'2.0’ స్వీట్ & షార్ట్ రివ్యూ
సూపర్‌స్టార్ రజనీకాంత్ - ఏ వన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా జనాలు ఇప్పటకీ రోబోను మర్చిపోలేరు. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0 సినిమా రెండేళ్లుగా ఇండియన్ సినిమా జనాలను ఊరిస్తూ ఊరిస్తూ ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రోబో 2.ఓ ఇప్పటికే ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సినిమా ప్రీమియర్ల టాక్ ఎలా ఉందో తెలుగుపోస్ట్ షార్ట్ రివ్యూలో చూద్దాం.
కథలోకి వెళితే...
ప్రజల సెల్ఫోన్లు సడెన్‌గా మాయమైపోతుండడంతో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఆ సెల్ ఫోన్లు అన్ని కలిసి పక్షి ఆకారంలోకి మారతాయి. ఈ నేపథ్యంలో సెల్ఫోన్లు పనిచేయక ప్రజాజీవనం ఒక్కసారిగా అస్తవ్యస్థమవుతుంది. ఈ పరిస్థితి కంట్రోల్ చేసేందుకు సైంటిస్ట్ వశీకరన్ (రజనీకాంత్) ప్రభుత్వ అనుమతితో చిట్టిని రీ లాంచ్ చేస్తాడు. ఆ తర్వాత చిట్టికి, ఆ పక్షిరాజాకు మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది ? అసలు ఈ సెల్ఫోన్లు ఎందుకు మాయమవుతున్నాయి ? దీని వెనక ఎవరు ఉన్నారు ? చివరకు వశీకరన్, చిట్టి కలిసి పరిస్థితి ఎలా కంట్రోల్ చేశారన్నదే ఈ సినిమా స్టోరీ.
శంకర్ ఎలా తీశాడంటే...
ఈ సినిమాలో వశీకరన్, చిట్టి పాత్రలో హావభావాలు అద్భుతం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ను అటు పక్షిరాజాగా, ఇటు కామన్‌మ్యాన్‌గా తీర్చిదిద్దిన తీరు అద్భుతం. తన ప్రతి సినిమాలోను సామాజిక అంశాలను జోడిస్తూ మంచి సందేశం చెప్పే శంకర్ ఈ సినిమాలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు. సెల్ఫోన్లకు మనిషి ఎలా ఎడిక్ట్ అవుతున్నాడు ? దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కోణంలో కథ చెపుతూనే, దానికి అద్భుతమైన సాంకేతిక హంగులు జోడించాడు. సాంకేతికంగా అన్ని విభాగాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
ప్లస్‌లు, మైనస్‌ల లెక్కేంటి....
చిట్టిగా రజనీ నటన, అక్షయ్‌కుమార్ విలనిజం, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, నేపథ్య సంగీతంతో పాటు అన్ని సాంకేతిక విభాగాలు సినిమాకు హైలెట్. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ అంచనాలు అందుకోలేకపోవడం, రజనీ మార్క్ స్టైల్ మిస్ కావడం, కథను మరీ గ్రిప్పింగ్‌గా తెరకెక్కించలేకపోవడం మైనస్.
ఫైనల్‌గా...
రోబో 2.ఓ కళ్లు చెదిరే విజువల్ వండర్