రోగ్ రివ్యూ
నటీనటులు: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్‌సింగ్, పోసాని కృష్ణమురళి, అలీ
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి
దర్శకత్వం: పూరి జగన్నాథ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్. మాస్ హీరోగా ఏ హీరో అయినా ఎలివేట్ అవ్వాలంటే.. ముందుగా కోరుకునే డైరెక్టర్. నెగెటివ్ టైటిల్స్ తో హీరోయిజం ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లడం లో పూరి తర్వాతే ఎవరైనా. అలాంటి టైటిల్ తోనే అతను సూపర్ హిట్స్ కొట్టాడు కూడాను. గత కొంత కాలంగా హిట్స్ కొట్టలేక, సినిమాలను చుట్టేస్తున్నాడనే పేరు పడ్డ పూరి.. పెద్ద హీరోలతో సినిమాలు చేసే రేంజ్ నుండి చిన్న హీరోలతో సినిమా లు చేసే స్థాయికి దిగజారడానే కామెంట్స్ కూడా అనుభవించాడు. అయితే ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ రోగ్ అనే సినిమాని తెరకెక్కించిన పూరి..మరో వైపు తన స్టార్ పవర్ తగ్గలేదు అనే విధంగా నటసింహం బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే రామ్ చరణ్ వంటి హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన పూరి.. కొత్త హీరోలను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం లో సిద్ధహస్తుడు అనే పేరు కూడా సంపాదించాడు. అదే ఊపులో ఇప్పుడు సరికొత్తగా ఇషాన్ అనే కొత్త కుర్రాడిని టాలీవుడ్ కి పరిచయం చేశాడు రోగ్ తో. ఎప్పుడూ తాను అనుకున్న స్టయిల్, జోనర్ లోనే కథలను ఎంచుకుని సినిమాలు తీసుకుంటూ పోయే పూరి..మరొక్క మారు అదే రూట్ లో వెళుతూనే..కాస్త డిఫరెంట్ గా రోగ్ ని ట్రై చేశాడు. ఆ విషయం ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. అలాగే ఈ రోగ్ హిట్టవ్వడం కూడా పూరి కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సినిమాలో ఎవరిని ఎలా వాడాలో..అలా వాడేశాడు. హీరో ఫస్ట్ లుక్ కే మంచి పేరు రావడం, హీరోయిన్ ల అదిరిపోయే అంద ప్రదర్శన, పూరి స్టైల్ అఫ్ మేకింగ్, హీరో బ్యాగ్రౌండ్..వంటివన్నీ ఈ చిత్రాన్ని వార్తల్లో ఉండేలా చేశాయి. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కి కారణమయ్యాయి. మరి ఆ ఆసక్తి..ఈ చిత్రానికి ఎటువంటి రిజల్ట్ కి కారణం అయ్యిందో..మన రివ్యూ లో తెలుసుకుందాం.
కథ: .చంటి (ఇషాన్) అనే కుర్రాడు కలకత్తా సిటీ కమీషన్ కూతురు( ఏంజెలా)ని ప్రేమిస్తాడు. అంజలిని లోకంగా భావిస్తూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అతని ప్రవర్తన చూసిన వారంతా అతన్ని రోగ్ అనిపిలుస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల అంజలి చంటి ని కాదని ఒక పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అంజలి పెళ్ళికి వెళ్లిన చంటి అక్కడ రచ్చ రచ్చ చేసి పోలీస్ కానిస్టేబుల్ కాళ్ళు విరగ్గొడతాడు. ఆ కారణంగానే జైలు పాలవుతాడు. జైలుకెళ్లోచ్చిన కొడుకుని ఇంట్లో నుండి వెళ్ళగొడతాడు చంటి తండ్రి. అయితే తన వల్ల కళ్ళు పోగొట్టుకున్న కానిస్టేబుల్ ఫ్యామిలీని ఆదుకోవడానికి ప్రయత్నిస్తాడు చంటి. ఆ కానిస్టేబుల్ చెల్లెలు అంజలి (మన్నారా చోప్రా) కచేరీలు చేసి డబ్బులు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. అయితే తన అన్న కాళ్ళు విరగ్గొట్టిన ఇషాన్ పై కోపం పెంచుకుంటున్నది అంజలి. అలాగే అంజలి ని ఒక సైకో ( అనూప్ సింగ్) లవ్ చేస్తున్నానంటూ వెంటపడి వేధిస్తుంటాడు. ఇక రోగ్ కూడా అంజలిని ప్రేమిస్తాడు.మరి అంజలిని సైకో నుండి చంటి కాపాడుతాడా? చంటి గర్ల్ ఫ్రెండ్ చంటిని వదిలి సుబ్బరాజుని ఎందుకు పెళ్లి చేసుకుంది? చంటి ఆ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడు? అనే అంశాలు వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పాత్ర: ఇషాన్ కొత్త కుర్రాడు అయినప్పటికీ చంటిగా ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. ఇషాన్ కొత్తగా సినిమా హీరోగా పరిచయమయినప్పటికీ ఏంటో అనుభవమున్న హీరోగా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. రోగ్ గా అలరించాడు. ఇక హీరోయిన్స్ మన్నారు చోప్రా, ఏంజెలా గ్లామర్ కే పరిమితమయ్యారు. నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. అందాల ఆరబోత కుర్రకారుకు మత్తెక్కిస్తోంది గాని మిగతా వాళ్ళు భరించడం కష్టమే. ఇక హీరోతో తో పాటు నటించి మార్కులు కొట్టేసిన విలన్ గా అనూప్ సింగ్ నటన ఆధ్యంతం ఆకట్టుకుంది. సైకో గా బాహా మెప్పించాడు. అయితే అలీ కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సుబ్బరాజు, తులసి, సత్య సహా మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం: డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోమారు పాట జోనర్ నే ఎన్నుకున్నాడు. హీరో ని అల్లరి చిల్లరిగా చూపిస్తూ ఇడియట్, బద్రి, పోకిరి, బుజ్జిగాడు చిత్రాలను గుర్తు చేసాడు. అయితే ఇషాన్ ని ఎలా చూపించాలని పూరి అనుకున్నాడో రోగ్ లో అతని కేరెక్టర్ ని అలానే డిజైన్ చేసాడు.కానీ పూరి కొన్నిసార్లు తలా తోక లేకుండా సినిమాలు చేసేస్తుంటాడు. అప్పుడెప్పుడో రవితేజ - ఇలియానా జంటగా దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని అలాగే చేసేసాడు. ఇప్పుడు కూడా రోగ్ చిత్రాన్ని రవితేజ ఇడియట్ వలె తీసి హిట్ కొట్టేద్దామనుకున్న పూరికి ఈ చిత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక పూర్తిస్థాయిలో కామెడీ పండకపోవడం ఈ రోగ్ చిత్రానికి ప్రధానమైన లోపం. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. సునీల్ కశ్యప్ మ్యూజిక్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ముఖేష్.జి సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మరి ఈ చిత్రం కూడా పూరి జగన్నాథ్ కి నిరాశే మిగిల్చేలా కనబడుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలకు దూరమైనా పూరి ఇప్పుడొక బడా సీనియర్ హీరో అయిన బాలకృష్ణ తో ఒక చిత్రాన్ని తీస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ మీద రకరకాల కథనాలు ప్రచారమవుతున్న వేల ఇపుడు పూరి డైరెక్టన్ లో వచ్చిన రోగ్ కూడా సక్సెస్ సాధించేలా లేదు గనక ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ భయం మరికొంతమేర పెరిగే అవకాశము వుంది. అసలు బాలయ్య బాబుతో చిత్రమంటే పూరి తన మేనరిజాన్ని చాలా వరకు మార్చుకోవాల్సిన అవసరం వుంది. మరి బాలయ్య కోసం పూరి తన స్టైల్ మార్చుకుంటాడా? లేకపోతె తన స్టయిల్లోనే సినిమా తీసి చూపిస్తాడో చూడాలి.
ప్లస్ పాయింట్స్: ఇషాన్, అనూప్ నటన
మైనస్ పాయింట్స్: దర్శకత్వం, కథ, కథనం, కామెడీ, హీరోయిన్స్, సంగీతం
రేటింగ్: 2 .0 /5
- Tags
- రోగ్