జై సింహ మూవీ రివ్యూ - 3
ప్రొడక్షన్ హౌస్: C. K.ఎంటర్టైన్మెంట్
నటీనటులు: బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి, ప్రకాష్ రాజ్,బ్రహ్మనందం, అశుతోష్ రానా, మురళి మోహన్
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
కథ: ఎం రత్నం
సంగీతం: చిరంతాన్ భట్
నిర్మాత: సి. కళ్యాణ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కే.ఎస్ రవికుమార్
ఎనర్జీ అంటే బాలయ్య.. బాలయ్య అంటే ఎనర్జీ అన్న లెవల్లో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న బాలయ్య పైసా వసూల్ ప్లాప్ తర్వాత కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో 102 వ సినిమాగా జై సింహ సినిమా లో నటించాడు. ఈ సినిమా మొదలైనప్పటినుండి అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సి కళ్యాణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని తెరకెక్కించడం, నయనతార వంటి హిట్ హీరోయిన్ బాలయ్య సరసన నటించడం... అలాగే బాలకృష్ణ కి కలిసొచ్చే సంక్రాతి పండగ కి ఈ సినిమాని విడుదల చెయ్యాలని భావించడం వంటి వాటితో ఈ సినిమా పై అందరిలో ఆసక్తి పెరిగింది. అలాగే డైలాగ్ చెప్పడంలో బాలకృష్ణ కు సాటిరారెవ్వరు అన్నట్టు బాలయ్య డైలాగ్ డెలివరీ, డాన్స్ విషయంలోనూ కుమ్మేస్తాడు. కాకపోతే అస్సలు ఫామ్ లో లేని కే ఎస్ రవికుమార్ కి బాలకృష్ణ ఛాన్స్ ఇవ్వడం కాస్త బాలయ్య ఫ్యాన్స్ ని కంగారు పెట్టించే విషయమే అయినప్పటికీ... బాలకృష్ణ మీద ఉన్న నమ్మకంతో బాలయ్య అభిమానులు కూడా ఈసినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. అయినా కూడా బాలకృష్ణ అవుట్ డేటెడ్ దర్శకుడి మీద అంత నమ్మకం పెట్టడం, జై సింహ వంటి పవర్ ఫుల్ టైటిల్, అలాగే బాలకృష్ణ జై సింహ గా డ్యూయెల్ రోల్ చెయ్యడం, ఇప్పటికే రెండు సినిమాలు శ్రీ రామరాజ్యం, సింహ వంటి సినిమాలతో హిట్ పెయిర్ గా పేరొందిన నయనతారతో బాలకృష్ణ మూడో సారి జోడి కట్టడం, బ్రహ్మనందం చాలా రోజులు తర్వాత జై సింహ లో ఫుల్ లెన్త్ కామెడీ చెయ్యడం వెరసి ఈ సినిమా మీద హైప్ పెరగడానికి కారణమయ్యాయి. మరి బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, డాన్స్ లు, సంక్రాతి సెంటిమెంట్.. అందులోను ఈ సంక్రాతి బరిలో జై సింహకి పోటీ అనుకుంటున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి ప్లాప్ టాక్ రావడం ఈ జై సింహ సినిమాకి ఎంత వరకు కలిసొచ్చిందో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ: నరసింహ ( బాలకృష్ణ) ఒక చిన్నపిల్లాడిని ఎత్తుకుని కొంట్టమంది శత్రువులను ఎదుర్కుంటూ వైజాగ్ నుండి తమిళనాడు లోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఒకరిదగ్గర అంటే ఆ ఊరి ఆలయ ధర్మకర్త (మురళీమోహన్) దగ్గర కారు డ్రైవర్ గా చేరతాడు. కానీ ఆ ధర్మకర్త కూతురు ధాన్య(నటాషా దోషి) కారణంగా అనేక సమస్యల్లో పడతాడు నరసింహ. ధాన్య కారణంగా మొదలైన సమస్యలు వలన ఆ పరిధిలోని ఏసిపికి కూడా శత్రువుగా మారతాడు. ఈ సమస్యలనుండి గట్టెక్కేందుకు నరసింహ కుంభకోణం నుండి వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో.. నరసింహ తీసుకొచ్చిన ఆ చిన్న పిల్లాడి కోసం గౌరీ(నయనతార) అక్కడికి కుంభకోణం వస్తుంది. అసలు గౌరికి నరసింహకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ పిల్లాడి కోసం గౌరీ కుంభకోణం ఎందుకు వస్తుంది? నరసింహ చిన్న పిల్లాడితో వైజాగ్ నుండి కుంభకోణం ఎందుకు వెళతాడు? ధాన్య వలన నరసింహ ఎదుర్కున్న సమస్యలేమిటి? చివరికి అన్ని సమస్యల నుండి నరసింహ గట్టెక్కుతా? అనేది జై సింహ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన:
బాలకృష్ణ బయట ఎలా వున్నా సినిమాల్లో తన నటనతో అందరిని మెప్పిస్తాడు. బాలయ్య నట విశ్వరూపం అన్ని సినిమా ల్లోను చూసినట్టే ఈ జై సింహాలోను కనిపిస్తాడు. పవర్ ఫుల్ డైలాగ్ ని అలవోకగా చెప్పెయ్యడంలో బాలయ్య తనకి తానే సాటి అనిమరోసారి జై సింహ ద్వారా నిరూపించాడు. రెండు వేరియేషన్స్ బాలయ్య ఇరగదీసాడు. అంతేకాకూండా పాటల్లో బాలకృష్ణ స్టెప్స్ అదిరినాయి. ముఖ్యంగా అమ్ముకుట్టి సాంగ్ లో బాలయ్య డాన్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. అంతేకాకూండా యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా బాలయ్య కుర్ర హీరోలకు ధీటుగా అధర గొట్టేసాడు. కానీ లుక్స్ లో కొన్నిచోట్ల బాలకృష్ణ కి వయసు మీద పడినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో క్లోజ్ అప్ షాట్స్ లో బాలయ్య వయసు మరింతగా తెలిసిపోతుంది. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే మాత్రం ఈ సినిమాలో ఒక్క నయనతార పాత్రకి తప్ప చెప్పుకోదగిన మరో హీరోయిన్ పాత్రలేదు. అసలు నయనతార పాత్ర కూడా ఓ అన్నంత లేదు. కానీ బాలకృష్ణ ముందు నయనతార, హరిప్రియ, నటాషా దోషిలో హోల్సేల్ గా తేలిపోయారు. హరిప్రియ అసలెందుకు ఈ సినిమాలో ఉందొ అర్ధం కాదు. ఆ పాత్రని ఆమె మాత్రం తనో స్టార్ హీరో సినిమాలో నటించాను అని చెప్పుకోవడానికి తప్పితే మరే ప్రాధాన్యం లేదు. కాస్త నటాషా మాత్రం అందంతో గ్లామర్ తో ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక చాలా రోజుల తర్వాత కామెడీ చేసిన బ్రహ్మానందం కామెడీ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసినా ఎక్కడా బ్రహ్మి కామెడీ ఆకట్టుకుననట్టుగా లేదు. మరోమారు బ్రహ్మి కామెడీ విఫలమయ్యింది. ప్రకాష్ రాజ్, మురళి మోహన్ మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
జై సింహ కి బాణీలు అందించిన చిరంతన్ భట్ ఒకే ఒక్క పాట వరకు ఓకె... మిగతా పాటలు మాత్రం సో.. సో గానే ఉన్నాయి. కానీ చిరంతన్ భట్ మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ ని పీక్స్ కి తీసుకెళ్లాడు. యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు, బాలయ్య చెప్పే భారీ డైలాగ్స్ అప్పుడు చిరంతన్ భట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అదరగొట్టేసాడు. ఎమోషన్స్ సీన్స్ ని ఎలివేట్ చెయ్యడంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఉపయోగపడింది. ఇక ఈ సినిమాకి మరో ప్రధానమైన ఎస్సెట్ సినిమాటోగ్రఫీ. రామ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. పాటల పిక్చరైజేషన్ దగ్గరనుండి యాక్షన్ సీక్వెన్స్ ని అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కి పెద్ద మైనస్ అని చెప్పాలి. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. ఇక సి కళ్యాణ్ నిర్మాణ విలువలు బావున్నాయి. ఎక్కడా వంక పెట్టడానికి లేదు అన్నట్టుగా వున్నాయి.
విశ్లేషణ:
కే ఎస్ రవికుమార్ పూర్తిగా అవుట్ డేటెడ్ కథని ఎంచుకుని పవర్ ఫుల్ డైలాగ్స్ తో జై సింహాని నడిపించెయ్యాలనుకున్నాడు. కానీ కథ పాతది అయినప్పుడు డైలాగ్స్ లో పవర్ ఉంటె మాత్రం ఏం ఒరుగుతుంది. కానీ దర్శకుడు బాలయ్య నట విశ్వరూపాన్ని పూర్తి స్థాయిలో సినిమా మొత్తంగా తీర్చిదిద్దాడు. పక్కా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. అన్నట్టుగానే మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా ఎక్కుతుంది కూడా. ఊరమాస్ డైలాగ్స్ తో బాలయ్య రెచ్చిపోయాడు. ఏం రత్నం అందించిన కథ తో దర్శకుడు రవికుమార్ జై సింహ కథని పవర్ ఫుల్ డైలాగ్స్ తో తెరకెక్కించాడు. ధర్మం నాలుగు పాదాల మీద కాదు, నీ లాంటి వాళ్ళ త్యాగాల మీద నడుస్తుంది అనే డైలాగ్స్ బాగా పేలాయి. సినిమా మొత్తం 1990 జోనర్ లో వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. బాలకృష్ణ ని యాక్షన్ లుక్ తో కాకుండా క్లాస్ లుక్ తో వెరైటీగా పరిచయం చేసాడు. అంటే కలర్స్ గా బాలయ్య ఎంట్రీని ఇప్పించాడు. ఇక ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ బ్రాహ్మణుల గొప్పదనం గురించి చెప్పే సీన్స్ లో బాలయ్య బాబు చెప్పేడైలాగ్ తో అందరి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక భారీ యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ కి కార్డు పడుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో నిండిపోయింది. అసలు ఈ సినిమాలో హీరోయిన్స్ ని అస్సలు ప్రాధాన్యం లేని పాత్రల్లో చూపించి బోర్ కొట్టించేసాడు దర్శకుడు. హీరోయిన్స్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకుడు పిచ్చ బోరింగ్ ఫీల్ అవుతాడు. అలాగే ఒక్క సీన్ లోని సరైన కామెడీ లేదు. అసలు బ్రహ్మనందం కామెడీనే ఈసినిమాకి పెద్ద మైనస్ అనేలా ఉంది. అలాగే సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు నీరసం తెప్పించేవిగా వున్నాయి. జై సింహాని ఓవరాల్ గా చూస్తే బాలయ్య ఫాన్స్ ని మెప్పించే మాస్ సినిమాగానే మిగిలిపోతుంది తప్ప అందరిని శాటిస్ ఫై చేసే సినిమాగా మాత్రం ఉండదు. అలాగే బాలకృష్ణ ఎప్పుడూ సంక్రాతి హీరోగా చక్రం తిప్పేవాడు. కానీ ఈ సంక్రాంతికి మాత్రం తన ఖాతాలో ఒక ప్లాప్ వేసుకున్నాడని చెప్పాలి.
పాజిటివ్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, బాలకృష్ణ డాన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, బ్రాహ్మణ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ధర్నా సీన్, పవర్ ఫుల్ డైలాగ్స్
నెగెటివ్ పాయింట్స్: బ్రహ్మనందం కామెడీ, బాలకృష్ణ లుక్, నయనతార, హరిప్రియ, నటాషా ఓవరాల్ హీరోయిన్స్, ఫస్ట్ హాఫ్, క్లాస్ ఆడియన్స్ ని మెప్పించలేకపోవడం, స్లో నేరేషన్