నందిని నర్సింగ్ హోం రివ్యూ : హాస్యమే కీలకం
నటీనటులు : నవీన్ విజయ్ క్రిష్ణ, నిత్య, శ్రావ్య, జయప్రకాష్ రెడ్డి, సంజయ్ స్వరూప్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి తదితరులు.
ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర
సంగీతం : అచ్చు
నిర్మాతలు : రాధా కిషోర్, భిక్షమయ్య
కథ, కథనం, దర్శకత్వం : పి.వి.గిరి
చిత్ర పరిశ్రమకు సంబంధించిన కుటుంబాలలో నుంచి వచ్చే యువ హీరోల పరిచయ చిత్రాలకు ప్రచార ఆర్భాటాలు అధికంగా వుంటుంటాయి. వాటికి తగ్గ అంచనాలు చిత్ర విడుదలకు ముందు ఏర్పడతాయి. కానీ అనేక హాస్య చిత్రాలలో కథానాయకుడిగా నటించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా వున్న నరేష్ తనయుడు నవీన్ విజయ్ క్రిష్ణ నటించిన తొలి చిత్రం నందిని నర్సింగ్ హోమ్ ఎటువంటి అంచనాలు లేకుండా నేడు విడుదల అయ్యింది. అంచనాలు లేని ఈ విడుదల ఊహకు అందని ఫలితం ఇవ్వనుందో లేదో సమీక్షలో చూద్దాం.
కథ : చంద్ర శేఖర్ అలియాస్ చందు (నవీన్ విజయ్ క్రిష్ణ) ఎం.కాం పాస్ ఐయ్యి, చదువుకి తగ్గ ఉద్యోగం దొరకక కాలీగా వుంటూ కాలం గడుపుతుంటాడు. తన స్నేహితుడి సహాయంతో నందిని నర్సింగ్ హోమ్ అనే ఒక ఆసుపత్రిలో తాను ఎం.బి.బి.ఎస్ పాస్ అయ్యానని, వృత్తి రీత్యా వైద్యుడిని అని అబద్దం చెప్పి నమ్మించి నందిని నర్సింగ్ హోమ్ లో వైద్యుడిగా చేరతాడు. ఆ నర్సింగ్ హోమ్ అధినేత ఐన నందిని (నిత్య) చంద్ర శేఖర్ పై పరిచయాన్ని ఇష్టంగా మార్చుకుని ఆ ఇష్టాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ ఉంటుంది. చందు గతంలో తనకి అమూల్య(శ్రావ్య)తో ప్రేమ వైఫల్య జ్ఞాపకాల నుంచి పూర్తిగా బైటకి రాలేక నందినితో అంత చనువు పెంచుకోడు. ఇంతలో నందిని నర్సింగ్ హోమ్ లో చంద్ర శేఖర్ వలన ఒక నిండు ప్రాణం పోతుంది. అక్కడితో నందిని చందు ల మధ్య కథ మలుపు తిరుగుతుంది. చందు గతంలో అమూల్య ప్రేమాయణం ఏమిటో? నందిని నర్సింగ్ హోంలో పోయిన ప్రాణం ఎవరిదో? ఆ కీలక సన్నివేశాల కథనాన్ని దర్శకుడు తిప్పిన మలుపులను తెరపైనే చూడాలి.
విశ్లేషణ : ముందుగా కథ, కథనాల గురించి మాట్లాడుకుంటే, పరిచయ హీరో కోసం బిల్డప్ షాట్స్, మాస్ పాటలు, యాక్షన్ సన్నివేశాలు, చేస్ సీక్వెన్సెస్ వంటి అదనపు హంగులను బలవంతంగా కథలో చొప్పించకుండా, చాలా సాధారణమైన కథను ఎంచుకున్నందుకు కథానాయకుడి తీరుతెన్నెలు కూడా కథకు అతికేటట్టే ప్రదర్శించారు. అబద్దం చెప్పి ఆ అబద్దం చుట్టూ హాస్యాన్ని జోడిస్తూ ఫస్ట్ హాఫ్ నడిపించటం చాలా సినిమాల్లో చూసేసాం. కానీ అదే కోణంలో కథను మళ్లీ తేరకేక్కించినా ప్రతి సన్నివేశాన్ని హాస్యంతో మేళవించి కథనాన్ని నడిపి జాగ్రత్త పడ్డారు దర్శకుడు పి.వి.గిరి. ప్రథమార్ధం ముగిసే సరికి కథలో తీవ్రమైన మలుపు తిప్పగా ఆ మలుపు తాలూకా పరిణామాలు ఏవి ద్వితీయార్ధంలో కనపడకపోవడంతో ఆ మలుపు అంతరార్ధం ఏమిటో ప్రేక్షకుడికి అర్ధం కాదు. ద్వితీయార్ధంలో వచ్చే హాస్య సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉన్నప్పట్టికీ, కథను పక్క దోవ పట్టించే రీతిలో మితిమీరిన హాస్యాన్ని జోడించి పి.వి.గిరి కథలోని ఆయువు పట్టుని తీసేసి పేలవమైన కథకుడిగా మిగిలిపోయాడు.
అచ్చు అందించిన సంగీతం స్వరాల పరంగా, నేపధ్య సంగీత పరంగా బానే వుంది కానీ కొన్ని సందర్భాలలో సన్నివేశాలని అధిగమించేలా నేపధ్య సంగీతం ఉండటంతో వినసొంపుగా లేక కొంత ఇబ్బందిపెట్టింది. ఛాయాగ్రాహకుడు దాశరధి శివేంద్ర కొత్త తరహా షాట్స్ ఏమి ప్రెసెంట్ చెయ్యకపోయినా కెమెరా వర్క్ పర్వాలేదు అనిపించాడు. ఎడిటర్ తన పని తాను సక్రమంగానే చేసాడు అని చెప్పాలి. అలానే విసిగించాడని కూడా చెప్పాలి. కారణం ప్రతి సన్నివేశం ఫ్రేమింగ్ లో ఎడిటింగ్ ఎఫెక్ట్స్ బాగా మేనేజ్ చెయ్యగా, కథలో నసను మాత్రం కత్తిరించలేక పోయాడు. ఒక వేల అతను ఆ పని చేసి ఉంటే కథకు సంబంధం లేని హాస్య సన్నివేశాలు అన్ని తొలగిపోయి చిత్ర నిడివి కేవలం 60 నిమిషాలలోపుకి కుదించాలి అని భయపడి ఉంటాడు. గొప్ప నిర్మాణ విలువలు ప్రదర్శించే అవసరం లేని కథకి నిర్మాతలు కథానుసారమే ఖర్చుపెట్టి తీశారు.
పరిచయ నటుడు నవీన్ విజయ్ క్రిష్ణ తన నటనతో అలరించాడు. కొన్ని సందర్భాలలో తనది మొదటి చిత్రం అంటే నమ్మలేని విధంగానూ చేసాడు. ఇప్పటి తరం కథానాయకులలానే హాస్యం కూడా పండించగల నటుడు అని సంకేతాలు తొలి చిత్రంతోనే పంపాడు నవీన్ విజయ్ క్రిష్ణ. తన సరసన నటించిన ఇరువురు భామలు నిత్య, శ్రావ్య లు మాత్రం ప్రేక్షకులను అలరించటంలో నిరాశ పరిచారు. శ్రావ్య పోషించిన పాత్ర నిడివి తక్కువగా వుంది, ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమ కథ కూడా మూస ధోరణిలోనే ఉండటం వలన కథానాయికల నటన అమితంగా ప్రదర్షింపబడలేదు. చిత్రం మొత్తంలో అందరికన్నా ఎక్కువగా ప్రేక్షకులను నవ్వించిన నటుడు వెన్నెల కిషోర్. తాను కనిపించే ప్రతి ఫ్రేములో నవ్వించటానికి ప్రయత్నం చేసి మరొకసారి హాస్య నటుడిగా నిరూపించుకున్నాడు వెన్నెల కిషోర్. సప్తగిరి కొంత మేర అలరించినా, తన గత చిత్రాలలోని నటనా శైలినే ప్రదర్శించి పాత తరహాలోనే కనిపించాడు తప్ప కొత్త తనం చూపించలేకపోయాడు.
కథ, కథనంలో బలహీనతలు అనేకం వున్నా, హాస్యంతో నడిచే కథ కావటంతో నందిని నర్సింగ్ హోమ్ కి ప్రేక్షకాదరణ దొరికే అవకాశం లేకపోలేదు.
రేటింగ్ : 2.5/5