తొలిప్రేమ మూవీ రివ్యూ
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నటీనటులు: వరుణ్ తేజ్, రాశీ ఖన్నా, సుహాసిని, ప్రియదర్శి, హైపర్ ఆది తదితరులు
సంగీతం: ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్: జార్జ్ సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
మెగావారుసుడు వరుణ్ తేజ్ సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ తన టాలెంట్ మీద పైకి రావడానికి బాగా కష్టపడుతున్నాడు. కెరీర్ లో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. ముకుందా లో రఫ్ గా ఉండే స్టూడెంట్ అయినా.... కంచె లో దేశభక్తి కలిగిన ప్రేమికుడిగా అయినా... లోఫర్ లో బాధ్యత లేని కొడుకుగా, మిష్టర్ లో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో మెప్పించిన వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో హీరోయిన్ కే ఎక్కువ స్కోప్ ఉన్నా కూడా.... తనలోని భావాలను అవసరం ఉన్నప్పుడు బయటికి తీస్తూ... ఎమోషన్ ని క్యారీ చేస్తూ... ప్రేమను సాధించుకుకుంటూ... సాయి పల్లవి పక్కన ధీటుగా నటించి మెప్పించిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో సరికొత్త ప్రేమ కథతో మెప్పించడానికి సిద్దమయ్యాడు. మాస్ యాంగిల్ ని టచ్ చెయ్యకుండా క్లాస్ కుర్రాడిలాగా రాశి ఖన్నాతో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన బాబాయ్ కెరీర్ నే మలుపు తిప్పిన తొలిప్రేమ టైటిల్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యాడు వరుణ్ తేజ్. తొలిప్రేమ ట్రైలర్, ప్రోమోస్ లో ఈ సినిమా అంతా ప్రేమ మీదే నడుస్తుంది అనే భావంతో సాగడం... ఆ ప్రేమ కథ కూడా కొత్తగా అనిపించడం వంటి విషయాలతో తొలిప్రేమ మీద మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. తొలిప్రేమ టైటిల్ ని ప్రకటించినప్పటినుండే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఫిదా అనే ప్రేమ కథతో సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ సక్సెస్ ని తొలిప్రేమతో కంటిన్యూ చేస్తాడా? లేదా? అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
ఆదిత్య(వరుణ్ తేజ్) మొదటినుండి తనేం చేసినా ఆలోచించి కరెక్ట్ గా చేస్తానని గట్టిగా నమ్ముతాడు. అయితే ఇంటర్ చదివే రోజుల్లో రైలు ప్రయాణం లో వర్ష(రాశిఖన్నా)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తరువాత ఆదిత్యకి, వర్షకి ఇంజినీరింగ్ లో ఒకే కాలేజ్ అడ్మిషన్ వస్తుంది. హైదరాబాద్‌లో ఆదిత్య, వర్షాలు కలిసి ఒకే కాలేజ్‌లో చదువుతుంటారు. మొదటినుండి వర్ష ప్రేమలో ఉన్న ఆదిత్యని కొద్దిరోజులకు వర్ష కూడా ఇష్టపడుతుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆదిత్య, వర్ష ఇద్దరు విడిపోతారు. ఆదిత్య తన పనుల్లోనూ, వర్ష తన పనుల్లోనూ బిజీగా గడిపేస్తూ ఉండగా... అలా అలా ఆరేళ్లు పూర్తవుతాయి. అయితే ఆదిత్యకి లండన్‌లో ఉద్యోగం రావడం అక్కడ సెటిల్ అవడం జరుగుతుంది. అదే కంపనీ లో అనుకోకుండా వర్ష కూడా ఉద్యోగం వస్తుంది. వర్ష మీద కోపంగా ఉన్నప్పటికీ కొద్దిరోజులకు మళ్ళీ ఆదిత్య ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అసలు ఆదిత్య వర్షల కి మధ్య వచ్చిన గొడవ ఏమిటి? ఆరేళ్ళ తర్వాత మళ్ళీ ప్రేమలో పడిన ఆదిత్య ని వర్ష కూడా ప్రేమిస్తుందా? చివరకు వర్ష ప్రేమను ఆదిత్య గెల్చుకున్నాడా? లేదా? అన్న విషయాన్ని తొలిప్రేమ వెండితెర మీద చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.
నటీనటుల నటన:
వరుణ్ తేజ్ ఫిదా లో ఎంతో మెచ్యూరిటీ ఉన్న యువకుడిగా ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ పరిణితి గల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తొలిప్రేమ సినిమాలో కూడా వరుణ్ తేజ్ ప్రేమికుడిగా ఆదిత్య పాత్రలో చక్కటి నటనను ప్రదర్శించాడు. ఆది పాత్రలో తన ఆటిట్యూడ్‌తో హీరోయిజాన్ని పండించాడు. ప్రతి ఎమోషన్‌ను చక్కగా చూపిస్తూ తన ఐడెంటిటీ నిలుపుకున్నాడు. మూడు పాటల్లో కొన్ని డాన్స్ మూమెంట్స్ కొత్తగా ట్రై చేశాడు. హీరోయిన్ రాశి ఖన్నా కి కెరీర్ లో ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత అంతకన్నా ప్రాధాన్యత పాత్ర దొరకడమే కాదు...నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర దొరికింది. రాశి ఖన్నా ఎప్పుడు బబ్లీగా కనబడుతూ ఉండేది కానీ.... తొలిప్రేమ సినిమాలో సన్నటి నడుం తో కొత్త లుక్ తో మెప్పించింది. రాశి ఖన్నా కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రలో వర్షగా చాలా బాగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రభావముగా విడిపోయినప్పుడు మంచి ఎక్సప్రెషన్ తో ఆకట్టుకుంది. అసలు వరుణ్ తేజ్, రాశి ఖన్నా ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది. కమెడియన్ ప్రియదర్శి వరుణ్ ఫ్రెండ్ గా ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది వేసిన కొన్ని పంచ్ లు బాగానే పేలాయి. నరేష్ మరియు సుహాసిని, విద్యుల్లేఖ మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు:
తొలిప్రేమకు మ్యూజిక్ అందించిన థమన్ ఈసారి కాస్త సక్సెస్ అయ్యాడు. ఈ వారంలో విడుదలైన మూడు సినిమాల్లో రెండు సినిమాల మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అయిన థమన్ తొలిప్రేమ కి అందించిన మ్యూజిక్ మాత్రం కొంచెం బెటర్ గానే ఉంది. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఎప్పటిలాగే ఇరగదీసాడు. హీరో హీరోయిన్ విడిపోతున్నప్పుడు.. అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఒక లెవల్లో కూర్చో బెట్టింది. ఇక జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది. ప్రతి సీన్ ని వీలైనంత రిచ్ గా చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. పాటలను, అలాగే రొమాంటిక్ సన్నివేశాలను ఇలా అన్నిట్లో సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంది. ఇక ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయి. లండన్ ఎపిసోడ్ ఎక్కువగా మూవ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. వరుణ్ విడిపోవడానికి పదే పదే చెప్పే కారణం కన్విన్సింగ్ గా అనిపించదు. అందులో లాగింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. అది వదిలేస్తే మిగిలినదంతా ఒకే. అలాగే నిర్మాణ విలువకు వంక పెట్టడానికి లేదు. ఆద్యంతం నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
విశ్లేషణ:
దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాతోనే దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఒక ఫీల్ గుడ్ ప్రేమ కథను అద్భుతంగా మలిచి సక్సెస్ అయ్యాడు. మూడు దశాలుగా సాగే ఈ కథ ప్రేక్షకులను కదిలిస్తుంది. దర్శకుడు సింపుల్ ప్లాట్ తీసుకున్నా కానీ పాత్రలు బలంగా ఉంటే ఆ స్టోరీతో ఎంతగా మెప్పించవచ్చనేది చూపించాడు. ప్రేమ, ఎడబాటు, బాధ ఇలా మూడింటిని చక్కగా సాగే స్వచ్ఛమైన ప్రేమకథే ఈ తొలిప్రేమ. ప్రేమించడం, ఆ తరువాత విడిపోవడం, ఆ విరహ వేదనను ప్రేమికులు అనుభవించడం లాంటి కథ పాతదే అయినా.. దర్శకుడు ఆ కథను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. ఈ కథను చెప్పడంలో ఒక పరిణతి కనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో మంచి టెంపో మైంటైన్ చేసిన వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా తగ్గడం ప్రభావం చూపించింది. హత్తుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ బలమైన ఎమోషన్ ని రిజిస్టర్ చేయటంలో కొంత తడబడటంతో గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఇందులోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతాయి. సినిమా మొత్తం హీరో వరుణ్, హీరోయిన్ రాశి ఖన్నా ల మధ్యనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్, రాశి ఖన్నా ల ప్రేమే హైలెట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ పెద్దగా అనిపించకపోయినా... సెకండ్ హాఫ్ లో కథ మీద పట్టు కోల్పోకుండా దర్శకుడు సినిమాని మలచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. అసలు ఈ సినిమాకి వరుణ్ తేజ్, రాశి ఖన్నా కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా పండింది. దర్శకుడు కామెడీ విషయంలో కాస్త ఆలోచించినా తక్కువ మాత్రం చెయ్యలేదు. కామెడీని ఎంటర్టైన్మెంట్ కథలో భాగంగా ఇవ్వడానికి ప్రయత్నించాడు తప్ప అదే పనిగా చూపించకపోవడం ప్లస్ అయ్యింది. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడి తడబాటు కనబడుతుంది. రొటీన్ క్లైమాక్స్ నే ఎంచుకుని దెబ్బతిన్నాడు. అయితే ఒక చక్కటి ప్రేమ కథని ప్రేక్షకులకు అందించడమే కాక వెంకీ అట్లూరి వరుణ్ తేజ్ కి కూడా ఒక మంచి విజయాన్ని అందించాడు.
ప్లస్ పాయింట్స్: వరుణ్ తేజ్, రాశి ఖన్నా, వరుణ్ - రాశి కెమిస్ట్రీ, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్, ప్రీ -క్లైమాక్స్
నెగెటివ్ పాయింట్స్: ఫ్లాట్ మూమెంట్స్, స్లో నేరేషన్, క్లైమాక్స్
రేటింగ్: 3.0/5