రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ
ప్రొడక్షన్ కంపెనీ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: రవితేజ, మెహ్రీన్ కౌర్, ప్రకాష్ రాజ్, రాధికా శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్,సంపత్
మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
'పటాస్, సుప్రీం' సినిమాల హిట్ తో మంచి జోష్ మీదున్న అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చెయ్యాలని అనుకున్నాడు. స్టార్ హీరో అయితే అనిల్ చేతికి దొరకలేదుగాని..... ఎనర్జిటిక్ హీరో రవితేజ మాత్రం అనిల్ రావిపూడి కథకి కనెక్ట్ అయ్యాడు. అనిల్ రావిపూడి, హీరో ని అంధుడిగా చూపించాలని కొత్తగా ట్రై చెయ్యడం, రెండు సినిమాల హిట్స్ తో మంచి జోష్ మీదుండడం... రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ, అనిల్ రావిపూడి సినిమాని ఒప్పుకోవడం, హీరోకి అంధత్వం ఉన్న కూడా కథమీదున్న నమ్మకంతో రవితేజ ఈ సినిమా చెయ్యడం అన్ని విషయాలతో 'రాజా ది గ్రేట్' సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడమంటేనే ఈ సినిమాలో ఏదో విషయం ఉందని ప్రేక్షకులు కూడా ఒక అంచనాకు రావడం, అలాగే రెండు సినిమాల హిట్ తో క్యూట్ గా మెరిసిపోతున్న మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో రవితేజతో జోడి కట్టడడం వంటి విషయాలు 'రాజా ది గ్రేట్' చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక టీజర్ ట్రైలర్ లోను రవితేజ కామెడీ యాక్షన్, అంధుడిగా నటించిన తీరు కూడా ఈసినిమా మీద అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. మరి రెండేళ్ల గ్యాప్ తర్వాత హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్న రవితేజకి... ఈ సినిమా విజయంతో స్టార్ హీరోలను అందుకోవాలని చూస్తున్న అనిల్ రావిపూడి కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
రాజా(రవి తేజ) పుట్టుకతోనే అంధుడు. అసలు కళ్ళు లేవనే ఫీలింగ్ లేకుండా... ఎటువంటి భయము లేకుండా జీవితంలో చక్కగా బతికేస్తుంటాడు. రాజా తల్లి(రాధిక) రాజాని పోలీస్ ఆఫీసర్ ని చెయ్యాలని కలలుకంటుంది. ఎందుకంటే రాధికా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కానిస్టేబుల్ గా పనిచేస్తుంటుంది. రాజా కబడ్డీ ఆటలో మంచి పట్టు సాధించి విజయాలను సొంతం చేసుకుంటాడు. పోలీస్ ని చెయ్యాలని రాజాకి రాధికా శిక్షణ కూడా ఇప్పిస్తుంది. కానీ రాజా అంధుడు అవడం మూలంగా అతనికి పోలీస్ ఉద్యోగం రాదు. అయినా రాధికా పట్టువదలకుండా ఐజి (సంపత్ రాజ్) ని పట్టుకుని.... బ్రతిమిలాడగా.. ఆ ఐజి తన కొడుక్కి సీక్రెట్ ఆపరేషన్ లో ఒక వ్యక్తిగా నియమిస్తాడు. ఐజికి ఇష్టం లేకపోయినా కేవలం రాధిక ప్రాధేయపడడం వలెనే ఐజి రాజాకి ఆ ఉద్యోగం ఇస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో నిజాయితీకి మారు పేరైన పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ కూతురు లక్కీని(మెహ్రీన్) విలన్ దేవా చంపాలనుకుంటాడు. అయితే తన కూతురు లక్కీని రక్షించే భాగంలో ప్రకాష్ రాజ్ విలన్ చేతిలో చనిపోగా.. ఆయన కూతురు లక్కీ మాత్రం తప్పించుకుని పారిపోతుంది. అక్కడనుండి తప్పించుకున్న లక్కీ ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ ఐజిని కలుస్తుంది. ఆ ఐజి లక్కీని చంపడానికి..... ప్రకాష్ రాజ్ కి చావుకి కారణయమైన విలన్ ని పట్టుకోవడానికి సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు. అందులో సభ్యుడైన రవితేజ విలన్స్ ని ఎలా మట్టు పెట్టాడు.? అసలు ప్రకాష్ రాజ్ కి ఆ విలన్ కి ఉన్న పగ ఏమిటి? ఐజి రాజా సహాయంతో సీక్రెట్ ఆపరేషన్ తో లక్కీని ఎలా కాపాడాడు? అనే విషయాన్నీ రాజా ది గ్రేట్ సినిమా వెండితెర మీద వీక్షించి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు:
రవితేజ రాజాగా, అంధుడి పాత్రలో చాల బాగా నటించి మెప్పించాడు. రవితేజ అంధుడిగా చేసిన యాక్షన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఎంతో ఎనర్జిటిక్ గా రవితేజ నటన సూపర్బ్ అనిపించేలా వుంది. సినిమా స్టార్ట్ అయినప్పటినుండి చివరివరకు ఎక్కడా గాడి తప్పకుండా... అంధుడి పాత్రని రవితేజ అద్భుతంగా పోషించాడు. ఇప్పటివరకు కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ఈ రాజా ది గ్రేట్ సినిమాతో ఎలాంటి పాత్ర అయినా అదరగొట్టెయ్యగలడని ఈ సినిమాతో ప్రూవ్ చేసాడు. ఎప్పటిలాగే యాక్షన్ తోపాటు ఎంటెర్టైమెంట్ తో అదరకొట్టేసాడు. ఇక హీరోయిన్ గా మెహరీన్ కూడా అద్భుతంగా నటించింది. రాజా ది గ్రేట్ సినిమా కథ మొత్తం మెహరీన్ చుట్టూతానే అల్లిన కథ కావడంతో మెహ్రీన్ నటనకు మంచి స్కోప్ దొరికింది. మెహ్రీన్ అందంతో, అభినయంతో చాలా బాగా ఆకట్టుకుంది. రవితేజ తల్లిగా రాధికా అమ్మ పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. మెయిన్ విలన్ గా నటించిన వివాన్ బాటనా కొన్నిసార్లు ఆకట్టుకున్నా.. మరికొన్నిసార్లు అతని నటన కొద్దిగా ఓవర్ అనిపించింది. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు చిన్నవే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. పృద్వి కామెడీ మాత్రం పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
అనిల్ రావిపూడి దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టినప్పటినుండి... తన సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు. పటాస్, సుప్రీం సినిమాల్లో హీరోలతోనే కామెడీ పండించి శెభాష్ అనిపించాడు. కథలో కొత్తదనం లేకపోయినా కామెడీతో, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ సినిమాని నడిపించేస్తాడు. ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాలో కూడా అనిల్ తన ముందు సినిమాల మ్యాజిక్ నే రిపీట్ చేసాడు. రాజా ది గ్రేట్ సినిమా కథ కొత్తగా అనిపించదు. ఇదే కథ తో చాలా సినిమాలే తెరకెక్కాయి. అయితే హీరో కి అంధత్వం అనే లోపం పెట్టి ఈ సినిమా కథని అనిల్ హ్యాండిల్ చేసిన తీరు మాత్రం అద్భుతమని చెప్పాలి. సినిమా ఆసాంతం బోర్ కొట్టించకుండా... తాను నమ్ముకున్న కామెడీనే హైలెట్ చేస్తూ....సినిమాని చాల నీట్ గా తెరకెక్కించాడు. రాజా ది గ్రేట్ సినిమా సగ భాగం అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ట్రాక్ లోనే వుంది. రవితేజ, శ్రీనివాస్ రెడ్డి లు మధ్యన వచ్చే కామెడీ సన్నివేశాలు బావున్నాయి. ఇక సినిమా సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ నెస్ తో సీక్రెట్ ఆపరేషన్ తోనే సాగిపోతుంది. ఇక సినిమాలో ఎటువంటి ట్విస్టులు ఉండకపోవడం, సస్పెన్సు సీన్స్ లేకపోవడం అనేది సినిమాకి మైనస్ అనే చెప్పాలి.
ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రెమ్ ని అద్భుతంగా, అందంగా, గ్రాండ్ గా చూపించాడు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే సాయి కార్తీక్ అందించిన సంగీత సో సో గా వుంది. పాటలు తేలిపోయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా అందించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని అంతెత్తులో నిలుచోబెడుతుంది. ఇక ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాత దిల్ రాజు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ సినిమా కి ఖర్చు పెట్టాడు. ఆ విషయం ప్రతి సీన్ లోను అర్ధమవుతుంది.నిర్మాణ విలువలకు ఎటువంటి వంకలు పెట్టడానికి లేదు.
ప్లస్ పాయింట్స్: రవితేజ నటన, మెహ్రీన్, బ్యాగ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్: రొటీన్ కథ, ట్విస్టులు లేకపోవడం, సెకండ్ హాఫ్, సస్పెన్స్ అనిపించే సన్నివేశాలు లేకపోవడం, అనవసరం అయిన సన్నివేశాలు
రేటింగ్: 3.0/5