Sun Dec 22 2024 22:18:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆడవాళ్లు మీకు జోహార్లు రివ్యూ
ఉమ్మడి కుటుంబంలో గారాబంగా పెరిగిన ఒకే ఒక్క అబ్బాయి చిరంజీవి(శర్వానంద్). ఇంటిల్లిపాదికి చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవికి ..
చిత్రం - ఆడవాళ్ళు మీకు జోహార్లు
నటీనటులు - శర్వానంద్, రష్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు , ఝాన్సీ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం - సుజిత్ సారంగ్,
నిర్మాత - సుధాకర్ చెరుకూరి
దర్శకుడు - తిరుమల కిషోర్
విడుదల - 4-3-2022
టాలీవుడ్ లో ఈతరం నటుల్లో కుటుంబ కథా చిత్రాలకు శర్వానంద్ కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ.. కొంతకాలంగా శర్వానంద్ కు మంచి హిట్ పడలేదు. ''ఆడవాళ్ళు మీకు జోహార్లు'' సినిమాతోనైనా శర్వానంద్ కొట్టాడా ? తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లిపోదాం.
కథేంటంటే..
ఉమ్మడి కుటుంబంలో గారాబంగా పెరిగిన ఒకే ఒక్క అబ్బాయి చిరంజీవి(శర్వానంద్). ఇంటిల్లిపాదికి చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లంతా సంకల్పిస్తారు. అనుకున్నదే తడవు.. పెళ్లి సంబంధాలు చూస్తారు. చూపులకు వెళ్లిన ప్రతిచోటా చిరు కి అమ్మాయి నచ్చినా.. ఇంట్లో ఆడవాళ్లకు ఓ పట్టాన నచ్చరు. ఏదొక వంక పెడుతుంటారు. ఇంట్లో వాళ్ల వంకలతో విసిగిపోయిన చిరుకి ఆద్య(రష్మిక) కనిపిస్తుంది. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన ఆద్యకు చిరంజీవి దగ్గరవుతాడు. ఆద్య చిరంజీవి కుటుంబానికి కూడా నచ్చడంతో.. ఇక ఆమెనే తమ ఇంటి కోడలిగా తీసుకురావాలనుకుంటారు. కానీ ఆద్యకి పెళ్లి చేయడం వాళ్లమ్మ, వ్యాపారవేత్త అయిన వకుళ (ఖుష్బూ)కి ఇష్టం ఉండదు. అందుకు తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే కారణమవుతాయి. ఆద్య ఏమో తల్లిమాట జవదాటని కూతురు. ఇలాంటి పరిస్థితుల్లో చిరు - ఆద్యల పెళ్లి ఎలా జరిగింది ? చిరంజీవి వకుళ జీవితంలోకి ఎలా వెళ్లాడు ? ఆమెను ఎలా ఒప్పించాడు ? తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది ?
ఫ్యామిలీ ప్రేక్షకులే లక్ష్యంగా తెరకెక్కిన సినిమా ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''. పేరు మొదలుకుని.. టీజర్, ట్రైలర్లలో మహిళలదే ముఖ్య పాత్ర అన్నట్లుగా చూపించారు. మహిళల్ని ఆకర్షించేలా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఆడవాళ్ళ మధ్య పెరిగిన ఓ పద్ధతైన కుర్రాడు , పెళ్లిపై సదాభిప్రాయం లేని ఓ మహిళ చుట్టూ తిరిగే కథగా చూపించాడు దర్శకుడు. చిరు పెళ్లి కష్టాలతో మొదలయ్యే సినిమాలో.. చిరు అమ్మాయిలను తిరస్కరించడం దగ్గర్నుంచి.. అమ్మాయిలే చిరుని తిరస్కరించడం వరకూ వస్తుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే ఉన్నా.. సంభాషణలు మాత్రం అర్థవంతంగా ఉంటాయి.
సెకండాఫ్ లో అసలు కథ కనిపిస్తుంది. ఆద్య తల్లి వకుళ ప్రపంచంలోకి చిరు వెళ్లడం, అక్కడ చోటుచేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని కలిగించేలా చూపించారు. వకుళ గతాన్ని మాటల్లోనే చెప్పడంతో.. భావోద్వేగాలు అంతగా పండినట్లు ఉండవు. మొత్తానికి ఆడవాళ్ళు మీకు జోహార్లు.. ఇంటిల్లిపాదినీ మెప్పించే సినిమా.
ఎవరెలా చేశారంటే..
శర్వానంద్ తన పాత్రలో జీవించాడు. వెన్నెల కిషోర్, ఊర్వశి తదితరులతో కలిసిన చేసిన సరదా సన్నివేశాల్లో శర్వానంద్ బాగా నవ్వించాడు. ఇంటర్వెల్ కు ముందు.. శర్వా- ఊర్వశిల మధ్య వచ్చే సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. రష్మిక మందన్న సంప్రదాయమైన వస్త్రధారణలో అందంగా కనిపిస్తుంది. తల్లిచాటు కూతురిలా మెప్పించింది. రాధిక, ఖుష్బూ, ఝాన్సీ తదితరులను బలమైన పాత్రలలో చూపించడం సినిమాకు ప్లస్ పాయింట్స్. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో సత్య, ప్రదీప్ రావత్ లు కామెడీ పండించారు.
ప్లస్ పాయింట్స్
+ కీలకపాత్ర ధారుల నటన
+ స్వచ్ఛమైన కుటుంబ కథ
+ వినోదం, సంభాషణలు
మైనస్ పాయింట్స్
- ప్రేక్షకుడి ఊహకు తగ్గట్లుగా సాగే కథ
చివరిగా.. ''ఆడవాళ్ళు మీకు జోహార్లు'' కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమా
Next Story