ ఫుల్ రాక్షసత్వం, లవ ద్వారా అమాయకత్వం, అతిమంచితనం, కుశ ద్వారా తుంటరి తనం... ఇలా మొత్తమ్మీద ఈ మూడింటిలో ఉన్న వేరియేషన్స్ ను సినిమాలోని మొదటి భాగంలో అభిమానులకు కన్నులవిందు అయ్యేలా చూపించడంలో ఎన్టీఆర్ వందకు వంద శాతం విజయవంతం అయ్యాడు. ఈ మూడింటిలో కుశ పాత్ర కాస్త రొటీన్ గా ఉన్నప్పటికీ... లవ పాత్రతో కాస్త విలక్షణతను, జై పాత్రతో పూర్తి కొత్తదనాన్ని చూపించి శభాష్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. ఫస్టాఫ్ లో ఇలా ముగ్గురిలా కనపడి అలరించిన జూనియర్ ఎన్టీఆర్, సెకండాఫ్ కు వచ్చేసరికి ముగ్గురు ఒక్కటే అయిపోవడం పెద్ద ట్విస్ట్. సెకండ్ హాఫ్ అంతా జై, లవ, కుశ ఇలా ముగ్గురు కూడా జై లాగానే నటించడంతో... సెకండాఫ్ లో వేరియేషన్స్ కు పెద్దగా అవకాశం లేకుండా.. అంతా జై మీదనే నడుస్తుంటుంది. ఇక సినిమా మొత్తం ఎన్టీఆర్ షో నడిచింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంకా హీరోయిన్స్ విషయానికొస్తే... రాశి ఖన్నా పాటల కోసం తప్ప జై లవ కుశ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. పాటల్లో రాశి ఖన్నా గ్లామర్ షో బాగానే ఉంది. ఇక ఉన్నంతలో నివేదా థామస్ కాస్త బెటర్. ముగ్గురు హీరోలకే స్క్రీన్ మీద స్పేస్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు హీరోయిన్స్ కి స్క్రీన్ స్పేస్ ఇంకా ఎక్కువ ఉండాలి అని కోరుకోవడం మన తప్పే. ఇక జై రైట్ హ్యాండ్ గా ఉండే కాక పాత్రలో సాయి కుమార్ నటన బావుంది. జై లవ కుశలో నటించిన విలన్స్ ప్రదీప్ రావత్, అభిమన్యు సింగ్ లతో పాటు మరో బాలీవుడ్ నటుడు కూడా జై(రావణ్) ముందు తేలిపోయారు. కామెడీ కూడా ఎన్టీఆర్, కుశ పాత్ర ద్వారానే చేసాడు కాబట్టి.... కమెడియన్స్ కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. బ్రహ్మాజీ , పోసాని, హంస నందిని, నందిత లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు గాని... వారికీ పెద్దగా స్కోప్ లేని పాత్రలే దక్కాయి.
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు రవీందర్ కి ఈ సినిమా విజయం చాలా కీలకం. అందుకే ఈ సినిమా కోసం చాలా శ్రమించాడనే విషయం జై లవ కుశ ప్రతి ఫ్రెమ్ లో అర్ధమవుతుంది. జై లవ కుశ ని కథగా చూస్తే స్టోరీ లైన్ మరీ అంత గొప్పగా ఏం ఉండదు. కాని దర్శకుడు జై పాత్రను రాసుకున్న తీరు, ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. మూడు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపించడానికి బాబీ చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. కాకపోతే బాబీ కి ఎన్టీఆర్ వంటి ఎనర్జీ ఉన్న హీరో దొరకడమే పెద్ద ప్లస్ పాయింట్. అయితే బాబీ జై పాత్రను బలం గా తీర్చి దిద్ది లవ, కుశ పాత్రలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయాడు. అయితే ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండాల్సిన ముగ్గురి కాంబినేషన్ సీన్స్ కొన్నిచోట్ల చప్పగా అనిపించాయి. కాకపోతే ముగ్గురు జై పాత్రలోకి పరకాయప్రవేశం చేయటం ఒక్కటే కొంచెం వెరైటీగా అనిపించే పాయింట్. అయితే బాబీ జై తో హిట్ కొట్టినా లవ, కుశ లతో మాత్రం పెద్దగా ఏం సాధించలేకపోయాడనే చెప్పాలి. అలాగే హీరోయిన్స్ ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేక చేతులెత్తేశాడు. ఇక జై లవ కుశ సంగీతం విషయానికి వస్తే పాటలు మార్కెట్ లోకి విడుదలైనప్పటి నుండి దేవిశ్రీ మ్యూజిక్ విషయంలో అందరు పెదవి విరిచినట్టే... ఈ సినిమాలో దేవిశ్రీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్క జై... జై రావాణా పాట తప్ప అన్ని రొటీన్ గానే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ ని చోటా కె నాయుడు అదిరిపోయే లెవల్లో చూపించాడు. చోటా కె నాయుడు సీనియారిటీ ప్రతి ఫ్రేంలో చూడొచ్చు. ముగ్గురు ఉండే సీన్లు ఎక్కువగా ఉన్నా అవి చాలా ఎఫెక్టివ్ గా కనిపించడం ఆయన వల్లే అని చెప్పొచ్చు.కొన్ని సీన్స్ ని ఎంతో అందంగా రిచ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కోటగిరి ఎడిటింగ్ లో చాల లోపాలున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ఇక కళ్యాణ్ రామ్ సినిమా నిర్మాణం విషయం లో ఎక్కడ తగ్గలేదని... ప్రతి సీన్ చూస్తుంటే అర్ధమవుతుంది.కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు. తమ్ముడితో తొలిసారి సినిమా చేసినందుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ ఖర్చు చేశాడు.
విశ్లేషణ:
ప్రస్తుత ట్రెండ్‌కి తగినట్లుగానే ఈ సినిమా కథ కొత్తగా అనిపిస్తుంది.. ముగ్గురు సోదరుల మధ్య నడిచే ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్ ట్విస్టులతో ఫుల్ మీల్స్ తినిపించాడు డైరెక్టర్ బాబీ. ఫస్టాఫ్‌లో లవ, కుశలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేసినా బాబీ.. ఆ తర్వాత సెకండాఫ్‌ని జై క్యారెక్టర్‌తో రక్తికట్టించాడు. మొదటి భాగాన్ని సరదాగా నడిపించి.. రెండో భాగాన్ని థ్రిల్లింగ్‌గా, ఎమోషనల్ గా రూపొందించాడు. మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులే ఈ చిత్రంలో మేజర్ హైలైట్. ఆడియెన్స్ కోరుకునే కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. సాధారణంగా దర్శకులు ఏదో చేసేద్దామని భావించి, ఏవేవో ప్రయత్నాలు చేసి, చివరికి సినిమా ట్రాక్నే పక్కదారి పట్టిస్తారు. కానీ.. బాబీ అలాంటి పనులు చేయలేదు. స్టోరీ రాసుకున్నాడో, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి, ప్రేక్షకుల హృదయాల్ని గెల్చుకున్నాడు. అయితే బాబీ కి సర్దార్ గబ్బర్ సింగ్ తో వచ్చిన బ్యాడ్ నేమ్ ని మాత్రం జై లవ కుశ తుడిచి పెట్టేసిందనే చెప్పాలి. ఇక సినిమా పరంగా చూస్తే.. ఫస్టాఫ్ నుంచి చివరివరకు సినిమా ఆసక్తి రేపుతూ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అసలు స్టార్ట్ అయిన మొదట్లోనే కథలో లీనమైపోతాం. ఇదే ఇందులో హైలైట్. ఇందుకుగాను బాబీకి వందమార్కులు ఇచ్చేయొచ్చు. ఇక కథలోకి ఎంటరయ్యాక ఎక్కడా ట్రాక్ తప్పకుండా, కావాల్సిన ఎలిమెంట్స్‌తో సీన్లను సమకూర్చాడు. సినిమా నడిచేకొద్దీ ఇంట్రెస్ట్ పెంచుతూ ముందుకు తీసుకెళ్లాడు. ప్రీ-ఇంటర్వెల్ వరకు ఎంటర్టైన్ చేసి, ఇంటర్వెల్ వద్ద బ్రహ్మాండమైన బ్యాంగ్‌తో మైండ్ బ్లాక్ చేశాడు. అదే ఊపుతో సెకండాఫ్‌ని మరింత ఆసక్తిగా నడిపించాడు. ఒకదానితర్వాత ఒక ట్విస్టును రివీల్ చేసుకుంటూపోతూ బాగానే థ్రిల్ చేశాడు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. ఆ ట్రాక్‌లో తారక్ నటన అందరినీ కట్టిపడేస్తుంది. ఈ ఎపిసోడ్లో సాయికుమార్ పాత్ర కూడా పెద్ద ట్విస్ట్. అసలు సినిమాలోనే క్లైమాక్స్ ది బెస్ట్ ఎపిసోడ్. దీన్ని బాబీ సూపర్బ్‌గా మలిచాడు. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. ఇది సూపర్‌హిట్ సినిమా.
ఇక ఎన్టీఆర్ మళ్ళీ జై లవ కుశతో విజయం సాధించాడని చెప్పాలి. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ జై లవ కుశ తో కూడా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంకెప్పటికీ చెయ్యలేని జై పాత్రని చేసి అందరి మదిలో చెరగని ముద్ర వేసాడని చెప్పాలి. ఈ సినిమాతో ఎన్టీఆర్ నట విశ్వరూపం అంటే ఏమిటో చూపించేసాడు. ఇక నిర్మాత కళ్యాణ్ రామ్ తన కష్టాల కడలి నుండి జై లవ కుశతో గట్టెక్కినట్టే కనబడుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో మంచి విజయాన్ని నమోదు చేసాడు. ఇక ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం జై లవ కుశ ఫుల్ మీల్స్. ఇక సాధారణ ప్రేక్షకుడు మాత్రం ఒకసారి ఎన్టీఆర్ జై లవ కుశాని చూడడానికి ఇష్టపడతారు అనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్: ఎన్టీఆర్ నట విశ్వరూపం, సినిమాటోగ్రఫీ, జై పాత్ర, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, హీరోయిన్స్ కి ఎక్కువగా స్కోప్ లేకపోవడం, ఎమోషన్స్ ని బలంగా చూపించలేకపోవడం, లెంగ్ది సీన్స్
రేటింగ్: 3.5/5