ప్రేమమ్ సినిమా రివ్యూ : కాస్త అనుభూతి కాస్త నిరాశ
రీమేక్ సినిమాలతో మెప్పించడం అనేది కత్తిమీద సాములాంటి విద్య. ఒక సినిమా ఒక భాషలో ప్రేక్షకులను మెప్పించిందని ప్రూవ్ అయిన తరువాత.. దాన్ని తీసుకుని మరోభాషలో చిత్రీకరించేప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒరిజినల్ యథాతథంగా తీయడానికి మనసొప్పదు. మన భాష, మన ప్రాంతం.. నేటివిటీ.. దీనికి తగిన మార్పులు అంటూ ఏదో పురుగు బుర్రను తొలుస్తూ ఉంటుంది. అలాంటి మార్పు చేర్పులు జరిగితే సినిమా ఏమైపోతుందో తెలియదు. అందుక నే ఈ మీమాంస జోలికి వెళ్లకుండా ఒరిజినల్ చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా తీసేసి మెప్పించిన వారున్నారు. అలాగే మార్పులతో మరింత ఘనంగా మెప్పించిన వారు కూడా మనకున్నారు. కాకపోతే.. 'నేటివిటీ మార్పులు' అనే ముసుగులో.. మంచి చిత్రాల్ని కంగాళీగా మార్చిన వారే ఎక్కువ. రెండు వారాలు గడిచిన తర్వాత ప్రేమమ్ చిత్రం కూడా ఆ కోవలోకి చేరితో ఆశ్చర్యం లేదు.
మళయాలంలో రూపొందిన ప్రేమమ్ చిత్రం అక్కడ చాలా పెద్ద సూపర్ హిట్. దాదాపు 50 కోట్లు వసూలు చేసి, ఇండస్ట్రీహిట్గా నిలిచింది. అక్కడ ఆ సినిమా పైరవీ అవుతోందని అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లన్నీ ప్రదర్శనలను ఆపేశాయి.. అంతగా అందరినీ ఆకట్టుకుంది ఆ చిత్రం. అలాంటి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే సాహసం చేశారు. ఆ సాహసాన్ని సమర్థంగా నెగ్గలేకపోయారు.
కథ:
ఓ ఇంటర్మీడియట్ కుర్రాడు. సహజంగానే ముగ్ధలాంటి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం సైకిలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ప్రేమ పర్వంలో ఉండే చిన్న చిన్న ఈతిబాధలన్నీ పడుతుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి మరొకరి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్లు గడుస్తాయి. ఈలోగా కుర్రాడు డిగ్రీలోకి వస్తాడు. ఈసారి ఎంచక్కా కొత్తగా వచ్చిన లెక్చరర్ మీదనే మనసు పడతాడు. ఇతగాడి హీరోయిజం ఆమెకు కూడా నచ్చుతుంది. ఇద్దరి మధ్య సుదీర్ఘమైన ఎపిసోడ్ నడుస్తుంది. ఈలోగా ఆమె సొంత ఊరికి వెళ్లడం. ఆమె గురించి ఓ షాకింగ్ కబురు తెలియడం జరుగుతంది. ఇక అమ్మాయిలంటేనే ఆసక్తిపోయిన దశలో పెద్దవాడైపోయిన ఆ కుర్రాడు రెస్టారెంట్ నడుపుకుంటూ ఉంటాడు. ఈ దశలో మరో అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె మీద.. ఓ ఆసక్తి పుడుతున్న సమయంలో తను ఇంటర్ లో ప్రేమించిన అమ్మాయికి చెల్లెలే అని తెలుస్తుంది. ఈలోగా.. మరో షాక్ కూడా ఎదురవుతుంది. ఇన్ని షాక్‌ల మధ్య కథ ఎలా సుఖాంతం అవుతుంది.. అనేదే అసలు సినిమా!
నటీనటులు :
నాగచైతన్య ఈ చిత్రంలో పరవాలేదనిపించాడు. కానీ ఆ కారెక్టర్లో ఉన్న లోతును నటనను చూడాలనుకున్న వారు.. మళయాళ చిత్రాన్ని చూడకపోవడం మంచిది. మొదటి హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, మూడో హీరోయిన్ మడోనా సెబాస్టియన్ ఇద్దరూ అలవాటైపోయిన పాత్రలను చక్కగా చేసేశారు. శృతిహాసన్ ఒక రకంగా ఈ చిత్రానికి మైనస్ అని చెపాలి. ఒరిజినల్ చిత్రంతో పోల్చకపోయినా సరే.. ఆ పాత్రలో ఉండే ఫీల్‌ను ప్రేక్షకుడికి కలిగించడంలో శృతిహాసన్ విఫలం అయిందనే చెప్పాలి.
సాంకేతికవర్గం :
కోటగిరి వెంకటేశ్వరరావు చేసిన ఎడిటింగ్ లో తప్పులు ఎన్నడానికి ఏమీ లేదు. కాకపోతే ఒరిజినల్ చిత్రానికి రాజేశ్ మురుగేశ్ సంగీతం అందిస్తే.. తెలుగు చిత్రానికి గోపీసుందర్ తో కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయించుకున్నారు. సంగీతం ఆకట్టుకుంటుంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం బాగుంది. కాకపోతే.. లొకేషన్లు ఇంకా హృద్యంగా ఉండవలసిందేమో అనిపిస్తే అది ఒరిజినల్ సినిమా చూసి పోల్చుకుంటున్న వాళ్ల తప్పు అనుకోవాలి.
విశ్లేషణ :
చందుమొండేటి క్రియేటివిటీ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే మరొకరి క్రియేటివిటీని తాను తెరమీద ప్రదర్శించడంలో సక్సెస్ కావాలనే గ్యారంటీ ఏమీ లేదు. కథలో మార్పు చేర్పులు చేసుకున్నాం.. మడోనా సెబాస్టియన్ పాత్ర నిడివి పెంచుతూ కథలో కొన్ని మార్పులు చేసుకున్నారు. కానీ ఆ నిడివి పెంచడం వలన వారు ఏం సాధించదలచుకున్నారో తెలియదు. కథలో ప్రధానంగా ఉండవలసిన ఒక ఫీల్‌ను ఆ మార్పులు మింగేశాయి అనేది వారు గుర్తించారో లేదో కూడా తెలియదు. కథలో పాత్రలు భాగమే అయినా ఆ పాత్రలకోసం ఏకంగా వెంకటేష్ , నాగార్జునలను కూడా అతిథి పాత్రల్లో నటింపజేశారు గానీ.. వారివల్ల సినిమాకు ఒరిగేదేమీ లేదు.
మొత్తానికి హాయిగా ఉండే ప్రేమ కథా చిత్రం చూడాలనుకుంటే ప్రేమమ్ మంచి ఆప్షన్.. కానీ అది ఎంత అద్భుతంగా మీలో అనుభూతుల్ని నింపుతుంది అనేది మాత్రం అనుమానమే.
డౌటు : కథలో అడ్డగోలు మార్పులు చేసేసిన వాళ్లు కనీసం తెలుగుదనం కనిపించేలా 'ప్రేమ' అని ఈ చిత్రానికి ఎందుకు పేరు పెట్టలేకపోయారో తెలియదు. 'ప్రేమమ్' అంటూ మళయాళ వాసన కొట్టే టైటిల్ మీద ఎందుకు మోజుపడ్డారో తెలియదు.
రేటింగ్ : 2.5 / 5
- కిరణ్మయి