రంగస్థలం మూవీ రివ్యూ - 3 ( నటి నటుల పెర్ఫార్మన్స్ పై విశ్లేషణ )
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జబర్దస్ మహేష్, రోహిణి, నరేష్, బ్రహ్మజీ, పూజ హెగ్డే తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: రత్నవేలు
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి
స్టోరీ,డైరెక్షన్: సుకుమార్
మెగా ఫ్యామిలీ నుండి చిరుత తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మగధీరతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన రామ్ చరణ్ ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో క్లాస్ లుక్ తో కనబడ్డాడు. రచ్చ వంటి సినిమాల్లో మాస్ టచ్ చేసినా తన లుక్ లో పెద్దగా మార్పేమీ లేదు. ఇక మగధీర తర్వాత 2016 లో వచ్చిన ధ్రువ సినిమా వరకు రామ్ చరణ్ మళ్ళీ మగధీర వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకోలేదు. కానీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ సినిమాతో చరణ్ తనలోని నటుడిని పూర్తిగా బయటపెట్టాడు. ధ్రువ సినిమా తో రామ్ చరణ్ పరిణితి ఉన్న నటుడిగా ఎదిగాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ లుక్ దగ్గరనుండి అతని బాడీ లాంగ్వేజ్ వరకు అన్ని కొత్తగానే ఉన్నాయి. మరి ఇప్పటివరకు క్లాస్ అండ్ మాస్ ని టచ్ చేసిన రామ్ చరణ్ మొదటిసారి డి గ్లామర్ గా పల్లెటూరి లుక్ లోకి మారిపోయాడు. గళ్ళ చొక్కా, లుంగీ, తువ్వాలు ఇలా మాస్ లో ఊర మాస్ అన్నమాదిరిగా పూర్తిగా పల్లెటూరి అవతారంలోకి మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం కోసం రామ్ చరణ్ చిట్టిబాబుగా ఏడాది పాటు ట్రావెల్ చేసాడు. దర్శకుడు సుకుమార్ కూడా తన సినిమాల్లో క్లాస్ లుక్ నే టచ్ చేసేవాడు. ఎప్పుడు విదేశాల్లో షూటింగ్.... హీరోలను స్టైలిష్ అండ్ క్లాస్ లుక్స్ ఇచ్చే సుకుమార్ పల్లెటూరి మీద ప్రేమతో మొదటిసారి గ్రామీణ నేపథ్యం గల జోనర్ లో ఈ రంగస్థలం సినిమాని ఆద్యంతం అందరిని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ఇక గ్లామర్ డాల్ సమంత కూడా తన కెరీర్ లోనే మొదటిసారి ఇలా డి గ్లామర్ పాత్ర చేసింది. ఇప్పటివరకు పద్దతిగల సినిమా ల్లోను, గ్లామర్ సినిమాల్లోనూ తన టాలెంట్ చూపించిన సమంత మొదటిసారి పల్లెటూరి అమ్మాయి పాత్రని ఒప్పుకుని... ఆ పాత్రలో అల్లుకుపోవడం...హాట్ యాంకర్ అనసూయ రామ్ చరణ్ అత్తగా రంగమ్మత్తగా నటించడం, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా వున్న జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా నటించడం.. దేవిశ్రీ సంగీతం అందించిన రంగస్థలం పాటలు కూడా పక్కా పల్లెటూరి వాతావరణాన్ని తలపించడం... సినిమాలో ఎక్కడా మోడ్రెన్ అన్న పదం గాని, అలాంటి ఛాయలు గానీ లేకుండా సుకుమార్ తీసుకున్న జాగ్రత్తలు, మొదటిసారి రామ్ చరణ్ - సుకుమార్ - సమంత ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కడం, అలాగే ట్రైలర్ లో చూపించినట్లుగా ఈ సినిమాలో ప్రేమ, పగ, యాక్షన్ ఇలా అన్ని రకాల జోనర్లను టచ్ చెయ్యడం వెరసి ఈ రంగస్థలంపై భారీ అంచనాలున్నాయి. మరి ప్రస్తుతం అందరూ హడావిడి జీవితం గడుపుతూ పల్లెటూర్లను పక్కన పెట్టేస్తున్న ఈ కాలంలో అందరిని 1980 ల నాటి కాలానికి తీసుకెళ్లడానికి సుకుమార్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
రంగస్థలం అనే ఒక పల్లెటూరి లో ఒక క్రూరమైన సర్పంచ్ ఫణింద్ర భూపతి(జగపతిబాబు) ఉంటాడు. తన పదవి కోసం ఏమైనా చేసే క్రూరత్వం ఉన్న ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతి. అదే ఊరిలో వ్యవసాయం చేసుకునే వారికీ తన ఇంజిన్ తో నీళ్లు తోడుతూ వారి దగ్గర డబ్బులు తీసుకునే చిట్టిబాబు(రామ్ చరణ్) కి వినబడదు. అంటే సౌండ్ ఇంజినీర్ అన్నమాట. మరి పొలం బాగా పండాలంటే అందరూ ఆకాశం వైపు చూస్తే రంగస్థలం ఊరిలో మాత్రం అందరూ చిట్టిబాబు ఇంజిన్ తో వదిలే నీళ్లకోసం చిట్టిబాబు కోసం చూస్తారు. చిట్టిబాబు అన్నగారు కుమార్ బాబు(ఆది పినిశెట్టి) దుబాయ్ లో చదువుతుంటారు. అయితే సెలవలకి రంగస్థలం ఊరికి వస్తాడు కుమార్ బాబు. ఆ ఊరిలో పెత్తనాన్ని చెలాయించడానికి ఫణింద్ర భూపతి ఊరిని మొత్తం తన గుప్పెట్లో ఉండేలా చూసుకుంటాడు. అందులో భాగంగానే ఊరిలోని భూములను, ఆస్తులను అప్పులిచ్చి మరి దోచుకుంటుంటాడు. దానికోసం అధికారం ఉండాలనుకునే తనకి పోటీగా ఎవరిని రాకుండా చూసుకుంటూ ముప్పై ఏళ్లుగా అదే పదవిలో ఉంటాడు. అయితే మొదటి చూపులోనే ఇష్టపడి ప్రేమించిన రామలక్ష్మి (సమంత) పొలాన్ని కూడా ఫణింద్ర భూపతి ఆక్రమించుకుంటాడు. అది చూడలేని చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు ఊరుబాగుపడాలంటే సర్పంచ్ పదవి నుండి ఫణింద్ర భూపతిని దించాలని అతనికి వ్యతిరేఖంగా నామినేషన్ వెయ్యడం... ఎప్పటినుండో అపోజిషన్ లోనే ఉన్న దక్షిణ మూర్తి(ప్రకాష్ రాజ్) కుమార్ బాబుకి అండగా నిలవడంతో ఆగ్రహించిన ఫణింద్ర భూపతి కుమార్ బాబుని చంపిస్తాడు. కుమార్ బాబు చనిపోవడంతో ఆ ఊరి సర్పంచ్ ఫణింద్ర భూపతి ఎవరికీ కనబడకుండా పోతాడు. మరి అసలు కుమార్ బాబు ని ఫణింద్ర భూపతే చంపుతాడా? అసలు కుమార్ బాబు హత్య తర్వాత ఫణింద్ర భూపతి ఏమయ్యాడు.? అన్నని ప్రాణంగా చూసుకునే చిట్టిబాబు అన్న హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడా? రామలక్ష్మిని చిట్టిబాబు పెళ్లాడాడా? అసలు అన్నని చంపిన హంతకుడిని చిట్టిబాబు ఎలా శిక్షించాడు? అనేది మిగతా రంగస్థలం కథ.
నటీనటులు నటన:
రామ్ చరణ్: పల్లెటూర్లలో వ్యవసాయం, కూలిపనులు చేసుకునే కుర్రాళ్లను మనం తరుచు కాకపోయినా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం. వారు తమ పనులు తాము చేసుకుంటూ చాలా రఫ్ గా వుంటారు. మరి ఇప్పుడు రంగస్థలంలోని రామ్ చరణ్ చిట్టిబాబు పాత్ర కూడా అంతే. రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. భాషలోని యాస, కట్టుబట్టలోని తేడా అన్నిటిలో చరణ్ సూపర్ అనిపించేలా ఉన్నాడు. చిట్టిబాబుగా మాస్ లుక్ లో సౌండ్ ఇంజినీర్ గా చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్సు ఇచ్చాడు . రామ్ చరణ్ లోని నటుడుని పూర్తిగా ఈ సినిమా ద్వారా బయటికి తీసాడు సుకుమార్. అన్న కోసం ప్రణాలిచ్చే తమ్ముడిగా చరణ్ నట విశ్వరూపం చూపించాడు. అంతేకాకుండా ఎప్పటిలాగే రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్స్ తో డాన్స్ లలోను అదరగొట్టేసాడు. క్లైమాక్స్ సీన్ లో ఫాన్స్ నే కాదు ప్రేక్షకులను సైతం మెప్పిస్తాడు. మొత్తానికి రామ్ చరణ్ కి ఈ చిట్టిబాబు పాత్ర పదికాలాలు గుర్తుంది పోతుంది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సమంత: చీర కట్టినా... బికినీ వేసినా తన అందంతో మెప్పించే సమంత కెరీర్లోనే మొదటిసారి పల్లెటూరి అమ్మాయిలా.. పల్లె పడుచులా నటించింది. సమంత కి లంగావోణీ కొత్త కాకపోయినా.. ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా, అమాయకపు అమ్మాయిలా, సమంత వేసుకున్న చీరకట్టు నుండి లంగావోణీ వరకు చూడముచ్చటగా వున్నాయి. చిలిపి చూపు, కవ్వించే అందాలు ఇలా సమంత రామలక్ష్మి లుక్ మొదటినుండి అనుకున్నట్టుగానే అదరగొట్టింది. చిట్టిబాబు ని తమ మాటలతో చేతలతో రెచ్చగొట్టే పాత్రలో రామలక్ష్మి గా సమంత తన పాత్రలో ఒదిగిపోయింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ మాత్రమే ఎక్కువగా కనిపించే సమంతా... రామ్ చరణ్ కు పోటీగా తన ఎక్సప్రెషన్స్ తో ఆదరగొట్టింది. కానీ సెకండ్ హాఫ్ లో సమంత పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుంది.
ఆది పినిశెట్టి: చిట్టిబాబు కి అన్నగా కుమార్ బాబుగా ఆది పినిశెట్టి నటన అద్భుతః అన్నట్టుగా వుంది. ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రకు సరిసమానంగా కుమార్ బాబు పాత్ర కూడా ఉంటుంది. గుండెల్లో గోదారిలో కొద్దిగా గోదారి కుర్రాడిలా నటించిన ఆది పినిశెట్టి ఈ రంగస్థలంలోనూ కుమార్ బాబు పాత్ర కూడా అలాంటిదే. పల్లెటూరి పాలిటిక్స్ లో సర్పంచ్ పదవి కోసం పోటీ చెయ్యడం.. అలాగే అందులో గెలవడానికి కుమార్ బాబుగా ఆది చేసే పనులు ఇలా అన్ని ఆకట్టుకున్నాయి.
జగపతిబాబు: లెజెండ్ తో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు తాను విలన్ గా చేసిన చేసిన సినిమాల్లో ఎంత సహజసిద్ధంగా విలనిజాన్ని పండించాడో.. ఈ రంగస్థలంలో జగపతి బాబు రంగస్థలం ఊరి సర్పంచ్ గా తన పదవి కాపాడుకోవడానికి ఎన్ని దుర్మార్గాలు చెయ్యాలో అన్నీ చేసి తన విలనిజాన్ని చూపిస్తాడు. మరి మరోమారు విలన్ పాత్రలో జగపతి బాబు పాత్ర సూపర్ అన్నట్టుగా వుంది.
అనసూయ: ఎప్పుడు మోకాళ్లపైకి డ్రెస్సులు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లు వేసి.. నడుమందాలు నాభి దాకా చూపిస్తూ కవ్వించే హాట్ యాంకర్ అనసూయ మొదటిసారి అత్త పాత్ర చేసింది. పెళ్ళై పిలల్లు ఉన్నా అక్క పాత్రలనే ఒప్పుకోని అనసూయ ఇలా రంగస్థలంలో రామ్ చరణ్ కి అత్తగా అనేసరికి ఆ పాత్రకి ఎంతగా ఇంపార్టెన్స్ లేకపోతె అనసూయ ఆ పాత్రని ఒప్పుకుంది అని అనుకున్నారు. మరి నిజంగానే అందరూ అనుకున్నట్టుగానే అనసూయ చరణ్ అత్తగా రంగమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ఫస్ట్ హాఫ్ లో అనసూయ రంగమ్మత్తగా మంచి సందడి చేసింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అనసూయ పాత్ర కి పెద్దగా స్కోప్ ఉండదు.
ఇంకా రంగస్థలంలో నటించిన ప్రకాష్ రాజ్ తన పాత్రలో జీవించాడు. అలాగే చిట్టిబాబు తల్లితండ్రులుగా నరేష్, రోహిణి లు బాగానే నటించారు. ఇక రామ్ చరణ్ పక్కనే ఉండే జబర్దస్త్ మహేష్ తన కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. మహేష్ కి రంగస్థలం సినిమా ఒక మలుపు తీసుకుంటుంది. ఇక బ్రహ్మజీ, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్ లాంటి నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ:
దర్శకుడు సుకుమార్ తీసిన సినిమాలన్నీ వేటికవే సాటి. సుకుమార్ చేతిలో బ్లాక్ బస్టర్ లేకపోయినా.. సుకుమార్ నుండి సినిమా వస్తుంది అంటే చాలు క్లాస్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే సుకుమార్ సినిమాలు చూడాలి అంటే ఫ్రెష్ మైండ్ తోనే సినిమాకి వెళ్ళాలి. లేదంటే ఆయనగారు తీసిన సినిమా ఒక పట్టాన అర్ధమై చావదు. ఎందుకంటే సుకుమార్ సినిమా చూడాలి అంటే బుర్రకు పదును పెట్టాలి. ఆ కోవలో వచ్చిన 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో బ్లాక్ బస్టర్స్ కాకపోయినా సూపర్ హిట్ అయ్యాయి. అయితే అంతటి క్లాస్ టచ్ నుండి మొదటిసారి బయటికి వచ్చి పల్లెటూరి నేపధ్యాన్ని కథగా తీసుకున్నాడు సుకుమార్. ఇక గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మోడ్రెన్ పదానికి చాలా దూరం. అలాగే ఇప్పుడు ఉన్న టెక్నలాజి కూడా అప్పట్లో లేవు. దాదాపు ముపై ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లి అప్పటి పల్లెటూరి కథని సింపుల్ స్టోరీ లైన్ గా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. అప్పట్లో ఉండే ఇళ్లు, ఆ వాతావరణం, పల్లెటూర్లలో ఉండే సైలెంట్ గా గోతులు తీస్తూ పగలు పెంచుకుంటూ కొనసాగే కథతో తీసిన ఈ రంగస్థలంలో కథ లేకపోయినా దర్శకుడి మేకింగ్ స్టయిల్ మాత్రం అదరగొట్టేసింది. అయితే రంగస్థలం ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయం, వాటి తీరు తెనులనే చూపించి పూర్తి కథని సెకండ్ హాఫ్ లో రివీల్ చెయ్యడం అనేది ప్రేక్షకుడు తేలిగ్గా తీసుకోలేడు. సినిమా లో రంగస్థలం ఊరి ప్రెసిడెంట్ కు ఎదురెళ్ళిన అన్నయ్య చావుకు కారణమైన వాళ్ళను పట్టుకుని చంపే ఒక చెవిటి తమ్ముడు కథే ఈ సినిమా. అన్నయ్య అంటే అంత ప్రాణమిచ్చే చిట్టిబాబు ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు తీసుకుని అన్నయ్య ప్రాణం మీదకు వచ్చేసరికి తిరిగి ఇచ్చే ఎపిసోడ్ అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు. అక్కడ డౌన్ అయిన గ్రాఫ్ తిరిగి క్లైమాక్స్ ముందు నుంచి మాత్రమే కోలుకుంటుంది. మరి సింగిల్ లైన్ లో సినిమాని మూడు గంటల పాటు సాగించడం అనేది మాత్రం కాస్త సాహసోపేత నిర్ణయమే అయినప్పటికీ... ప్రేక్షకుడు పెద్దగా బోర్ ఫీలవ్వడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో అందరూ ఊహించిన కథే తేరా మీద ప్రత్యక్షం అవ్వడం అనేది మాత్రం డైజెస్ట్ చేసుకోలేని విషయమే. ఇకపోతే సుకుమార్ సినిమా మొత్తం ఐదు పాత్రలకే పరిమితం చేశాడా అనిపిస్తుంది. రంగస్థలంలో చిట్టిబాబు, రామలక్ష్మి, రంగమ్మ, కుమార్ బాబు, జగపతి బాబు ఇలా ఐదు పాత్రలు చుట్టూనే తిరిగేలా చేసాడు. కానీ టెక్నికల్ గా అద్భుతంగా సుకుమార్ చేసిన ప్రయత్నం మాత్రం ప్రేక్షకులను 2.50 నిమిషాల వరకు సీట్స్ లోనే కూర్చునేలా చెయ్యడం లో మాత్రం చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి మెయిన్ హైలెట్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో సినిమాకి రియలిస్టిక్ లుక్ ని తీసుకొచ్చాడు. కథానుసారంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకేలా అనిపిస్తుంది. అసలు దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఆడియో గానే కాక సుకుమార్ టేకింగ్ లో వీడియోలో కూడా కనువిందుగా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాకి అన్నిటికన్నా హైలెట్ మాత్రం సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి రామ్ చరణ్ నటన ఎంత ప్రాణంగా నిలిచిందో... కెమెరామెన్ రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా అంతే ప్రాణంగా నిలిచింది. రత్నవేలు పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరుకు హాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. అలాగే పాటల్లోని పల్లె అందాలు లో కూడా రత్నవేలు ఫోటోగ్రఫీ అత్యంత అద్భుతం. అలాగే రంగస్థలంలో మరో మెయిన్ హైలెట్ ఆర్ట్ వర్క్. పల్లెటూరి లా సెట్ సెటప్ ... ఈ సినిమాలో అది ఒక సెట్ లా కనిపించదు. అదికూడా ఒక పల్లెటూరి లాగ కనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ చేసిన రామకృష్ణ, మౌనిక రంగస్థలంకు వెన్నెముక. వారు ఎంతగా కష్టపడ్డారో అనేది స్క్రీన్ మీద ప్రతి సీన్ లోను కనబడుతుంది. ఇక మైత్రి మూవీస్ వారు సుకుమార్ అడిగింది కాదనకుండా ఖర్చు పెట్టారు. అసలు వారు రంగస్థలంకోసం ఎక్కడా రాజి పడలేదనిపిస్తుంది నిర్మాణ విలువలు చూస్తుంటే.
ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ లుక్స్, నటన, ఆది పినిశెట్టి, సమంతా నటన, రత్నవేలు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్: నిడివి ఎక్కువ ఉండడం, సెకండ్ హాఫ్, కథ పెద్దగా లేకపోవడం
రేటింగ్: 3.0/5