బాలకృష్ణుడు మూవీ రివ్యూ
ప్రొడక్షన్ హౌస్: మాయా బజార్ మూవీస్, సరస్ చంద్రిక విజనరీ, మోషన్ పిక్చర్స్
నటీనటులు: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, ఆదిత్య మీనన్, రామరాజు, అజయ్, శివ ప్రసాద్, పృథ్వీ, వెన్నెల కిషోర్.
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: బి.మహేంద్రబాబు, శ్రీ వినోద్ నందమూరి
దర్శకత్వం: పవన్ మల్లెల
పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్.. అస్సలు తన బ్యాగ్రౌండ్ మీద ఆధాపడకుండా స్వశక్తితో పైకి రావడానికి కష్టపడుతున్నాడు. మంచి మంచి విభిన్నకథల్తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తున్న నారా రోహిత్ ఇప్పుడు బాలకృష్ణుడు తో పూర్తిస్థాయిలో కమర్షియల్ సినిమాలో నటించాడు. పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ ఈ సినిమా చేసాడు. రమ్యకృష్ణ వంటి సీనియర్ స్టార్స్ ఉన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణుడు థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అలాగే ఈ సినిమాలో నారా రోహిత్ బరువు తగ్గి సన్నగా కనబడతాడని ముందు నుండి ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు బొద్దుగా కనబడిన నారా రోహిత్ ఈ సినిమాలో కాస్త సన్నబడ్డాడనే విషయం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అలాగే హీరోయిన్ రెజినా కూడా గ్లామర్ షో ఈ సినిమాకి ప్లస్ అవుతుందనే విషయం బాలకృష్ణుడు పాటలు, ట్రైలర్ లలో అర్ధమయ్యింది. మరి మొదటిసారి ఫక్తు కమర్షియల్ లో ట్రై చేసిన నారా రోహిత్ కి ఈ బాలకృష్ణుడు కమర్షిల్ హిట్ అందించగలిగిందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో రవీందర్ రెడ్డి(ఆదిత్య) అతడి చెల్లెలు భానుమతి(రమ్యకృష్ణ) అక్కడ ఫ్యాక్షన్ గొడవలని రూపుమాపే ప్రయత్నంలో ప్రజలకు సేవ చేస్తుంటారు. అయితే భానుమతి ఆమె అన్న రవీందర్ రెడ్డి ప్రజలకు చేసే మంచి పనులతో.. మంచి పేరు సంపాదిస్తున్నారని.... వీరికి ప్రత్యర్ధి అయిన బసిరెడ్డి రగిలిపోతుంటాడు. అయితే రవీందర్ రెడ్డి చేతుల్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు బసిరెడ్డి. తన తండ్రి చావుకి కారణమైన రవీందర్ రెడ్డి ని చంపేస్తాడు బసిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి(అజయ్). అయితే రవీందర్ రెడ్డిని చంపిన ప్రతాప్ రెడ్డి భానుమతికి భయపడి పోలిసుల ఎదుట లొంగిపోతాడు. అయితే ప్రతాప్ రెడ్డి జైలు నుండే తన అరాచకాలను కొనసాగిస్తాడు. అందులో భాగంగానే... భానుమతి అన్న కూతురు ఆద్య(రెజీనా)ను చంపాలనుకుంటాడు. అయితే ప్రతాప్ రెడ్డి నుండి ఆద్యని కాపాడుకోవడానికి భానుమతి... బాలు(నారా రోహిత్)ను సెక్యూరిటీగా నియమిస్తుంది. ఆద్యను చంపాలనుకునే ప్రతాప్ నుండి బాలు ఆద్యను ఎలా కాపాడాడు.? అసలు బాడీగార్డుగా ఉన్న బాలు... ఆద్యకు ఎలా దగ్గరవుతాడు? చివరకు ప్రతాప్ ని బాలు, భానుమతిలు ఏం చేస్తారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద బాలకృష్ణుడుని వీక్షించి తెలుసుకుంటేనే బావుంటుంది.
నటీనటుల పాత్ర:
నారా రోహిత్ ఈ సినిమాలో కాస్త కొత్తగా కనిపించాడనే చెప్పాలి. ఎక్కువగా సెటిల్డ్ రోల్స్ లో కనిపించిన రోహిత్ మొదటి సారిగా ఈ సినిమాలో పక్కా కమర్షియల్ హీరోగా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే రోహిత్ యాక్షన్, డాన్స్ వంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడినట్లుగా తెరపై క్లియర్ గా కనిపిస్తుంది. వాటిపై మరింత ఫోకస్ పెట్టి ఉండాల్సింది. ఈ చిత్రం కోసం నారా రోహిత్ చాల కష్టపడ్డాడనే విషయం సినిమాలో అక్కడక్కడా అర్ధమవుతుంది. నటన పరంగా రోహిత్ నటనకు వంక పెట్టడానికి లేదు. డైలాగ్ డెలివరిలో కూడా పర్వాలేదనిపించారు. ఇక హీరోయిన్ విషయానికేకివస్తే... రెజీనా ఈ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల అందంగా కూడా కనిపించింది. కాకపోతే నటనకు స్కోప్ లేని పాత్రలో రెజినా ఈ సినిమాలో నటించింది. రమ్యకృష్ణ భానుమతి వంటి పవర్ ఫుల్ రోల్ తో ఆడియన్స్ ను మెప్పించింది. ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర హైలైట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అజయ్ ఇలాంటి పత్రాలు చాలా సినిమాల్లోనే నటించేసాడు. అయితే ఈ సినిమాలోనూ విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది పృధ్వీ కామెడీ. పృద్వి ఈ సినిమాలో చాలా కాలం తరువాత పూర్తిస్థాయి కామెడీ రోల్ తో బాగా నవ్వించాడు. ఇక మిగతా శ్రీనివాస్ రెడ్డి తదితరులు తమ పరిధిమేర మెప్పించారు.
దర్శకుడు: దర్శకుడు పవన్ మల్లెల.. నారా రోహిత్ ని మాస్ హీరోగా చూపెట్టే ప్రయత్నం చేసాడు. నారా రోహిత్ గత చిత్రాలతో పోల్చుకుంటే.... బాలకృష్ణుడు పూర్తిగా భిన్నమైన సినిమా. కేవలం నారా రోహిత్ లోని మాస్ యాంగిల్ ని మాత్రమే కాకూండా కామెడీ యాంగిల్ ని కూడా చూపించాడు పవన్. అయితే పవన్ కథనాన్ని లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. రొటీన్ కథను తీసుకున్నా... తనదైన స్క్రీన్ ప్లే తో సినిమాని రక్తికట్టించొచ్చు. కానీ పవన్ మాత్రం కథ, స్క్రీన్ ప్లే ని కూడా మూస పద్దతిలో చూపించేసి ప్రేక్షకులకు బోర్ కొట్టించేసాడు. అంతేకాకూండా హేమాహేమీలను ఈ సినిమాకి తీసుకున్న దర్శకుడు వారిని ఉపయోగించుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా రమ్యకృష్ణ పాత్రకు సినిమా మొదటి భాగంలో ఉన్న ప్రాముఖ్యత.. క్లైమాక్స్ కి వచ్చేసరికి తేల్చేసాడు. మొత్తానికి దర్శకుడు బాలకృష్ణుడు సినిమాని ఒక సీన్, ఒక పాట, ఒక ఫైట్ సినిమా మొత్తం కూడా ఇదే రిపీట్ చేస్తూ విసిగించేసాడు.
సాంకేతికవర్గం పనితీరు:
సంగీత దర్శకుడు మణిశర్మ మాస్ బీట్స్ తో అదరగొట్టాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ తో కథను ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు మణిశర్మ. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో బాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. కానీ కథలో సత్తా లేకపోతే సంగీతం ఎంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇక బాలకృష్ణుడుకి మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. సినిమా పాటల చిత్రీకరణ లొకేషన్స్ ని అద్భుతంగా తెరకేకించడంలో సినిమాటోగ్రఫీ ప్రముఖ పాత్ర పోషించింది. ఎడిటింగ్ వర్క్ ఈ సినిమాకి మెయిన్ మైనస్. ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమాకు అనవసరమైన కొన్ని ట్రాక్ లు తీసేస్తే కాస్త బెటర్ గా ఉండేది. నిర్మాణ విలువలు కథానుసారంగా పర్వాలేదనిపించాయి.
ప్లస్ పాయింట్స్:
నారా రోహిత్ నటన, రెజినా అందాలు, కామెడీ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్, ఫస్ట్ హాఫ్
రేటింగ్: 2.5 /5